కనెక్షన్ల పేరుతో కలెక్షన్‌.. మేం ఫిక్స్‌ చేసిందే రేటు | Hyderabad: Electricity Department Officers Fully Corrupted On New Electric Connection | Sakshi
Sakshi News home page

కనెక్షన్ల పేరుతో కలెక్షన్‌.. మేం ఫిక్స్‌ చేసిందే రేటు

Published Mon, Aug 23 2021 10:09 AM | Last Updated on Fri, Aug 27 2021 11:54 AM

Hyderabad: Electricity Department Officers Fully Corrupted On New Electric Connection - Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొత్త విద్యుత్‌ లైన్లు.. మీటర్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు విద్యుత్‌ శాఖ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్‌ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. అడిగినంత ఇచ్చేందుకు నిరాకరించిన వారికి కొర్రీలు పెట్టి రోజుల తరబడి కనెక్షన్లు జారీ చేయడం లేదు. జిల్లా పరిధిలోని చంపాపేట, గచ్చిబౌలి, శంషాబాద్, రాజేంద్రనగర్, సరూర్‌ నగర్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, కందుకూరు, సైబర్‌సిటీ డివిజన్లలో పని చేస్తున్నఇంజనీర్లపైపెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. చర్యలు తీసుకోవాల్సిన యాజమాన్యమే పరోక్షంగా వారికి సహకరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  
► ఇతర జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డి భిన్నమైంది. అంతర్జాతీయ విమానాశ్రయం సహా జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు, ఐటీ అనుబంధ కంపెనీలు, భారీ పరిశ్రమలు ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి.  
►  ఈ ప్రాంతం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికే  కాకుండా అంతర్జాతీయ పారిశ్రామిక రంగానికి కేంద్ర బిందువుగా మారింది. 
►  కొత్తగా అనేక వెంచర్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. 
►  వ్యవసాయం సహా మరే ఇతర రంగం మనుగడైనా విద్యుత్‌పైనే ఆధారపడి ఉంటుంది. 
►  గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు వారి అవసరాల కోసం విద్యుత్‌ సరఫరా చేయాల్సిందిగా డిస్కంకు దరఖాస్తు చేసుకుంటున్నాయి.  
► 18 మీటర్లు దాటిన బహుళ అంతస్తుల భవనాలకు ఫైర్, మున్సిపాలిటీ, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీల నుంచి ఎన్‌ఓసీ తప్పనిసరి.  
►  ప్రస్తుత భవనాల్లో చాలా వరకు నిబంధనల మేరకు లేకపోవడం విద్యుత్‌ ఇంజనీర్లకు కలిసివస్తోంది.  
►  కొత్త లైన్లు సహా కొత్త మీటర్ల జారీ, ప్యానల్‌ బోర్డులు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నిబంధనలను సాకుగా చూపి కనెక్షన్ల జారీలో జాప్యం చేస్తున్నారు.  
►  క్షేత్రస్థాయిలోని ఏఈ వేసిన ఎస్టిమేషన్‌ ఛార్జీలను చెల్లించినప్పటికీ ఇంజనీర్లు మాత్రం పైసా విదల్చనిదే ఫైలు ముందుకు కదపడం లేదు. ఒక్కో పనికి ఒక్కో రేట్‌ ఫిక్స్‌ 
► జిల్లాలో మొత్తం 17,18,745 విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, వీటిలో సైబర్‌ సిటీలో 5,51,107, రాజేంద్రనగర్‌లో 5,36,743, సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో 6,30,895 కనెక్షన్లు ఉన్నాయి.  
►  ఒక్కో సర్కిల్‌ పరిధిలో నెలకు సగటున రెండు వేల కొత్త కనెక్షన్లు వస్తుంటాయి.  
►  కొత్త మీటర్‌ జారీకి రూ.1000 నుంచి రూ.1,500 వసూలు చేస్తుండగా, ప్యానల్‌ బోర్డుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు తీసుకుంటున్నారు.  
► ఇక అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్‌ కావాలంటే మీటర్లు, ప్యానల్‌ బోర్డు సహా డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫ్రార్మర్లకు రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిమాండ్‌ చేస్తుండడం విశేషం.  
►  తుర్కయంజాల్, తుక్కుగూడ, బడంగ్‌పేట్, మీర్‌పేట్, పెద్ద అంబర్‌పేట్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం, కొత్తూరు, బండ్లగూడ జాగీర్, నానక్‌రాంగూడ, నార్సింగి, రాజేంద్రనగర్, మెయినాబాద్, షాద్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో పని చేస్తున్న ఇంజనీర్లపై ఉన్నతాధికారులకు ఎక్కువగా ఈ తరహా ఫిర్యాదులు అందుతున్నాయి.   

పెండింగ్‌లో 3,589 వ్యవసాయ కనెక్షన్ల దరఖాస్తులు 
►  వరి, ఇతర పంటలు సాగు చేసుకునేందుకు జిల్లాలో ఇప్పటికే వేలాది మంది రైతులు విద్యుత్‌ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.  
►  సైబర్‌సిటీలో 909, రాజేంద్రనగర్‌లో 1,712, సరూర్‌నగర్‌లో 968 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటం గమనార్హం.  
► ఐపీడీఎస్‌ పథకం కింద డిస్కం జిల్లాకు సరఫరా చేసిన ట్రాన్స్‌ఫార్మర్లను వాణిజ్య, పారిశ్రామిక, బహుళ అంతస్తుల భవనాలకు మళ్లించి రూ.లక్షలు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  
►  కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకుని, ఎస్టిమేషన్‌ మేరకు బిల్లు చెల్లించిన రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు.  
►  2021–22 వార్షిక సంవత్సరంలో 2,300 కనెక్షన్లు జారీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించి ఇప్పటి వరకు 1,377 కనెక్షన్లు మాత్రమే జారీ చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement