- పరిహారం అందివ్వాలని రాస్తారోకో
సింధనూరు టౌన్ : గత వారం కురిసిన అకాల వర్షాల నుంచి ఇంకా కోలుకోని రైతులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరిపంట తీవ్రంగా నష్టపోవడంతో రైతులు ఆకస్మిక రాస్తారోకో చేపట్టారు. తాలూకాలోని బసాపుర ఈజే, పగడదిన్ని క్యాంప్, కున్నటగి, దేవరగుడి, గీతాక్యాంప్, తుర్విహాళ, గుంజళ్లి తదితర గ్రామాల్లో వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఏపుగా పెరిగిన వరి పంట కోతకు వచ్చే దశలో అకాల వర్షాలు ముంచెత్తాయి. దిక్కుతోచని రైతులు నానిపోయిన వరి పణలను ట్రాక్టర్లలో వేసుకొని వచ్చి తాలూకాలోని బసాపుర క్యాంప్ వద్ద రాస్తారోకో చేపట్టారు.
ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జెడ్పీ మాజీ అధ్యక్షుడు బాదర్లి పంపనగౌడ, జెడ్పీ సభ్యుడు చందూసాబ్ ముళ్లూరు తదితరులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అనంతరం అక్కడకు చేరుకున్న జిల్లాధికారి శశికాంత్ సెంథిల్, తహశీల్దార్ గంగప్ప కల్లూరులను రైతులు చుట్టుముట్టారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీనివ్వడంతో రైతులు శాంతించి తమ ఆందోళన విరమించారు. అనంతరం రైతులు, నాయకులతో అధికారులు చర్చించారు. ప్రముఖులు మల్లనగౌడ కన్నారి, శ్రీనివాస్, పంపనగౌడ పూలబావి, ఎస్‌ఎన్ రాజు, సహాయక వ్యవసాయ అధికారి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రైతుల రాస్తారోకోతో సుమారు గంటసేపటికి పైగా ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది.
మూడు రోజుల్లో ప్రభుత్వానికి పంట నష్టంపై నివేదిక
అకాల వర్షంతో జరిగిన పంట నష్టంపై రైతులకు తగిన పరిహారం అందించేందుకు మూడు రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక పంపుతామని జిల్లాధికారి శశికాంత్ సెంథిల్ పేర్కొన్నారు. కౌలు రైతులకు కూడా పరిహారం అందింపజేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఆయన శుక్రవారం తాలూకాలోని బసాపుర క్యాంప్ వద్ద నష్టానికి గురైన వరి పంటను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. తహశీల్దార్ నేతృత్వంలో తాలూకాలో జరిగిన పంట నష్టంపై సర్వే జరిపించి నివేదిక రూపొందిస్తామన్నారు. గతంలో మాదిరిగా చెక్‌ల రూపంలోనే ఈసారి కూడా పరిహారం అందిస్తామన్నారు. అందువల్ల ప్రతిఒక్క రైతు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలన్నారు.
సింధనూరు టౌన్ : తాలూకాలో గురువారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షాలకు వరి పంటలు నీటి పాలయ్యాయి. గొరెబాళ్, సాసలమరి, సోమలాపుర గ్రామాల్లో కురిసిన వర్షం వల్ల కోత దశలో ఉన్న వరి పంట నేలకొరిగి భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి పంటల నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
అకాల వర్షాలతో కుదేలైన రైతులు
Published Sun, Apr 26 2015 2:55 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement