అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : రైతుల కష్టార్జితం దళారుల పాలవుతోంది. కూరగాయల పంటలకు గిట్టుబాటు ధర లభించక అన్నదాతలు కుదేలవుతున్నారు. దళారులు, వ్యాపారులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు. రైతులకు అతి తక్కువ ధర లభిస్తున్న సందర్భంలోనూ బహిరంగ మార్కెట్లో వినియోగదారులకు ధరాఘాతం తప్పడం లేదు. సంప్రదాయ పంటల వల్ల వరుస నష్టాలు చవిచూస్తుండడం, దీర్ఘకాలిక పండ్ల తోటల నుంచి ఆదాయం తగ్గిపోవడంతో ఇటీవలి కాలంలో రైతులు స్వల్పకాలిక పండ్ల తోటలతో పాటు కూరగాయల సాగుపై ఎక్కువగా దృష్టి సారించారు. ముఖ్యంగా మూడు నెలల్లోపు చేతికొచ్చే కూరగాయల పంటల ద్వారా తమ దశ తిరుగుతుందనే ఆశతో వాటిని సాగు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా దాదాపు 35 వేల ఎకరాల్లో టమాట, వంగ, బెండ, మిరప, కాకర, బీర తదితర కూరగాయల పంటలు సాగు చేశారు. అందులోనూ టమాట ఏకంగా 15 వేల ఎకరాలు, మిరప ఐదు వేలు, బెండ, వంగ లాంటి పంటలు రెండు వేల ఎకరాల చొప్పున వేశారు. టమాట సాగుకు ఎకరాకు సగటున రూ.35 వేల పెట్టుబడి పెట్టారు.
కొందరైతే రూ.50 వేల దాకా పెట్టారు. మిరపకు రూ.50-60 వేలు, బెండ, వంగ పంటలకు రూ. 25-30 వేల వరకు ఖర్చు చేశారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మొదటి పక్షం వరకు మార్కెట్‌లో ధరలు కొంత మెరుగ్గానే ఉన్నాయి. జిల్లాలో పండించిన నాణ్యమైన టమాటను కోలారు, మదనపల్లి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేశారు. కొందరు జిల్లాలోనే మార్కెటింగ్ చేసుకున్నారు. కోలార్ మార్కెట్‌లో 15 కిలోల టమాట బాక్సు రూ.450 నుంచి రూ.500, మదనపల్లిలో 30 కిలోల బాక్సు రూ.950 నుంచి రూ.వెయ్యి దాకా ధర పలికాయి. అప్పట్లో రైతులకు కిలో టమాటపై రూ.30 దాకా గిట్టుబాటు అయింది.
అదే సందర్భంలో వినియోగదారులు కిలో రూ.60తో కొనుగోలు చేశారు. రైతుకు దక్కింది రూ.30 మాత్రమే కాగా... మిగిలిన మొత్తం దళారులు, వ్యాపారుల పాలైంది. ఇదిలావుండగా... డిసెంబర్ రెండో వారం నుంచి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దళారులు, వ్యాపారులకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేదు. వేలం పాడినందుకు 10 శాతం కమీషన్‌తో పాటు ఇతరత్రా ఆదాయం వారికి వచ్చేస్తోంది. ప్రస్తుతం 15 కిలోల బాక్సు రూ.10లోపు పలుకుతోంది. వంకాయల పరిస్థితి మరీ దారుణం. మిరప, బెండ లాంటి కూరగాయల ధరలూ తగ్గిపోయాయి. కానీ... వినియోగదారులకు వచ్చేసరికి కిలో టమాట రూ.5లకు పైగా పెట్టి కొంటున్నారు. ధర గిట్టుబాటు గాక చాలా మంది రైతులు టమాట, వంగ తోటలను పశువులు, గొర్రెలకు వదిలేస్తున్నారు.
ఉపయోగం లేని ఉద్యానశాఖ
ఎప్పుడు ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఏ పంట వేసుకుంటే గిట్టుబాటు ధర లభిస్తుంది, ఏ సమయంలో మంచి ధర ఉంటుంది... తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించడంలో ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు విఫలమవుతున్నారు. వారు పొలంబాట పట్టడం మరచిపోవడంతో రైతులకు అన్యాయం జరుగుతోంది. ఫలితంగా వేలకు వేలు పెట్టుబడులను నష్టపోతున్నారు. పండ్లతోటలకు మాదిరిగానే కూరగాయల పంటలకూ సరైన మార్కెటింగ్ సదుపాయం అందుబాటులోకి తెస్తే కొంతలో కొంతైనా మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు. అలాగే సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు.
వెజిట్రబుల్స్
Published Tue, Jan 14 2014 2:20 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement