సాక్షి, రంగారెడ్డి జిల్లా: అల్పపీడన ప్రభావంతో జిల్లా రైతాంగం విలవిల్లాడుతోంది. పక్షం రోజుల క్రితం కురిసిన అకాలవర్షాలతో పంటలు నష్టపోగా... తాజా వర్షాలు మరింత నష్టాల్లోకి నెడుతున్నాయి. గురు, శుక్రవారాల్లో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో చేతికొచ్చే దశలో ఉన్న వరి పంటతో పాటు పెద్దఎత్తున మామిడి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. వర్షానికి గాలి తోడవడంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పూడూరు మండలంలో బైక్‌పై వెళ్తున్న యువకుడిపై విద్యుత్ స్తంభం పడిపోవడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. భారీ వర్షం కురవడంతో శంకర్‌పల్లిలోని మూసీ, షాబాద్‌లోని ఈసీ వాగులు అలుగు దాటి రోడ్డెక్కి ఉధృతంగా ప్రవహించాయి. దీంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
భారీగా పంట నష్టం..
ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న రైతాంగాన్ని అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు మరింత నష్టాలపాలు చేస్తున్నాయి. గత వారం కురిసిన వర్షాలకు జిల్లాలో రెండున్నరవేల హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో అధికంగా 1,777 హెక్టార్లలో వరి పంట పూర్తిగా పాడైంది. తాజా వర్షాలతో ఈ నష్టం మరింత పెరగనుంది. మరో 24 గంటల పాటు భారీ వ ర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో జరిగిన నష్టాన్ని గుర్తించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఉపక్రమించారు. రెండు, మూడు రోజుల్లో ప్రాథమిక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులు చెబుతున్నారు.
రైతు విలవిల
Published Sat, May 10 2014 12:19 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement