మోమిన్‌పేట, న్యూస్‌లైన్: అకాల వర్షం వల్ల అపార నష్టం జరిగింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఉల్లి రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సోమవారం రాత్రి వడగళ్లకు మండలంలో ఉల్లిపంట పూర్తిగా దెబ్బతిన్నది.మండలంలో మేకవనంపల్లి, కోల్కుంద, రాళ్లగుడుపల్లి, ఏన్కతల, కాసులాబాదు, బూర్గుపల్లి, మోమిన్‌పేట, దేవరంపల్లి, చీమల్‌దరి, చక్రంపల్లి తదితర గ్రామాల్లో సుమారు 800ఎకరాల్లో ఉల్లి పంట సాగుచేశారు. వర్షం పడటంతో ఉల్లిఆకు పూర్తిగా నేలవారింది. ఉల్లిగడ్డ ఊరే దశంలో ఆకులన్నీ విరిగి నేలకొరగడంతో పంట ఆగిపోతుందని రైతులు పేర్కొంటున్నారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి పంటలను సాగుచేస్తే వడగళ్లు దెబ్బతిశాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లినారు వేసేటప్పుడు నానాఇబ్బందులు పడి...పంట ఎదుగుదల బాగుంది అనుకుంటుండగా అకాల వర్షం నిరాశకు గురిచేసిందని వారు వాపోతున్నారు.
అప్పులు చేసి పెట్టుబడి పెట్టితే వర్షం వల్ల అన్నీ నెలపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
శామీర్‌పేట్, న్యూస్‌లైన్ : అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వడగళ్లవాన, ఈదురుగాలులకు వందలాది ఎకరాల కూరగాయలు, ద్రాక్ష తోటలు దెబ్బతిన్నాయి. ద్రాక్ష తోటల యజమానులకు లక్షల్లో నష్టం వాటి ల్లింది. మండలంలోని 22 పంచాయతీల పరిధిలో ఈ సీజన్‌లో వంద ఎకరాల పత్తి, ఏడు వందల ఎకరాల్లో మామిడి, వెయ్యి ఎకరాల్లో ద్రాక్ష సాగులో ఉంది. సోమ, మంగళవారాలు కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.
మండలంలోని లాల్‌గడిమలక్‌పేట్, శామీర్‌పేట్, బాబాగూడ, అలియాబాద్, పొన్నాల్, బొమ్మరాశిపేట్, కొల్తూర్, అనంతారం, పోతారం, నారాయణపూర్ గ్రామాలు ద్రాక్ష తోటలకు పెట్టింది పేరు. వారం రోజుల క్రితం ద్రాక్ష తోట, మామిడి పూత బాగుండడంతో ఆశించిన మేరకు దిగుబడులు వస్తాయని రైతన్న ఆనందంలో ఉన్నాడు. ఇంతలోనే అనుకోని వర్షాలు వారి ఆశలను గల్లంతు చేశాయి. పోతారంలో 15 ఎకరాలు, తుర్కపల్లిలో 200 ఎకరాలు, కొల్తూర్‌లో 60 ఎకరాలు, లక్ష్మాపూర్‌లో 40ఎకరాల్లో ద్రాక్ష తోటలు పూర్తిగా నాశనమయ్యాయి. వీటితో పాటు 300 ఎకరాల్లో మామిడి తోటలు పాడయ్యాయి. ఆరేళ్లుగా న ష్టాలతో ఉన్న తమపై ప్రకృతి మరోసారి ప్రతాపం చూపిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
అకాల వర్షం.. అపార నష్టం
Published Tue, Mar 4 2014 11:41 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement