
అన్నను హత్య చేసిన తమ్ముళ్లు
మేడ్చల్ బస్టాండ్ సమీపంలో దారుణం
అడ్డుకునే ప్రయత్నం చేయని స్థానికులు
సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్‌లు
మేడ్చల్/ మేడ్చల్ రూరల్: అది జాతీయ రహదారి.. ఆదివారం సాయంత్రం కావస్తోంది.. జన సంచారం.. వందలాది వాహనాలు వస్తూ పోతున్నాయి. ఓ వ్యక్తి ప్రాణ భయంతో పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. అతడిని కొందరు వ్యక్తులు వెంబడించారు. అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ దారుణాన్ని అక్కడున్న వారు ఆపే ప్రయత్నం చేయకపోగా.. తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం..
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేటకు గుగులోతు గన్యా మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉమేష్ (25), రాకేష్ ఉన్నారు. వీరు మేడ్చల్ ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్నారు. పెద్ద కుమారుడు ఉమేష్ నిత్యం మద్యం తాగి వచ్చి భార్య ప్రియాంకను, సోదరుడు రాకేష్‌ను, ఇంట్లోని పిల్లలను వేధింపులకు గురి చేస్తుండేవాడు. దురలవాట్లకు బానిసైన అతడిని దుబాయ్‌కి పంపించే ఏర్పాట్లు చేస్తుండగా.. వాటిని కూడా చెడగొట్టాడు. ఈ క్రమంలో ఆదివారం సైతం మద్యం తాగి ఇంటికి వచ్చిన ఉమేష్.. కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగాడు.
అందరినీ చంపేస్తానంటూ బెదిరించాడు. ఇంట్లోనే ఉన్న సోదరుడు రాకేష్‌తో, చిన్నాన్న కుమారుడు లక్ష్మణ్‌లతో ఉమేష్ వాగ్వాదానికి దిగాడు. వారిని బీరు సీసాతో బెదిరించాడు. రాకేష్ లక్ష్మణ్‌లు అతడిని ప్రతిఘటించారు. దీంతో ఉమేష్ సమీపంలోని జాతీయ రహదారి వైపు పరుగెత్తాడు. రాకేష్ లక్ష్మణ్‌లు బస్టాండ్ సమీపంలో ఉమేష్‌ను పట్టుకుని రోడ్డుపై పడుకోబెట్టి కత్తితో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఉమేష్ మృతదేహంపై 12 కత్తిపోట్లు ఉన్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. మృతుడికి భార్య ప్రియాంక, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. హత్య ఘటన వీడియోల్లో ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నా.. మొత్తం ఐదుగురు పాల్గొన్నట్లు తెలుస్తోంది. రాకేష్ లక్ష్మణ్‌తో పాటు వీరి కుటుంబ సభ్యులు నవీన్, నరేష్ సురేష్‌లు ఉన్నట్లు సమాచారం.
ఉమేష్‌ను కత్తులతో దారుణంగా పొడుస్తున్నా.. అక్కడున్నవారు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. తమ మొబైల్ ఫోన్లలో హత్య చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తోటి మనిషి కత్తి పోట్లకు గురవుతున్నా.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా.. ఎవరూ స్పందించకపోవడం మానవత్వం కనుమరుగవుతోందనడానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment