ధర దడ
- దళారుల చేతుల్లో మార్కెట్
- టమోటా, మిర్చి, కాకర, బీర రేట్లకు రెక్కలు
- బహిరంగ మార్కెట్లో కేజీ రూ.30-60
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్ల కింద సాగవుతున్న కూరగాయల పంటలు ఎండిపోతున్నాయి. నగరం చట్టుపక్క జిల్లాల్లో టమోటా సాగు చివరి దశకు చేరుకోవడంతో దిగుబడి తగ్గిపోయింది. దీన్ని సాకుగా చూపుతూ నగరంలో రిటైల్ వ్యాపారులు ఒక్కసారిగా వీటి ధరలు పెంచేశారు. ఏటా జూన్, జులై నెలల్లో ఎదురయ్యే కూరగాయల కొరతను ఆసరాగా చేసుకొని దళారులు ధరలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. హోల్‌సేల్‌తో సంబంధం లేకుండా తమ ఇష్టారీతిన రేట్లు పెంచి వినియోగదారుని దోచుకుంటున్నారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఏ రకం కూరగాయలు కొందామన్నా... రూ.30-60 మధ్యలో ధర పలుకుతున్నాయి.
స్థానికంగా కూరగాయల దిగుబడి తగ్గిపోవడంతో మదనపల్లి, బెంగళూరు, ప్రాంతాల నుంచి వచ్చే సరుకుపైనే నగరం ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా డిమాండ్-సరఫరాల మధ్య అంతరం ఏర్పడి... ఆ ప్రభావం ధరలపై పడుతోంది. టమోటా, మిర్చి, బెండ, బీర, చిక్కుడు, కాకర ధరలు సామాన్యుడికి అందనంతగా పైకి ఎగబాకాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్యాప్సికం, ఫ్రెంచి బీన్స్ ధరలు నిప్పు మీద ఉప్పులా చిటపటలాడుతున్నాయి. వీటి ధర కేజీ రూ.60-100 పలుకుతుండడం వాటి కొరతకు అద్దం పడుతోంది. బోయిన్‌పల్లి హోల్‌సేల్ మార్కెట్‌లో టమోటా ధర కేజీ రూ.20 పలుకగా... ఇదే సరుకును బహిరంగ మార్కెట్లో రూ.35కు విక్రయిస్తున్నారు. మిగతా కూరగాయల ధరలు కూడా 30-40శాతం పెంచేశారు.
తగ్గిన సరఫరా...
నగర అవసరాలకు నిత్యం 45-50 వేల క్వింటాళ్ల కూరగాయలు కావాల్సి ఉంది. ప్రస్తుతం 30-35% మేర సరఫరా తగ్గినట్లు తెలుస్తోంది. ధరలకు కళ్లెం వేయాల్సిన మార్కెటింగ్ శాఖ మాత్రం ఏటా ఈ పెరుగుదల సర్వసాధారణమే అంటూ చోద్యం చూస్తోంది. ఈ సీజన్‌లో ఎక్కడా సమృద్ధిగా కూరగాయలు దొరకవు గనుక తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. జూన్‌లో వర్షాలు కురిస్తే కొత్తపంట వేస్తారు. దిగుబడికి 45-65రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున మరో రెండు నెలల వరకు కూరగాయల ధరలు అస్థిరంగానే ఉండొచ్చనివారు చెబుతున్నారు.
ట‘మోత’
టమోటా ధర సామాన్యుడికి అందనంటోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కేజీ టమోటా రూ.30 పలుకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల కిందటి వరకు కిలో రూ.14కు లభించిన టమోటా ఇప్పుడు రైతుబజార్‌లోనే రూ.23కు చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.20 పలికిన టమోటాకు మంగళవారం బహిరంగ మార్కెట్లో రూ.30-35ల చొప్పున వసూలు చేశారు. స్థానికంగా ఈ పంట సాగు చివరి దశకు చే రుకోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయి ఆ ప్రభావం ధరలపై పడింది.
నగర డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా కాకపోవడంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. నగరానికి రోజుకు 400 టన్నుల టమోటా అవసరం. ప్రస్తుతం సుమారు 250 టన్నులు మాత్రమే సరఫరా అవుతోంది. ఈ కొరతే ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. గత పది రోజుల్లోనే ధరలు రెట్టింపవడంతో సామాన్యుడి కూరగాయల బడ్జెట్ తల్లకిందులైంది. బెంగళూరు, మదనపల్లి మార్కెట్లలోనే మంచి ధర లభిస్తుండటంతో నగరానికి సరఫరా తగ్గి, కొరత ఎదురైందని వ్యాపారులు చెబుతున్నారు.