గతంలో జనవరి నెల వచ్చిందంటే మండలంలోని ఏ గ్రామంలో చూసినా వివిధ రకాల ద్రాక్ష తోటలు కనిపించేవి. ఈ నేపథ్యంలో రైతులు క్రమేణా నష్టాలు చవిచూస్తుండటంతో ఈ తోటలు కొన్ని గ్రామాలకే పరిమితమయ్యాయి. ఒకప్పుడు ద్రాక్ష సాగుకు ఎకరాకు రూ.50వేల నుంచి రూ.70వేల వరకు ఖర్చయ్యేది. ప్రస్తుతం లక్ష రూపాయల నుంచి రూ.1.50 లక్షలు దాటుతోంది. దీంతో పాటు పంటను ఆశిస్తున్న తెగుళ్లు ఎక్కువ కావడంతో క్రిమిసంహారక మందుల వాడకం పెరిగింది. ఖర్చులు సైతం పెరిగాయి. రెట్టింపు ఖర్చు అవుతుండటంతో పాటు సంవత్సరానికి ఒక పంట అదీ పంట సమయంలో ఏదో ఒక విపత్తుతో నష్టం వాటిల్లుతోంది.
దీంతో రైతులు ద్రాక్ష సాగు చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. ముఖ్యంగా అకాల వర్షాలు, ఈదురుగాలులు, మార్కెటింగ్ ఏజెన్సీలు ఎగుమతులను తగ్గించడం రైతులకు చెల్లించాల్సిన డబ్బుల్లో కోతలు పెట్టడంతో ద్రాక్ష రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు కొన్నేళ్లుగా ద్రాక్ష కిలో రూ.25నుంచి రూ.35 వరకు పలకడంలేదు. ప్రస్తుతం మండలంలోని పోతారంలో 15 (గతంలో 100 ఎకరాలు సాగుకు) ఎకరాలు, మూడుచింతలపల్లిలో 30 (గతంలో 100 ఎకరాలు) జగన్‌గూడలో 15 (గతంలో 50 ఎకరాలు) కొల్తూర్‌లో 50 (గతంలో 250 ఎకరాలు,) తుర్కపల్లిలో 100 ఎకరాల్లో (గతంలో 500 ఎకరాలు) ద్రాక్ష సాగు చేస్తున్నారు.
గతంతో పోలిస్తే సుమారు 70 శాతం మంది రైతులు ద్రాక్ష సాగు నుంచి వైదొలిగారు. తీగజాతి కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం ద్రాక్ష రైతుల సమస్యలపై దృష్టి సారించి చేయూతనిస్తే తప్ప తిరిగి ఈ పంటకు పూర్వవైభవం వచ్చేలాలేదు. ప్రస్తుత ప్రభుత్వం ద్రాక్ష తోటల రైతులకు సహాయం అందజేస్తామని చెబుతుండటంతో వారిలో చిరుఆశలు చిగురిస్తున్నాయి. నష్టాల ఊబిలో కొట్టుకుపోతున్న రైతులకు అండగా ఉండి ప్రభుత్వం ద్రాక్ష రైతులకు చేయూతనందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
అందిన ద్రాక్ష పుల్లన!
Published Wed, Nov 26 2014 11:33 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement