సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఊరిస్తూ.. ఊసురుమనిపిస్తున్న వర్షాలు జిల్లా రైతాంగానికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే విత్తనాలు విత్తుకున్న రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. పొద్దంతా భారీ వర్షాన్ని తలపించేలా ఆకాశంలో మేఘాలు ఆవరించి.. సాయంత్రానికి మాత్రం చినుకు రాల్చకుండా జారుకోవడంతో దిగులు చెందుతున్నారు.
ఈ నెల మొదటివారంలో ఒకట్రెండు వర్షాలు కొంత ఊరటనిచ్చినప్పటికీ.. ఆ తర్వాత వానల జాడ లేకుండాపోయింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జూన్ నెల నుంచి ఇప్పటివరకు 20.5 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 9.4సెంటీమీటర్లు మాత్రమే నమోదైంది. సాధారణం కంటే 52 శాతం లోటు వర్షం కురవడంతో సాగు చతికిలపడి కరువును తలపిస్తోంది.
పంటలు సాగైంది 38 శాతమే..
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రెండు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగయ్యేలా వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసి ఏర్పాట్లు చేపట్టింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జూన్ నెలలో సాగు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. నీటికొరతతో కొన్నిచోట్ల నారుమడుల్లోనే వరి ఎండిపోయింది. ఈ నెల మొదటివారంలో ఓ మోస్తరు వర్షాలు కురవడంతో రైతులు ఊరట చెందారు.
దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్న రైతులు నాటు వేశారు. అదను దాటిన వర్షాలు కొన్ని మండలాల్లోనే కురిశాయి. పలుచోట్ల విత్తనాలు వేసే స్థాయిలో వానలు పడకపోవడంతో వ్యవసాయ పనుల్లో పురోగతి లేదు. జిల్లాలో 1.84 లక్షల సాధారణ విస్తీర్ణానికి గాను ఆదివారం నాటికి 1.13 లక్షల హెక్టార్లలో పంటలు సాగవ్వాల్సి ఉంది. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా కేవలం 70,331 హెక్టార్లలో పంటలు సాగైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
మొత్తంగా సాధారణ విస్తీర్ణంలో 38 శాతం మాత్రమే పంటలు సాగవ్వడం గమనార్హం. గతేడాది సాధారణ విస్తీర్ణం కంటే 25శాతం ఎక్కువగా సాగైన మొక్కజొన్న, కంది పంటల సాగు ప్రస్తుత సీజన్లో భారీగా పతనమయ్యాయి. నాలుగువేల హెక్టార్లలో పండే ఆముదం పంట సాగు ఈసారి పది శాతానికి మించలేదు. జిల్లాలో దాదాపు 2వేల హెక్టార్లలో పండించే, వేరుశనగ, మసాలా దినుసుల, ఉల్లి పంటలు ఈసారి విత్తుకు నోచుకోలేదు.
అదను దాటితే అంతే..
సాధాక ణంగా జూన్ మొదటివారం నుంచి వర్షాలు కురవడంతో ఆ సమయంలోనే విత్తుల వేస్తారు. కానీ ఈసారి విచిత్ర పరిస్థితి నెలకొంది. రుతుపవనాలు సకాలంలోనే ప్రవేశించినప్పటికీ విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో వానలు కురవలేదు. జూన్ నెల ఆసాంతం చినుకులు మినహా భారీ వర్షం పడలేదు. దీంతో దుక్కులు దున్ని విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకున్న రైతులు.. వానల కోసం ఆకాశంవైపు దిగాలుగా చూశారు.
జూలై మొదటివారంలో ఒకట్రెండు వర్షాలు రైతన్నలో ఆశలు చిగురింపజేశాయి. దీంతో విత్తులు నాటారు. కానీ వానలు మొహం చాటేయడంతో మళ్లీ ఆకాశంవైపు దీనంగా చూస్తున్నాడు. మరో వారం రోజుల్లో వానలు ఊపందుకోకుంటే సాగు కష్టమేనని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విత్తనాలు వేయడంతో మరో నాలుగైదు రోజులు వానలు పడకుంటే ఆ విత్తు మొలకెత్తకుండా భూమిలోనే మురిగిపోయే అవకాశం ఉందని వ్యవసాయశాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనకర పరిస్థితిలో వ్యవసాయం
Published Mon, Jul 21 2014 2:01 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement