సాప్ట్‌వేర్‌ కొలువు వదిలి దేశీ వరి వంగడాలను సంరక్షిస్తున్న యువ ఇంజనీర్‌ | Software Engineer Nandam Raghuveer Cultivating Country Paddy Varieties | Sakshi
Sakshi News home page

సాప్ట్‌వేర్‌ కొలువు వదిలి దేశీ వరి వంగడాలను సంరక్షిస్తున్న యువ ఇంజనీర్‌

Published Tue, Jul 12 2022 9:18 AM | Last Updated on Tue, Jul 12 2022 9:18 AM

Software Engineer Nandam Raghuveer Cultivating Country Paddy Varieties - Sakshi

ఆయనో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.. బిట్స్‌ పిలానీలో మాస్టర్‌ డిగ్రీ చదివారు. ప్రముఖ సాప్ట్‌వేర్‌ కంపెనీలో ఐదేళ్లు పనిచేశారు. స్వతహాగా రచయిత కావడంతో సాఫ్ట్‌వేర్‌ కొలువు వదిలి సృజనాత్మక రంగంలో అడుగుపెట్టారు. ఇంకా ఏదో చేయాలన్న తపన.. సరిగ్గా అదే సమయంలో కేరళకు చెందిన ఎర్ర బియ్యం (నవార)లో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకొని ఆశ్చర్య పోయారు. ఇలాంటి పురాతన ధాన్యపు సిరులపై అధ్యయనంకోసం 8 రాష్ట్రాల్లో పర్యటించారు. 251 పురాతన వరి రకాలను సేకరించారు.

వాటిని సంరక్షిస్తూ భవిష్యత్‌ తరాలకు అందించాలని ప్రతినబూనారు. ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఆయనే నందం రఘువీర్‌. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఈయన గడిచిన నాలుగేళ్లుగా పురాతన విత్తనాలను సంరక్షించే కృషిలో నిమగ్నమయ్యారు. వాటిని యువ రైతులకు అందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో దేశీ విత్తన బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. తనతో కలిసొచ్చే రైతులతో తొలిదశలో 8 జిల్లాల్లో విత్తన నిధులను ఏర్పాటు చేయబోతున్నారు. దేశీ వంగడాల విశిష్టతను వివరించే పుస్తక రచన చేస్తున్నారు. పురాతన విత్తన సంపదను భవిష్యత్‌ తరాలకు భద్రంగా అందించాలన్న సంకల్పంతో ఉద్యమిస్తున్న రఘువీర్‌ ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...

పోషక విలువలతో పాటు 14 శాతానికి పైగా ఫైబర్‌ కలిగిన ‘నవార’ బియ్యం తిన్న తర్వాత నా ఆలోచన మారింది. అసలు ఇలా ఎన్ని రకాల పురాతన వరి రకాలు ఉన్నాయో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో నాలుగేళ్ల క్రితం తొలి అడుగు వేశా. తమిళనాడు, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌లలో పర్యటించాను. ఎక్కువ భాగం ఆదివాసీల నుంచి విత్తనాలు సేకరించాను. వాటిని ఎలా దాచుకోవాలి. ఎలా సంరక్షించాలి. ఎలా సాగు చేయాలో వారి దగ్గర నేర్చుకున్నా. నా పర్యటనలో పురాతన వరి విత్తన  సంరక్షణోద్యమ పితామహుడు డాక్టర్‌ దేవల్‌దేవ్‌ (ఒడిషా) వద్ద నెల రోజుల పాటు శిక్షణ పొందా.

ఈయన వద్ద ప్రపంచంలో మరెక్కడా లేని 1500కు పైగా వంగడాలున్నాయి. దేశీ వంగడాల పరిరక్షణకు కృషి చేస్తున్న డాక్టర్‌ వందనా శివను కలిసాను. పురాతన వంగడాలపై విశిష్ట కృషి చేసిన ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌.హెచ్‌.రిచారియా నుంచి సేకరించిన విత్తనాలతో డెహ్రాడూన్‌ సమీపంలో 50 ఎకరాల్లో ‘నవధాన్య’ పేరిట విత్తన పరిరక్షణకు నడుం బిగించారు. ఆమె వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.

251 దేశీ వరి రకాల సేకరణ
ఇప్పటి వరకు 251 రకాల అత్యంత పురాతనమైన వరి విత్తనాలను సేకరించాను. వీటిలో భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్‌) కల్గిన వంగడాలు 10కి పైగా ఉన్నాయి. పెనమలూరులో 1.3 ఎకరాల్లో ఈ విత్తనాల సంరక్షణ చేస్తున్నా. ఇప్పటి వరకు 48 మంది రైతులకు ఉచితంగా విత్తనాలు అందించాను. నేను నేర్చుకున్న విషయాలను పుస్తక రూపంలో తెచ్చే పనిలో ఉన్నా. ఇందులో పురాతన వరి రకాలు, వాటి వివరాలు,æ గొప్పదనం, చరిత్ర, ఔషధ గుణాలు, వంటకాలు వంటి వివరాలుంటాయి. ఈ ఏడాది 8 జిల్లాలలో విత్తన నిధులను ఏర్పాటు చేస్తున్నా. గిరిజన ప్రాంతమైన పెదబయలు మండలంలో దేశీ విత్తన నిధిని ఏర్పాటు చేస్తున్నా. 

రూ. 50 వేల నికరాదాయం
ప్రకతి వ్యవసాయంలో పురాతన వరి రకాలను సాగు చేస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎకరాలో ఖర్చులు పోను 50 వేలు నికర లాభం పొందవచ్చు.« ధాన్యాన్ని 4 నెలల పాటు నిల్వ చేసి.. బియ్యంగా మార్చి అమ్మగలిగితే దీనికి రెట్టింపు ఆదాయం ఆర్జించొచ్చు. తగిన జాగ్రత్తలతో విత్తనంగా అమ్మితే చక్కని ఆదాయం పొందవచ్చు. 

దేశీ వరి విత్తనోత్పత్తిలో మెలకువలు
తక్కువ స్థలంలో ఎక్కవ రకాలు పండించాలనుకుంటే ఖచ్చితంగా రకానికి రకానికి మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండాలి. మధ్యలో గుడ్డ కట్టాలి. ఒకేసారి పుష్పించకుండా ఉండేలా నాటుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా  దేశవాళీ వరి సంరక్షణ పేరిట ఒక ఎకరంలో 100 రకాలు సాగు చేస్తే వాటిలో ఉండే ఔషధ గుణాలు, చీడపీడలను తట్టుకునే లక్షణాలు, సువాసనలను కోల్పోతాయి.
కేంద్రం భౌగోళిక గుర్తింపునిచ్చిన వాటిలో ప్రధానంగా నవార, పాలకడ్‌ మిట్ట, పొక్కలి, వాయనాడ్‌ గంధకసాల, కాలానమక్, కైపాడ్, జోహా, అజారా ఘణసాల్, అంబెమొహర్, తులైపాంజ్, గోవిందో బోగ్, కటార్ని, చౌకోహ, సీరగ సాంబ రకాలు ఉన్నాయి. ఎర్ర బియ్యంలో 100 రకాలు, నల్ల బియ్యంలో 20 రకాలకు పైగా మన దేశంలోనే ఉన్నాయి. ఎకరాకు 13 నుంచి 30 బస్తాల దిగుబడినిచ్చే పురాతన రకాలున్నాయి. మార్కెట్‌లో వీటికి డిమాండ్‌ ఎక్కువ. ధర కూడా ఎక్కువే. 70 నుంచి 240 రోజుల్లో పండే పురాతన వరి రకాలు నా దగ్గర ఉన్నాయి. – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి

దేశీ వరి వంగడాల ప్రత్యేకతలు
నవర: రెడ్‌ రైస్‌ (ఎర్ర బియ్యం). కేరళకి చెందిన ఈ రకానికి 2007లో భౌగోళిక  గుర్తింపు వచ్చింది. వీటిలో పీచు పదార్థం ఎక్కువ. ఒక రోజు నాన బెట్టి, ఒక గంటసేపు ఉడికించాలి. అత్యంత బలవర్ధకమైన బియ్యమిది. డయాబెటిక్‌ వారికి అత్యంత సురక్షితమైన ఆహారం.

పాలక్కడ్‌ మట్ట: కేరళకు చెందిన మరో ఎర్ర బియ్యపు రకం. చోళ రాజులు తినేవారట. ముంపును తట్టుకునే పంట ఇది. ఇడ్లీ తరహా వంటలకు అనుకూలం.

పోక్కలి: ఉప్పు నీటిలో పెరిగే రకం. కేరళలో ఎర్నాకుళం, త్రిస్సూర్‌ పరిసరాల్లో సాగు చేస్తారు. ఇది కూడా ఎర్ర బియ్యమే. వరి పొలంలో చేపలను పెంచే సమీకృత వ్యవసాయానికి ఇది అనుకూలం. ఇందులో ప్రొటీన్స్‌ అధికంగా ఉంటాయి. అధిక శక్తినిస్తుంది. సముద్రవేటకు వెళ్లే జాలర్లు ఎక్కువగా వాడుతుంటారు. 

వయనాడు గంధకశాల: కేరళలోని వయనాడు కొండల మీద పెరిగే సుగంధ భరితమైన రకమిది. ఈనికSదశలో మంచి సువాసన వెదజల్లుతుంది. పూర్వం పండుగల వేళ ప్రసాదాల తయారీకి ఉపయోగించేవారు. ఆదివాసీలు నేటికీ అధికంగా పండిస్తున్నారు.

కాలానమక్‌: అత్యంత సువాసన కల్గిన తెల్ల వరి రకమిది. ధాన్యపు పొట్టు నల్లగా ఉంటుంది. బియ్యం తెల్లగా ఉంటుంది. క్రీ.పూ. 600 ఏళ్ల నాటి రకం ఇది. గౌతమ బుద్ధుని కాలంలోనూ పండించినట్టు చారిత్రక ఆధారాలున్నాయట. కపిలవస్తు (నేపాల్‌), ఉత్తరప్రదేశ్‌లలో నేటికీ సాగులో ఉంది. 

చకావో: మణిపూర్‌ బ్లాక్‌ రైస్‌ అని దీనికి పేరు. పంట కాలం 120 రోజులు. ఔషధ విలువలు కల్గిన నల్ల బియ్యం. వీటిలో యాంటి ఆక్సిడెంట్స్‌ అధికం. మార్కెట్‌లో ఈ రకం బియ్యానికి మంచి డిమాండ్‌ ఉంది. పాయసం తరహా వంటకాలకు బాగా అనువైనది.

ప్రతి రైతూ పండించుకొని తినాలి!
నేను ప్రతి రైతునూ కోరుకునేది ఒక్కటే. తనకున్న భూమిలో కొంత భాగంలోనైనా తన కోసం పోషకాలు, ఔషధ విలువలు కలిగిన పంటలు పండించుకోవాలి. పురాతన వరి, కూరగాయలు, దుంప రకాలS విత్తనాలు నేటికీ అందుబాటులో ఉన్నాయి. అధిక దిగుబడి మాయలో పడిపోకుండా ప్రతీ రైతు పురాతన వరి విత్తనాలను సేకరించి తాము తినడానికి పండించుకోవాలి. విత్తనాన్ని సంరక్షించు కోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రపంచాన్ని ఎవరూ మార్చలేరు. ముందుగా మనం మారి, ఆ తర్వాత పది మందికీ చెబితే ఖచ్చితంగా పది మందైనా మన బాటలోకి వస్తారు. ఈ స్ఫూర్తితో నేను ఈ ఉద్యమంలో ముందుకెళ్తున్నాను. – నందం రఘువీర్‌ (70138 20099), దేశీ వంగడాల సంరక్షకుడిగా మారిన యువ ఇంజనీర్, పెనమలూరు, కృష్ణా జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement