- నిరుపయోగంగా చెక్‌డ్యాంలు
- విత్తనాలు అందించని ఐటీడీఏ
- ఏటా తప్పని నష్టాలు
అరకులోయ : మండలంలోని చినలబుడు పంచాయతీలోని గిరిజన రైతులకు కూరగాయల సాగు జీవనాధారం. ఈ పంచాయతీలో 14 గ్రామాలు ఉన్నాయి. సుమారు 600 మంది గిరిజన రైతులు ఉన్నారు. వీరిలో 400 మంది రైతులు కూరగాయల పంటలు సాగుచేస్తుంటారు. పండించిన కూరగాయలను విశాఖ, విజయనగరం ప్రాంతాల్లోని రైతు బజార్లకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. ఏటా అతివృష్టి, అనావృష్టి పంటలను దెబ్బ తీస్తున్నా వీరు కూరగాయల సాగునే నమ్ముకున్నారు.
ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు సమయానికి కురవకుండా ముఖం చాటేయ్యడంతో రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఏడాదికి రెండుసార్లు పంటలు పండించుకుని తద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణ, పిల్లల చదువుకు వినియోగిస్తుంటారు. ఒక్కో రైతు తమకున్న రెండు, మూడు ఎకరాల్లోనే పలు కూరగాయలను సాగు చేస్తుంటారు.
ఈ రైతుల కోసం పదిహేనేళ్ల క్రితం 16 చెక్ డ్యాంలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో మూడు చెక్‌డ్యాంలు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. మిగిలిన చెక్‌డ్యాంలను వినియోగంలోకి తీసుకురావాలని రైతులు ప్రభుత్వానికి, పాడేరు ఐటీడీఏ అధికారులకు గతంలో ఎన్నోమార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. వాతావరణం అనుకూలించి నీటి సదుపాయం కలిగితే ప్రతి రైతు ఏటా కూరగాయల సాగు ద్వారా రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఆదాయం పొందుతున్నట్టు రైతులు తెలిపారు.
గిరిజనులు పండించిన కూరగాయలు నేరుగా్గా విక్రయించుకోవడానికి విశాఖలోని ఎంవీపీ కాలనీలోని రైతు బజార్‌లో ఉచితంగా స్టాల్స్‌ను కూడా ప్రభుత్వం గిరిజన రైతులకు కేటాయించడంతో రైతులు కొంత ఊరట చెందుతున్నారు. పదేళ్ల క్రితం ఈ పంచాయతీలోని కూరగాయ రైతులను ప్రోత్సాహిస్తూ సబ్సిడీపై విత్తనాలు కూడా పాడేరు ఐటీడీఏ సరఫరా చేసేది. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. వేరే ప్రత్యామ్నాయం లేక పోవడంతో ఒడిశా, విశాఖ, విజయనగరం వంటి ప్రాంతాలకు వెళ్లి విత్తనాలు కొనుగోలు చేసుకుని వచ్చి సాగు చేస్తున్నారు.
ఈ ఏడాది నష్టం తప్పదు
చెక్‌డ్యాంలు ఎండిపోయాయి. వర్షం చాలా ఆలస్యమైంది. భూమి చదును చేసి, కూరగాయ నారలు సిద్ధం చేసి వర్షం కోసం ఎదురు చూస్తున్నాం.
-కిల్లో మొద్దు, కూరగాయ సాగు రైతు, చినలబుడు
ఐటీడీఏ చేయూత నివ్వాలి
గతంలో ఐటీడీఏ సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేసేది. అయితే పదేళ్లుగా ఐటీడీఏ గిరిజన రైతులను పట్టించుకోవడం లేదు. నిత్యం కూరగాయలు సాగు చేసి బతుకుతున్నాం. సబ్సిడీ విత్తనాలు సరఫరా చేసి రైతులకు కష్టకాలంలో ఆదుకుంటే బావుంటుంది.
-బురిడి డొంబు, కూరగాయల సాగుదారుడు, చినలబుడు