రైతును ముంచిన అకాల వర్షం
మిరుదొడ్డి, న్యూస్‌లైన్: అకాల వర్షాలు రైతన్నను వెంటాడుతున్నాయి. ఇదే నెల మొదటి వారంలో రెండుసార్లు కురిసిన వడగళ్ల వానలకు పంటలను కోల్పోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి రైతన్న మరోమారు ఇబ్బందుల పాలయ్యారు. మిరుదొడ్డితోపాటు అల్మాజీపూర్, జంగపల్లి, వీరారెడ్డిపల్లి, రుద్రారం తదితర గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలకు 5 ఎకరాల్లో సాగు చేస్తున్న మునగ తోట నేల పాలైంది. దీంతో సుమారు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లింది.
తనను ఆదుకోవాలంటూ బాధితుడు కనకయ్య అధికారులను కోరారు. మిరుదొడ్డి, జంగపల్లి, రుద్రారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలతోపాటు ఆయా గ్రామాల్లోని ధాన్యం కల్లాల వద్ద వర్షపు నీరు నిలిచి వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యింది. కొనుగోలు కేంద్రాల్లో నిలిచిన వర్షపు నీటిని మహిళా రైతులు ఎత్తి పోశారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.