Vineyards
-
అందిన ద్రాక్ష పుల్లన!
గతంలో జనవరి నెల వచ్చిందంటే మండలంలోని ఏ గ్రామంలో చూసినా వివిధ రకాల ద్రాక్ష తోటలు కనిపించేవి. ఈ నేపథ్యంలో రైతులు క్రమేణా నష్టాలు చవిచూస్తుండటంతో ఈ తోటలు కొన్ని గ్రామాలకే పరిమితమయ్యాయి. ఒకప్పుడు ద్రాక్ష సాగుకు ఎకరాకు రూ.50వేల నుంచి రూ.70వేల వరకు ఖర్చయ్యేది. ప్రస్తుతం లక్ష రూపాయల నుంచి రూ.1.50 లక్షలు దాటుతోంది. దీంతో పాటు పంటను ఆశిస్తున్న తెగుళ్లు ఎక్కువ కావడంతో క్రిమిసంహారక మందుల వాడకం పెరిగింది. ఖర్చులు సైతం పెరిగాయి. రెట్టింపు ఖర్చు అవుతుండటంతో పాటు సంవత్సరానికి ఒక పంట అదీ పంట సమయంలో ఏదో ఒక విపత్తుతో నష్టం వాటిల్లుతోంది. దీంతో రైతులు ద్రాక్ష సాగు చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. ముఖ్యంగా అకాల వర్షాలు, ఈదురుగాలులు, మార్కెటింగ్ ఏజెన్సీలు ఎగుమతులను తగ్గించడం రైతులకు చెల్లించాల్సిన డబ్బుల్లో కోతలు పెట్టడంతో ద్రాక్ష రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు కొన్నేళ్లుగా ద్రాక్ష కిలో రూ.25నుంచి రూ.35 వరకు పలకడంలేదు. ప్రస్తుతం మండలంలోని పోతారంలో 15 (గతంలో 100 ఎకరాలు సాగుకు) ఎకరాలు, మూడుచింతలపల్లిలో 30 (గతంలో 100 ఎకరాలు) జగన్‌గూడలో 15 (గతంలో 50 ఎకరాలు) కొల్తూర్‌లో 50 (గతంలో 250 ఎకరాలు,) తుర్కపల్లిలో 100 ఎకరాల్లో (గతంలో 500 ఎకరాలు) ద్రాక్ష సాగు చేస్తున్నారు. గతంతో పోలిస్తే సుమారు 70 శాతం మంది రైతులు ద్రాక్ష సాగు నుంచి వైదొలిగారు. తీగజాతి కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం ద్రాక్ష రైతుల సమస్యలపై దృష్టి సారించి చేయూతనిస్తే తప్ప తిరిగి ఈ పంటకు పూర్వవైభవం వచ్చేలాలేదు. ప్రస్తుత ప్రభుత్వం ద్రాక్ష తోటల రైతులకు సహాయం అందజేస్తామని చెబుతుండటంతో వారిలో చిరుఆశలు చిగురిస్తున్నాయి. నష్టాల ఊబిలో కొట్టుకుపోతున్న రైతులకు అండగా ఉండి ప్రభుత్వం ద్రాక్ష రైతులకు చేయూతనందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
వాటర్.. వైన్ అయిపోద్ది!
వాషింగ్టన్: కేవలం నీళ్లు, ద్రాక్ష ఉపయోగించి ఇంట్లోనే వైన్ తయారుచేసుకోగలిగితే..? అదీ మూడు రోజుల్లో, మనకు నచ్చినట్లుగా అయితే..!? భలేగా ఉంటుంది కదూ.. ఇలాంటి ‘మిరాకిల్ మెషీన్’ను అమెరికాకు చెందిన వైన్ తయారీ నిపుణుడు కెవిన్ బోయర్, బ్రిటన్‌కు చెందిన ఫిలిప్ జేమ్స్ రూపొందించారు. కేవలం రూ. 30 వేల విలువైన ఈ యంత్రంతో.. బయట దొరికే ధరలో పదోవంతుతోనే వైన్‌ను తయారుచేసుకోవచ్చని వారు చెబుతున్నారు. సాధారణంగా వైన్ తయారీ ప్రక్రియలో ఉండే పులియబెట్టడం సహా అన్ని దశలూ.. ఈ యంత్రంలోనే వాటంతట అవే జరిగిపోతాయి. యంత్రంలోని చాంబర్లో నీళ్లు పోసి ద్రాక్షపళ్ల గుజ్జు, ఈస్ట్‌ను కలిపితే చాలు. చాంబర్లలోని సెన్సార్లు వైన్ రూపొందే ప్రక్రియను ఎప్పటికప్పుడు గమనించి, బ్లూటూత్ ద్వారా మన స్మార్ట్‌ఫోన్‌కు పంపుతాయి. ఈ యంత్రంతో పాటు వచ్చే మొబైల్ యాప్‌తో.. వైన్‌కు ఎలాంటి రుచి ఉండాలో కూడా నిర్దేశించుకోవచ్చు. మనకు కావాల్సిన రుచి కోసం ఏయే పదర్థాలను వాడాలి, ఎంత మోతాదులో వాడాలో ఈ యాప్ సూచిస్తుంది. వైన్ ఎంత పాతబడితే అంత రుచి వస్తుందంటారు కదా..! వైన్ తయారైన తర్వాత అలాంటి వేర్వేరు రుచులకోసం ప్రత్యేకమైన పొడుల (పౌడర్)ను అందజేస్తారు. వైన్ తయారుకాగానే.. ‘తాగేందుకు వైన్ సిద్ధమైంది’ అంటూ మొబైల్లోని యాప్ చెప్పేస్తుంది కూడా. మొత్తంగా బయట దాదాపు రూ. 1,200 విలువైన వైన్‌ను రూ. 120 ఖర్చుతో తయారు చేసుకోవచ్చట. -
అకాల వర్షం.. అపార నష్టం
మోమిన్‌పేట, న్యూస్‌లైన్: అకాల వర్షం వల్ల అపార నష్టం జరిగింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఉల్లి రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సోమవారం రాత్రి వడగళ్లకు మండలంలో ఉల్లిపంట పూర్తిగా దెబ్బతిన్నది.మండలంలో మేకవనంపల్లి, కోల్కుంద, రాళ్లగుడుపల్లి, ఏన్కతల, కాసులాబాదు, బూర్గుపల్లి, మోమిన్‌పేట, దేవరంపల్లి, చీమల్‌దరి, చక్రంపల్లి తదితర గ్రామాల్లో సుమారు 800ఎకరాల్లో ఉల్లి పంట సాగుచేశారు. వర్షం పడటంతో ఉల్లిఆకు పూర్తిగా నేలవారింది. ఉల్లిగడ్డ ఊరే దశంలో ఆకులన్నీ విరిగి నేలకొరగడంతో పంట ఆగిపోతుందని రైతులు పేర్కొంటున్నారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి పంటలను సాగుచేస్తే వడగళ్లు దెబ్బతిశాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లినారు వేసేటప్పుడు నానాఇబ్బందులు పడి...పంట ఎదుగుదల బాగుంది అనుకుంటుండగా అకాల వర్షం నిరాశకు గురిచేసిందని వారు వాపోతున్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టితే వర్షం వల్ల అన్నీ నెలపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. శామీర్‌పేట్, న్యూస్‌లైన్ : అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వడగళ్లవాన, ఈదురుగాలులకు వందలాది ఎకరాల కూరగాయలు, ద్రాక్ష తోటలు దెబ్బతిన్నాయి. ద్రాక్ష తోటల యజమానులకు లక్షల్లో నష్టం వాటి ల్లింది. మండలంలోని 22 పంచాయతీల పరిధిలో ఈ సీజన్లో వంద ఎకరాల పత్తి, ఏడు వందల ఎకరాల్లో మామిడి, వెయ్యి ఎకరాల్లో ద్రాక్ష సాగులో ఉంది. సోమ, మంగళవారాలు కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మండలంలోని లాల్గడిమలక్పేట్, శామీర్‌పేట్, బాబాగూడ, అలియాబాద్, పొన్నాల్, బొమ్మరాశిపేట్, కొల్తూర్, అనంతారం, పోతారం, నారాయణపూర్ గ్రామాలు ద్రాక్ష తోటలకు పెట్టింది పేరు. వారం రోజుల క్రితం ద్రాక్ష తోట, మామిడి పూత బాగుండడంతో ఆశించిన మేరకు దిగుబడులు వస్తాయని రైతన్న ఆనందంలో ఉన్నాడు. ఇంతలోనే అనుకోని వర్షాలు వారి ఆశలను గల్లంతు చేశాయి. పోతారంలో 15 ఎకరాలు, తుర్కపల్లిలో 200 ఎకరాలు, కొల్తూర్‌లో 60 ఎకరాలు, లక్ష్మాపూర్‌లో 40ఎకరాల్లో ద్రాక్ష తోటలు పూర్తిగా నాశనమయ్యాయి. వీటితో పాటు 300 ఎకరాల్లో మామిడి తోటలు పాడయ్యాయి. ఆరేళ్లుగా న ష్టాలతో ఉన్న తమపై ప్రకృతి మరోసారి ప్రతాపం చూపిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.