గండేడ్, న్యూస్‌లైన్: వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచేశాయి. ఈ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో రైతుల పరిస్థితి మరింత దిగజారింది. వరి, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటచేతికొచ్చే సమయానికి మామిడి కాయలు నేలరాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
శనివారం మండల పరిధిలోని గాధిర్యాల్, చౌదర్‌పల్లి, మంగంపేట్, మొకర్లాబాద్, మహమ్మదాబాద్, షేక్‌పల్లి, వెంకట్‌రెడ్డిపల్లి తదితర గ్రామాల్లో కురిసిన వర్షానికి వరిపంట నేలకొరిగి, విత్తనాలు రాలిపోయాయి. ఈ వారం వ్యవధిలో మూడు సార్లు వడగళ్ల వాన కురవడంతో వందలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. అంతేకాకుండా వందలాది క్వింటాళ్ల మామిడి కాయలు నేలరాలాయి. దీనికితోడు గాలివానతో కొన్ని గ్రామాల్లో స్తంభాలు నేలకొరిగి కరెంటు సరఫరా నిలిచిపోయింది.
గాధిర్యాల్ గ్రామంలో పలు స్తంభాలు నెలకొరిగి నాలుగు రోజులు గడుస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కరెంటు లేక నీటి సరఫరా నిలిచిపోయి వరి దెబ్బతింటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు గాలివానతో దెబ్బతిన్నాయని, ప్రభుత్వం తమకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
రైతులను నిలువునా ముంచిన అకాల వర్షాలు
Published Sun, May 4 2014 12:16 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement