సాక్షి, హైదరాబాద్: మెట్రోలు, పెద్ద నగరాల్లో ఇకపై విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అంతరాయాలు లేకుండా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాల్సి రానుంది. సరఫరాలో అంతరాయం కలిగితే డిస్కంలు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గురువారం విద్యుత్ (వినియోగదారుల హక్కుల) నిబంధనల సవరణ ముసాయిదా–2021ను ప్రకటించింది. పెద్ద నగరాల్లో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో డీజిల్ జనరేటింగ్ సెట్ల వినియోగాన్ని నియంత్రించేందుకు ఈ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ ముసాయిదాపై అక్టోబర్ 21లోగా అభ్యంతరాలు, సూచనలు తెలపాలని కోరింది. ముసాయిదాలోని ముఖ్యాంశాలు..
తెరపైకి కొత్తగా విశ్వసనీయత చార్జీలు
పెద్ద నగరాల్లో వినియోగదారులు డిస్కంలు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా నగరాలకు సంబంధించి..సగటు అంతరాయాల పునరావృతం సూచిక, సగటు అంతరాయాల వ్యవధి సూచికలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) రూపకల్పన చేయనుంది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సిన అవసరముంటే, అందుకు అవసరమైన పెట్టుబడిని వినియోగదారుల నుంచి ‘రిలయబిలిటీ (విశ్వసనీయత) చార్జీల’పేరుతో వసూలు చేసుకోవడానికి ఈఆర్సీ అనుమతించనుంది. నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైతే డిస్కంలకు ఈఆర్సీ జరిమానాలు విధించనుంది.
ఐదేళ్లలో జనరేటర్లు మాయం
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బ్యాకప్‌గా డీజిల్ జనరేటర్లు ఉపయోగిస్తున్న వినియోగదారులు ఈ ముసాయిదా అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఐదేళ్లలోగా, లేదా రాష్ట్ర ఈఆర్సీ నిర్దేశించిన కాల వ్యవధిలోగా బ్యాటరీలతో కూడిన పునరుత్పాదక విద్యుత్ వంటి కాలుష్య రహిత టెక్నాలజీకి మారాలి. సంబంధిత నగరంలో డిస్కంల విద్యుత్ సరఫరా విశ్వసనీయత ఆధారంగా ఈఆర్సీ ఈ గడువును నిర్దేశిస్తుంది. నిర్మాణ కార్యకలాపాలు, ఇతర తాత్కాలిక అవసరాలకు దర ఖాస్తు చేసుకున్న 48 గంటల్లోగా విద్యుత్ కనెక్షన్లు జారీ చేయాల్సి ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment