అసెంబ్లీలో బాబు ఏం చెప్పారో చూడండి...
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు అదే పనిగా అబద్ధాలు చెబుతూ... వైఎస్ జగన్ ప్రభుత్వం ‘సాక్షి’ పత్రికకు అడ్డగోలుగా దోచిపెట్టేసిందని ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల కూటమి ఇపుడు అసెంబ్లీలో నిజాలు చెప్పక తప్పటం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఏ పత్రికకూ అడ్డగోలుగా ప్రకటనలివ్వటం వంటివి జరగలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పటంతో... మరి ‘సాక్షి’ విషయంలో చేసిన ఆరోపణలన్నీ తప్పేనా? ఇలాంటి అబద్ధాలు ఇంకెన్ని చెప్పారో...!! అని ముక్కున వేలేసుకోవటం జనం వంతవుతోంది... ఇవిగో నిజానిజాలు...
ఐదేళ్లలో‘సాక్షి’కిచ్చిన ప్రకటనల వివరాలివీ...
వాస్తవానికి సమాచార శాఖ నిబంధనలు, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) గణాం కాలను పరిగణనలోకి తీసుకునే వైఎస్సార్సీ ప్రభుత్వం వివిధ పత్రికలకు ప్రకటనలు ఇచ్చింది. శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్ తదితరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి పార్థసారథి ఇదే విషయాన్ని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల సమయంలో సమాచార శాఖ ద్వారా సాక్షి పత్రికకు రూ.293 కోట్లు, వివిధ శాఖల ద్వారా రూ.78 కోట్లు. మొత్తం రూ.371 కోట్ల మేర ప్రకటనలు ఇచ్చినట్టు తెలిపారు.
నిజానికి ఇక్కడే వాస్తవ సమాచారాన్ని కాస్త వక్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. సాక్షికి రూ.371 కోట్ల విలువైన ప్రకటనలిచ్చినా ‘ఈనాడు’ పత్రికకు తక్కువగా ఇచ్చారని. వాస్తవానికి ‘సాక్షి’ పత్రికలో ఐదేళ్లూ ప్రభుత్వ ప్రకటనలు ప్రచురితమయ్యాయి. కానీ ‘ఈనాడు’లో మూడున్నరేళ్లు మాత్రమే ప్రచురితమయ్యాయి. ఈ వాస్తవాన్ని మాత్రం కాస్తంత గోప్యంగా ఉంచారు మంత్రి పార్థసారథి. ఈ మూడున్నరేళ్ల వ్యవధిలోనే...
ఈనాడుకు సమాచారశాఖ ద్వారా రూ.190 కోట్లు, వివిధ శాఖల ద్వారా రూ.53 కోట్లు.. మొత్తం రూ.243 కోట్లు విలువైన ప్రకటనలు ఇచ్చింది. మూడున్నరేళ్ల తరువాత ఈనాడు యాజమాన్యం తమకు ప్రభుత్వ ప్రకటనలు తాము ప్రచురించబోమని అధికారికంగా సమాచార శాఖకు లేఖ రాసింది. దాంతో చివరి ఏడాదిన్నర ఈనాడు పత్రికకు ప్రకటనలు ఇవ్వలేదు. అదీ.. ఈనాడు పత్రిక యాజమాన్యం స్వచ్ఛందంగా వద్దని లేఖ రాయడంతోనే, ఆ ఏడాదిన్నర కూడా ఈనాడు పత్రిక యాజమాన్యం ప్రకటనలు తీసుకొని ఉంటీ ప్రభుత్వం మరో రూ.125 కోట్ల వరకు విలువైన ప్రకటనలు ఇచ్చేది. దాంతో సాక్షి పత్రికతో సమానంగా ఈనాడు పత్రికకు కూడాప ప్రకటనల బడ్జెట్ కేటాయించినట్లు అయ్యేది.
‘సాక్షి’కి బకాయిలు ‘ఈనాడు’కన్నా ఎక్కువే...
బాబు ప్రభుత్వం మరో అబద్ధాన్ని కూడా తెరమీదికి తేబోయింది. అదేంటంటే ‘ఈనాడు’ పత్రికకు ప్రకటనల బిల్లులు పూర్తిగా చెల్లించకుండా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని, అందుకే ‘ఈనాడు’ మూడున్నరేళ్ల తరవాత ప్రకటనలు తీసుకోలేదని. నిజానికి ‘ఈనాడు’కు ప్రభుత్వ ప్రగతిని తన పత్రికలో ప్రకటనల రూపంలో కూడా ప్రచురించటం ఇష్టం లేదు. అందుకే ప్రకటనలు వెయ్యలేమని లిఖితపూర్వకంగా చెప్పేసింది. వాస్తవానికి ‘ఈనాడు’కే కాదు. ‘సాక్షి’ పత్రికకు కూడా ప్రకటనల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
ఈనాడు పత్రికకు చెల్లించాల్సిన ప్రకటన బకాయిలు రూ.51 కోట్లు ఉండగా, వైఎస్సార్సిపీ ప్రభుత్వం అయినప్పటికీ సాక్షి పత్రికకు రూ.104.85 కోట్ల యాడ్స్ బకాయిలు పెండింగులో ఉన్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రయత్నించబోయి బొక్కబోర్లా పడింది. నిజానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలలో ప్రచురితమయ్యే 22 పెద్ద పత్రికలతో పాటు ఎన్నో చిన్న పత్రికలు, మేగజైన్లకు కూడా ప్రకటనలు ఇచ్చింది. మార్గదర్శకాలను ఏమాత్రం ఉల్లంఘించకుండా, వివక్షకు తావు లేకుండా ప్రకటనలు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment