ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి) : కూరగాయల సాగులో అతివలు అద్భుతంగా రాణిస్తున్నారు. వరి, మొక్కజొన్న తదితర పంటలతో పాటు కూరగాయల సాగులో ఆధునిక పద్ధతులు అవలంభిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. కుటుంబాలకు ఆర్థిక చేయూతనందిస్తున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని దేవునిపల్లి, మల్లయపల్లి, మాచాపూర్ తదితర గ్రామాలలో మహిళలు కూరగాయల సాగులో తమదైన ముద్ర వేస్తున్నారు. సాధారణ పంటలతో పాటు రెండు, మూడు గుంటలలో కూరగాయలను పండించి అదనపు లాభాలు ఆర్జిస్తున్నారు. రెండెకరాల పొలం ఉన్న వారు అర ఎకరాన్ని కూరగాయల కోసమే కేటాయిస్తున్నారు. పాలకూర, తోటకూర, మెంతికూర, గంగవాయిల కూర, టమాట, వంకాయ, బెండకాయలు, కొత్తిమీర పండిస్తున్నారు.
ఎండల నుంచి రక్షణకు..
వేసవి తీవ్రత దృష్ట్యా పంటలు ఎండిపోకుండా మహిళలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎండ వేడిమికి కొత్తిమీర, పాలకూర తదితర పంటలు వాడి పోతున్నాయి. దీంతో గ్రీన్ నెట్లను ఏర్పాటు చేసి కూరగాయలను సాగు చేస్తున్నారు. దీంతో మొక్కలకు ఎండ తీవ్రత పెద్దగా తగలక పోవడంతో అధిక దిగుబడులు వస్తున్నాయి.
ఒక్కో గుంటలో ఒక్కో రకం
మహిళలు కేవలం ఒక రకమైన పంట కాకుండా అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. సీజనల్‌గా డిమాండ్ ఉన్న కూరగాయలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఒక గుంటలో వంకాయ లు, మరో గుంటలో టమాట, కొత్తిమీర, పాలకూర, మెంతికూర ఇలా ఒక్కో గుంటలో ఒక్కో రకమైన పంటలను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు.
కొత్తిమీర కిలో రూ.వంద
వేసవి తీవ్రత దృష్ట్యా మార్కెట్‌లో కొత్తిమీర సహా కూరగాయలకు అధికంగా డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం కిలో కొత్తిమీర ధర రూ.150–200 దాకా పలుకుతోంది. వ్యాపారులు రైతుల నుంచి కొత్తిమీర కిలోకు రూ.100 చొప్పున ఖరీదు చేస్తున్నారు. మొన్నటివరకు రూ.20–30 ఉండగా, ప్రస్తుతం ధర పెరుగుతోంది.
40 రోజుల్లో చేతికి..
వ్యవసాయ పంటలు 90 రోజుల నుంచి 120 రోజులు పడుతుంది. కానీ కూరగాయలు 40 రోజుల్లో చేతికి వస్తుండడంతో మహిళలు కూరగాయల సాగుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అలాగే, ప్రతి రోజూ డబ్బులు చేతికొస్తాయి. తక్కువ వ్యవధిలో పంట చేతికందడం, రోజూ చేతికి డబ్బు వస్తుండడంతో మహిళలు కూరగాయల సాగుకే మొగ్గు చూపుతున్నారు.
పైసల్ ఎక్కువొస్తాయ్
మిగిత పంటల కన్నా కాయగూరలు జల్ది చేతికొస్తాయ్. పైసల్ కూడా చేతిలో ఆడతాయి. అందుకే కూరగాయలు పండిస్తున్నాం. కొత్తిమీర, పాలకూర ఎండ తీవ్రతకు ఆడిపోతున్నాయి. దీంతో రూ.10 వేలు ఖర్చు చేసి గ్రీన్ నెట్లను ఏర్పాటు చేశాం. – స్వరూప, దేవునిపల్లిఎప్పుడూ పని ఉంటుంది
వ్యవసాయ పంటలతో పాటు కూరగాయలను సాగు చేస్తున్నా. కాయగూరలు అమ్మితే అచ్చే పైసలతోటి ఇంటి ఖర్చులు ఎళ్లిపోతున్నాయి. చేతి నిండా పని ఉంటుంది. అట్లనే పైసల్ కూడా చేతి నిండా ఉంటాయి. తక్కువ టైంల ఎక్కువగా డబ్బులు అస్తాయ్. – సిద్దవ్వ, మల్లయపల్లి
Comments
Please login to add a commentAdd a comment