మేడ్చల్ రూరల్: తీవ్ర వర్షాభావం కారణంగా కూరగాయల పంట సాగు తగ్గింది. దీంతో వాటి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సామాన్యులకు అందుబాటులో లేకుండాపోతున్నాయి. ఇటీవల 10 రోజు లుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఏ కూరగాయ చూసినా కిలోకు రూ.40 పలకడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
మేడ్చల్ మండల పరిసర ప్రాంతాల్లో వరి పంట సాగు తర్వాత అధికంగా కూరగాయల సాగు రైతులు చేపడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు కురవకపోవడంతో కూరగాయల పంట గణనీయంగా తగ్గింది. చెదురుమదురు వర్షాలకు అక్కడక్కడా వేసిన పంటలతో ఇన్ని రోజులు కూరగాయల దిగుబడి రావడం తో సాధారణ ధరలు పలికినా ప్రస్తుతం వాటి ధరలు పెరుగుతున్నాయి. కరువుతో భూగర్బ జలాలు అడుగంటాయి. బోరు బావుల్లో భూగర్భ జలాలు అడుగంటాయి.
ఇప్పటికే వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోయి రైతులు విలపిస్తున్నారు. రబీలో వ్యవసాయ సాగు చేయాలంటేనే భయపడుతున్న రైతులు మిన్నకుండిపోవడంతో కూరగాయల సాగు తగ్గింది. ఈ ప్రభావం ఇప్పుడిప్పుడే వినియోగదారులపై పడుతోంది. రబీ ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వర్షపాతం నమోదు గణనీయంగా తగ్గింది. ఈ సంవత్సరం మేడ్చల్ మండంలో జూన్ మాసం నుంచి అక్టోబర్ నెల చివరి వరకు 746.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి బదులుగా కేవలం 425.8 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది.
ప్రతి కూరగాయ కిలో రూ. 40పైనే..
మేడ్చల్ మార్కెట్‌లో ప్రతి కూరగాయ రూ 40పైనే చేరుకున్నాయి. 10 రోజుల క్రితం రూ.20 నుంచి రూ.25 ఉన్న కూరగాయలు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం వీటి ధర రూ.40 కన్నా తక్కువ లేకుండా ఉండటంతో సామాన్యులు ఆందోళనకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
మేడ్చల్ మార్కెట్‌లో చిక్కుడు కిలో రూ.60, బీర, బీర్నిస్ రూ.45, బెండ, గోరుచిక్కుడు, దొండ, వంకాయ, కాకర, పచ్చిమిర్చి రూ.40 ధర పలుకుతున్నాయి. టమాటా మాత్రం 15 ఉండటంతో కాస్త ఊరట కలిగించే అవకాశం. రబీ ప్రారంభంలోనే కూరగాయ ధరలు పెరుగుతుండడంతో భవిష్యత్‌లో వీటి ధరలు ఏ విధంగా ఉంటాయోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
కూరగాయలపై కరువు ప్రభావం
Published Thu, Nov 6 2014 11:37 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement