వాటర్.. వైన్ అయిపోద్ది!
వాషింగ్టన్: కేవలం నీళ్లు, ద్రాక్ష ఉపయోగించి ఇంట్లోనే వైన్ తయారుచేసుకోగలిగితే..? అదీ మూడు రోజుల్లో, మనకు నచ్చినట్లుగా అయితే..!? భలేగా ఉంటుంది కదూ.. ఇలాంటి ‘మిరాకిల్ మెషీన్’ను అమెరికాకు చెందిన వైన్ తయారీ నిపుణుడు కెవిన్ బోయర్, బ్రిటన్‌కు చెందిన ఫిలిప్ జేమ్స్ రూపొందించారు. కేవలం రూ. 30 వేల విలువైన ఈ యంత్రంతో.. బయట దొరికే ధరలో పదోవంతుతోనే వైన్‌ను తయారుచేసుకోవచ్చని వారు చెబుతున్నారు.
సాధారణంగా వైన్ తయారీ ప్రక్రియలో ఉండే పులియబెట్టడం సహా అన్ని దశలూ.. ఈ యంత్రంలోనే వాటంతట అవే జరిగిపోతాయి. యంత్రంలోని చాంబర్‌లో నీళ్లు పోసి ద్రాక్షపళ్ల గుజ్జు, ఈస్ట్‌ను కలిపితే చాలు.
చాంబర్లలోని సెన్సార్లు వైన్ రూపొందే ప్రక్రియను ఎప్పటికప్పుడు గమనించి, బ్లూటూత్ ద్వారా మన స్మార్ట్‌ఫోన్‌కు పంపుతాయి.
ఈ యంత్రంతో పాటు వచ్చే మొబైల్ యాప్‌తో.. వైన్‌కు ఎలాంటి రుచి ఉండాలో కూడా నిర్దేశించుకోవచ్చు. మనకు కావాల్సిన రుచి కోసం ఏయే పదర్థాలను వాడాలి, ఎంత మోతాదులో వాడాలో ఈ యాప్ సూచిస్తుంది.
వైన్ ఎంత పాతబడితే అంత రుచి వస్తుందంటారు కదా..! వైన్ తయారైన తర్వాత అలాంటి వేర్వేరు రుచులకోసం ప్రత్యేకమైన పొడుల (పౌడర్)ను అందజేస్తారు.
వైన్ తయారుకాగానే.. ‘తాగేందుకు వైన్ సిద్ధమైంది’ అంటూ మొబైల్‌లోని యాప్ చెప్పేస్తుంది కూడా. మొత్తంగా బయట దాదాపు రూ. 1,200 విలువైన వైన్‌ను రూ. 120 ఖర్చుతో తయారు చేసుకోవచ్చట.