వరి రైతుకు 7 రకాలుగా ఉపయోగపడే యంత్రం
వరి సాగులో నాటు దగ్గరి నుంచి వివిధ దశల్లో అనేక పనులను ఒకే ఒక్క చిన్నపాటి యంత్రంతో చేయగలిగితే? అది నిజంగా అద్హుతమే. వరి సాగు ఖర్చులు తలకు మించిన భారంగా పరిణమిస్తున్న ఈ తరుణంలో రైతుకు నిజంగా వరమే అవుతుంది. కన్నూరు(కేరళ)లోని సెయింట్ థామస్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు ఒకటికి ఏడు పనులను చేసే ఇటువంటి అద్భుత యంత్రాన్ని ఇటీవల ఆవిష్కరించారు.
వరి పొలంలో దమ్ము చేయటం, వరి నాట్లు వేయడం నుంచి పొలంలోకి నీరు తోడటం, వరి కోతలు కోయడం, ధాన్యం నూర్పిడి చేయడం, తూర్పారబట్టడం, ధాన్యాన్ని బియ్యంగా మార్చడం.. వంటి ఏడు రకాల పనులను ఈ ఒక్క యంత్రం చేసేస్తుంది. మెకానికల్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు అభిషై, లిపిన్, రిజున్, అక్షయ్ బృందం ఈ యంత్రానికి రూపకల్పన చేసింది. అభిషై బృందం స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేసి పేటెంట్ కోసం ధరఖాస్తు చేసింది.
ఈ బహుళ ప్రయోజనకర వ్యవసాయ యంత్రం బ8రువు మొత్తం కలిపితే 624 కిలోలు మాత్రమే. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తేగల పారిశ్రామికవేత్త కోసం వెదుకుతున్నామని అభిషై ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఏదేమైనా 4 నెలల్లో రైతులకు అందుబాటులోకి తేవాలని ఆశిస్తున్నామన్నారు. వరి రైతుకు ఖర్చు తగ్గి నికరాదాయం మూడు రెట్లు పెరుగుతుందన్నారు.
వానపాముల మాదిరిగా రైతుకు ఎంతో మేలు చేసే ఈ యంత్రానికి ‘మన్నిర’(మళయాళంలో వానపాము) అని పేరు పెట్టామని అభిషై(80758 36523, 94951 24870) ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. 15 హెచ్‌పి సామర్థ్యం గల పాత ఇంజిన్‌ను ఉపయోగించి ప్రొటోటైప్‌ను రూపొందించారు. కొత్త ఇంజిన్‌తో తయారు చేస్తే ఈ డీజిల్ యంత్రం ఖరీదు రూ. 2.5 లక్షల వరకు ఉండొచ్చట. రైతుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్న ఈ యువ ఇంజినీర్లకు ‘సాక్షి’ జేజేలు పలుకుతోంది!
యంత్రాన్ని ఆవిష్కరించిన విద్యార్థుల బృందం
Comments
Please login to add a commentAdd a comment