సాక్షి, అమరావతి: పసలేని కథనాలకు ఈనాడు కేరాఫ్‌గా మారింది. లేని వాటిని ఉన్నట్లుగా అవాస్తవాల అచ్చుతో పబ్బం గడుపుకుంటోంది. అలాంటి పనికిరాని కథనాల్లో ఒకటి ఈ విద్యుత్ కోతల కథనం. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ఏ విధమైన విద్యుత్ కోతలు అమలులో లేవు. అయినా ప్రతి రోజూ 2 – 3 గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఈనాడు పదే పదే అసత్య ప్రచారం చేస్తోంది.
ప్రజలు నవ్వుతారనే కనీస ఇంగితం కూడా లేకుండా గత ప్రభుత్వంలో ఐదేళ్లూ విద్యుత్ కోతలే లేవని మరో అబద్ధం చెబుతోంది. వేసవి కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం రోజూ రూ.కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్‌ను కొని మరీ ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సరఫరా చేస్తుంటే, కరెంటు కొనలేరా? అంటూ కళ్లుండీ గుడ్డిరాతలు అచ్చేసింది. అసలు వాస్తవాలను ఇంధన శాఖ ‘సాక్షి’కి వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం..
ఆరోపణ: డిమాండ్ మేరకు విద్యుత్ అందుబాటులో లేనప్పుడు మార్కెట్‌లో కొనాలి. అలా కాకుంటే ఉత్పత్తి చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ లేని కోతలు ఇప్పుడెందుకు వచ్చాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవం: ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఈ ఐదు నెలల్లో ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో రూ.3059.4 కోట్లు వెచ్చించి 3,633.81 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసింది. అలాగే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వంద శాతం కరెంటు ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 40 నుంచి 45 శాతం ఏపీజెన్‌కో నుంచే సమకూరుతోంది. రోజూ దాదాపు 105 మిలియన్ యూనిట్లు జెన్‌కో అందిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో ఏ ఒక్క రోజూ విద్యుత్ కోతలు విధించాలి్సన అవసరమే రావడంలేదు.
ఆరోపణ: షెడ్యూల్ వేసి సరఫరా నిలిపివేస్తున్నారు. డిమాండ్ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోత పెడుతున్నారు.
వాస్తవం: విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోల్చితే భారీగా పెరిగింది. దీంతో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ రేట్లు అధికంగా ఉన్నప్పటికీ యూనిట్ పది రూపాయలైనా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అంతరాయాల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోంది. సర్దుబాటు అవసరమే లేదు. ఈనాడు చెబుతున్న 0.24 మిలియన్ యూనిట్లు, 0.19 మిలియన్ యూనిట్లు అనేది కేవలం గ్రిడ్ ఫ్రీక్వెన్సీని నిర్దిష్ట స్థాయిలో నిలిపి ఉంచడానికి చేసిన డిమాండ్ సర్దుబాటు మాత్రమే. విద్యుత్ కొరతో లేక కోతో కాదు.
ఆరోపణ: రాత్రి వేళ అనూహ్యంగా పెరుగుతున్న డిమాండ్‌ను నియంత్రించలేని పరిస్థితి. ఆ సమయంలో కోతలకు సాంకేతిక కారణాలను సాకుగా చెబుతున్నారు.
వాస్తవం: వేసవి కారణంగా రాత్రి వేళ అనూహ్యంగా విద్యుత్ వినియోగం పెరిగి 11 కె.వి. పంపిణీ ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. 33 కె.వి. లైన్లపై, సబ్‌స్టేషన్లపై కూడా అధిక లోడు ప్రభావం ఉంటోంది. దీంతో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. పంపిణీ సంస్థ (డిస్కం)లలో క్షేత్ర స్థాయిలో 33/11 కె.వి. సబ్‌స్టేషన్ పరిధిలో 24 గంటలు నిర్వహణ సిబ్బంది అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అధిక లోడు, అధిక ఉష్ణోగ్రతలు, అకాల గాలివానల వల్ల కొన్ని చోట్ల స్వల్పకాలం ఏర్పడే విద్యుత్ అంతరాయాలను భూతద్దంలో చూపిస్తూ రాష్ట్రమంతటా పరిస్థితి ఇలానే ఉందని ఈనాడు కట్టు కథలు అల్లుతోంది.
ఆరోపణ: ప్రకాశం జిల్లాలో 2, 3 గంటలు, విజయనగరం జిల్లాలో 2 నుంచి 4 సార్లు కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు జనరేటర్లపై ఆధారపడాల్సి వస్తోంది.
వాస్తవం: వేసవి ఎండలు, వాతావరణంలో మార్పుల కారణంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం, విజయనగరం జిల్లా గజపతినగరం, రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు, గాలులు సంభవిస్తున్నాయి. ఈ కారణంగా విద్యుత్ స్తంభాలు విరగడం, ట్రాన్స్‌ఫార్మర్లు పడిపోవడం జరుగుతోంది. వాటిని పునరుద్ధరించే క్రమంలో ఆ ప్రాంతాల్లో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంతే తప్ప విద్యుత్ కోతలు విధిస్తున్నారనేది అవాస్తవం.
ఆరోపణ: లోడ్ అంచనా వేసి ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. కానీ డిస్కంలు అలా చేయలేకపోయాయి.
వాస్తవం: వేసవి కాలంలో రాత్రి వేళ ఏసీలు, కూలర్ల వినియోగం బాగా పెరిగింది. తద్వారా పెరిగే డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ సరఫరా కూడా జరుగుతోంది. ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలో లోడును అంచనా వేసి దానికి తగ్గట్టుగా కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వాడుకునేలా మరికొన్ని ట్రాన్స్‌ఫార్మర్లు డిస్కంల వద్ద సిద్ధంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment