వరి సేద్యానికి కొత్త ఊపిరి! | New breathen to cultivation of paddy | Sakshi
Sakshi News home page

వరి సేద్యానికి కొత్త ఊపిరి!

Published Tue, Sep 8 2015 4:29 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

మండవ వీడర్ ను చూపుతున్న కిషన్ రావు - Sakshi

మండవ వీడర్ ను చూపుతున్న కిషన్ రావు

 పుబ్బ కార్తె (సెప్టెంబర్ 13 వరకు)
 వ్యవసాయం బడుగు రైతుకు తలకు మించిన భారంగా మారింది. ప్రజలు ప్రధాన ఆహారంగా వరి సాగు చేసే రైతుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అప్పోసొప్పో చేసి పెడుతున్న ఖర్చు కూడా రైతుకు తిరిగి రానంత అధ్వాన్న స్థాయిలోనే.. కనీస మద్దతు ధర పెరుగుదల ఆగిపోయింది. కాదు.. కాదు.. పాలకులు ఆపేశారు. చిన్న రైతుకు చేదోడుగా నిలిచే తక్కువ ఖరీదులో మేలైన యంత్ర పరికరాలకూ కొరతే. పులి మీద పుట్రలా.. ఈ ఏడాది కరువు కాటేసింది...
 
 అయితే, ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రకృతి ప్రకోపం తడిసి మోపెడైన ఇంతటి పెను సంక్షోభ కాలంలోనూ.. అన్నదాతలు సేద్యాన్ని వొదులుకోలేకపోతున్నారు. దశాబ్దాలుగా అనుదినం తమ జీవితంలో భాగమైపోయిన వరి సాగును ఎలాగైనా నిలబెట్టుకోవాలన్న తపనే వారిని వెలుగుదారులు వెదికేందుకు పురికొల్పుతోంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా వరి సేద్యాన్ని సృజనాత్మకంగా కొత్తపుంతలు తొక్కిస్తున్న ‘రైతు శాస్త్రవేత్త’లకు కొదవ లేని సుసంపన్నమైన వ్యవసాయ సంస్కృతి మనది. సాధారణ వరి రకాలను టన్నుల కొద్దీ పండించి నష్టాల పాలవ్వడానికి బదులు.. ఔషధ విలువలున్న  సంప్రదాయ వరి వంగడాలను అపురూపంగా గుండెలకు హత్తుకొని.. తక్కువ ఖర్చుతో సేంద్రియ సేద్యం ద్వారా అధికంగా నికరాదాయం పొందుతున్నవారున్నారు.
 
 తమ పొలాల్లో ప్రత్యేక అవసరాల కోసం తక్కువ ఖర్చుతోనే కొత్త యంత్ర పరికరాలను ఆవిష్కరిస్తున్న సృజనశీలురున్నారు. వరి సేద్యానికి కొత్త ఊపిర్లూదుతున్న ఇటువంటి 30 మంది అన్నదాతలను భారతీయ వరి పరిశోధనా స్థానం (ఐ.ఐ.ఆర్.ఆర్.) ఇటీవల సముచిత రీతిన సత్కరించింది. దేశం నలుమూలల నుంచి ఆవిష్కర్తలను ఎంపికచేసి ‘రైస్ ఇన్నోవేటర్స్ 2015’ పేరిట పురస్కారాలను అందజేసింది. రైతుల ఆవిష్కరణలకు.. సృజనాత్మక, సుస్థిర, సేంద్రియ సాగు పద్ధతులకు తగిన రీతిలో గుర్తింపునివ్వడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేయడమే ఈ అవార్డుల లక్ష్యమని ఐ.ఐ.ఆర్.ఆర్. డెరైక్టర్ వి. రవీంద్రబాబు వివరించారు. ఐ.ఐ.ఆర్.ఆర్. పురస్కారాలను అందుకున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు రైతు శాస్త్రవేత్తలున్నారు. వరి సేద్యానికి కొత్త ఊపిర్లూదుతున్న వీరికి ‘సాక్షి’ అభినందనలు తెలియజేస్తున్నది. వారి విశిష్ట కృషి గురించి ‘సాగుబడి’ పాఠకుల కోసం..
 
 ‘మండవ వీడర్’.. ఖండాంతర ఖ్యాతి
 ‘శ్రీ’ వంటి ఆరుతడి వరి సాగు పద్ధతిలో కలుపు నివారణ పెద్ద సమస్య. కలుపు తీతకు అప్పటికి వాడుతున్న కోనో వీడర్‌తో సమస్యలున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు ఉపయోగపడే వీడర్‌ను ఖమ్మం జిల్లా చిన్న మండవ గ్రామానికి చెందిన రైతు శాస్త్రవేత్త పర్చా కిషన్‌రావు (94411 23197) ఆవిష్కరించారు.  దీనికి తమ గ్రామం పేరుతో ‘మండవ వీడర్’ అని పేరుపెట్టారు. మహిళలు కూడా అలసిపోకుండా, సులువుగా ఉపయోగించడానికి వీలుగా ఈ వీడర్‌ను ఆయన రూపొందించారు. కోనోవీడర్ కన్నా ఇది బరువు తక్కువ. కోనోవీడర్‌కు 10-15 నట్లు, బోల్టులు ఉంటాయి. మరమ్మతులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మండవ వీడర్‌కు ఒక్క బోల్టూ, నట్టు లేదు కాబట్టి మన్నిక ఎక్కువ. హేండిల్ పట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. దీన్ని ఉపయోగించే మనిషి ఎక్కువ శ్రమ పడనక్కర్లేదు. దీని పళ్లు ఐదు అంగుళాల వెడల్పు ఉండటం వల్ల దీన్ని వాడుతున్నప్పుడు వరి మొక్క దెబ్బతినదు. దీని తయారీకి రూ.700-800కు మించి ఖర్చవదు. ఇన్ని సుగుణాలుండ బట్టే ఈ వీడర్ రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఏడు రాష్ట్రాల్లో రైతుల ఆదరణ పొందుతోంది. అంతేకాదు. మొరాకో, అఫ్ఘనిస్తాన్, సిఎర్రా లియోన్, నేపాల్ వంటి అనేక దేశాల్లోనూ దీన్ని వాడుతుండడం విశేషం.
 
 ఈ ఆవిష్కరణపై కిషన్‌రావు పేటెంట్ తీసుకోలేదు. దీని డిజైన్లను ఇంటర్‌నెట్‌లో అందరికీ అందుబాటులో ఉంచారు. దేశవిదేశాల్లో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఈ వీడర్‌ను స్థానికంగా తయారు చేసి.. రైతులకు అందిస్తున్నాయి. ఖరగ్‌పూర్ ఐఐటీ, బాపట్ల వ్యవసాయ ఇంజినీరింగ్ కాలేజీ నిపుణులు మండవ వీడర్ సామర్థ్యంపై అధ్యయనం చేసి ప్రశంసించడం విశేషం. ఇంజినీరింగ్ పట్టభద్రుడైన కిషన్‌రావు మక్కువతో సేద్యాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. 34 ఏళ్లుగా సేంద్రియ వరి సేద్యం చేస్తున్నారు.
 
 30 సెం.మీ. డ్రమ్ సీడర్, పవర్ వీడర్
 ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన మూడెకరాల అభ్యుదయ రైతు షేక్ ఇమాం సాహెబ్ (97048 12836). 14 ఏళ్లుగా వరి సాగు చేస్తున్నారు. సాధారణ డ్రమ్ సీడర్ ద్వారా విత్తితే వరుసల మధ్య 20 సెం.మీ. దూరం మాత్రమే ఉంటున్నది. దీంతో కలుపుతీతకు కోనోవీడర్ వాడకం ఇబ్బందిగా మారడంతో అధిక ఖర్చుతో మనుషులతో కలుపు తీయించాల్సి వచ్చేది. ఈ సమస్యను అధిగమించడానికి వరుసల మధ్య 30 సెం.మీ.ల దూరం ఉంచేలా కేసింగ్ పైప్‌తో డ్రమ్‌సీడర్‌ను రూపొందించారు. అందుకు తగినట్లుగా పవర్ వీడర్‌ను కూడా తయారు చేసుకున్నారు. ఇమాం సాహెబ్ ఆవిష్కరణలు తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందాయి.
 
 సంప్రదాయ సేంద్రియ సేద్య పద్ధతి
 పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గద్దె సతీష్ బాబు (99125 11244) రైతు కుటుంబంలో పుట్టి ఎం.కాం. చదివినా వ్యవసాయ వృత్తిని చేపట్టారు. గత 19 ఏళ్లుగా సంప్రదాయ సేంద్రియ సేద్య పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. 22 హెక్టార్ల ఆసామి అయిన సతీష్ బాబు తన పొలంలోని సగం విస్తీర్ణంలో ఈ ఏడాది వరి సాగు చేస్తే.. మిగతా సగం విస్తీర్ణంలో పంట వేయరు. విరామం ఇస్తారు. సహజసిద్ధంగా భూసారం పెంపుదలకు ఇది అవసరమని భావిస్తారు. పంట వేసిన పొలంలో కోతలు పూర్తయిన తర్వాత పొలంలోని కొంత విస్తీర్ణంలో గేదెలను కట్టేస్తారు. అవి రాత్రి, పగలు అక్కడే ఉండి గడ్డి మేస్తుంటాయి. వాటి పేడ, మూత్రం సహజంగా భూమిని సారవంతం చేస్తాయి.
 
వారం తర్వాత గేదెలను మరి కొంత దూరానికి తరలిస్తారు. ఆ విధంగా ఈ ఏడాది పంట పండించిన పొలాన్ని వచ్చే ఏడాది అంతా పశువులను కట్టేయడం ద్వారా సారవంతం చేస్తుంటారు. ఈ సంవత్సరం పంట వేయని పొలంలో వచ్చే ఏడాది పంట వేస్తారు. పశువుల పేడ, మూత్రంతో పంట భూమిని సారవంతం చేస్తున్నందున.. పంట బలంగా పెరుగుతున్నదని, చీడపీడల బెడదే లేదని సతీష్ బాబు తెలిపారు. రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తులు పండించి, నేరుగా వినియోగదారులకు విక్రయించడం ద్వారా అధిక నికరాదాయం పొందుతున్నారు. దీనితోపాటు, పాడి పశువులు ఆరుబయట తిరుగుతూ ఉంటాయి. దీని వల్ల నాణ్యమైన పాల దిగుబడి వస్తున్నది. ఖమ్మం జిల్లాలో చాలా మంది రైతులు ఈ పద్ధతిని అనుసరించి పంటలు పండిస్తున్నారని సతీష్ బాబు తెలిపారు.
 
 డ్రిప్‌తో వరి సాగు
 నీటిని నిల్వగట్టే పద్ధతిలో వరి సాగుకు చాలా నీరు అవసరమవుతుంది. ఈ కరువు కాలంలో వరి సాగు కొనసాగాలన్నా, రైతు నిలదొక్కుకోవాలన్నా తక్కువ నీటిని వాడుకుంటూ ఎక్కువ దిగుబడి సాధించాలి. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి మండలం చింతల్‌పేటకు చెందిన యువ సన్నకారు రైతు తోట్ల మహిపాల్ యాదవ్ (94402 10032) ఈ దిశగా ముందడుగు వేశారు. 9వ తరగతి చదువుకున్న మహిపాల్ వరి పొలంలో డ్రిప్ ద్వారానే ద్రవ ఎరువులను వాడి అధిక దిగుబడి పొందారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంట పండించే ఈ పద్ధతిపై ఈ కరువు కాలంలో ఇతర రైతులు ఆసక్తి చూపుతున్నారు.
 
 ఐదేళ్లుగా వెద పద్ధతిలో వరి సాగు
 తెలుగు నాట వరి సేద్యంలో ప్రఖ్యాతినొందిన సీనియర్ రైతు నెక్కంటి సుబ్బారావు (94912 54567). పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన ఆయన 55 ఏళ్లుగా వరి సాగు చేస్తున్నారు. ధాయ్‌చుంగ్, ఐఆర్-8, గ్రీన్ సూపర్ రైస్ వంటి మేలైన వరి వంగడాలను తొలుత పండించి తెలుగు నాట ఇతర రైతులకు అందించడంలో ఆయనకు ఆయనే సాటి. వరి సాగులో ఖర్చును, కూలీల అవసరాన్ని తగ్గించడం కోసం ఐదేళ్ల క్రితం నుంచి ఆయన కృషి చేస్తున్నారు. ఖరీఫ్‌లోను, దాళ్వాలోనూ దమ్ము చేసిన తర్వాత విత్తనాన్ని వెదజల్లుతున్నారు లేదా డ్రమ్‌సీడర్ వాడుతున్నారు. ఎకరానికి రూ. ఐదు వేల వరకు ఖర్చు తగ్గుతున్నదని సుబ్బారావు తెలిపారు. గోదావరి జిల్లాల్లో చాలా మంది రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. నాట్లు వేసినప్పటికన్నా ఎక్కువ పిలకలు రావడంతోపాటు చీడపీడల బెడద ఉండటం లేదని ఆయన అన్నారు.
 సేకరణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్; ఫొటోలు: నాగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement