చింతలూరి సన్నాలు.. తెల్లని బియ్యం రకాలు. సైజు చిన్నగా ఉండే వాటిని చిట్టిముత్యాలు అంటున్నారు. నలుపు రంగులో ఉంటే బ్లాక్ బర్మా.. డెహ్రడూన్ బ్లాక్, కాలాభట్టి అని పిలుస్తున్నారు. ఎర్ర రంగులో ఉంటే రక్తశాలి అని పిలుచుకుంటున్నారు. ఇంకా నారాయణ కామిని.. కూజీ పటాలియా.. ఇంద్రాణి.. రత్నచోడి అనే దేశీయ వరి రకాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రంగుల బియ్యాలు సంపూర్ణ పోషకాలనిస్తూ యాంటీ యాక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉంటాయని చెబుతున్నారు. క్యాన్సర్‌ను నిరోధించే గుణం వీటికి ఉందని కూడా ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
తాడేపల్లిగూడెం: బ్లాక్ బర్మా.. డెహ్రాడూన్ బ్లాక్.. కాలాభట్టి.. రక్తశాలి.. నారాయణ కామిని.. కూజీ పటాలియా.. ఇంద్రాణి.. రత్నచోడి.. చిట్టిముత్యాలు. ఈ పేర్లు ఇప్పుడు తారకమంత్రంగా మారాయి. దేశీయ వరి రకాలుగా పండిస్తున్న ఈ రంగుల బియ్యం తింటే వైద్యుని అవసరం ఉండదట. మనిషిని నిలువునా కుంగదీసే మధుమేహానికి ఈ బియ్యంతో చెక్ పెట్టవచ్చు. మోకాళ్లు, కీళ్ల నొప్పులకు చరమగీతం పాడవచ్చు. ఐరన్, జింక్, కాల్షియం, కాపర్ వంటివి శరీరానికి అందడంతోపాటు, రక్తపుష్టికి ఈ బియ్యమే రాచమార్గంగా చెబుతున్నారు.
జీరో ఫార్మింగ్ (పెట్టుబడిలేని వ్యవసాయం)ను రైతులు అందిపుచ్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం దేశీయ వరి రకాలను పండించే దిశగా రైతులను కార్యోన్ముఖులను చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ సంఘ నిర్వాహక ప్రకృతి విభాగం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పైన పేర్కొన్న రకాల వరిని పండించే విస్తీర్ణం 300 ఎకరాలకు పైగా చేరింది. కలర్ రైస్ లాభాలు అదుర్స్.. పోషకాలు బోనస్ అన్నట్టుగా సాగుతున్న ఈ సేద్యం వైపు పలువురు ఆకర్షితులవుతున్నారు. పంటను బియ్యంగా మార్చి మార్కెట్‌ను అందిపుచ్చుకుంటున్నారు.
పురాతన రకాలివి
వరిలో పురాతన కాలం నాటి దేశీయ రకాలు దాదాపుగా మూలనపడ్డాయి. అధిక దిగుబడులనిచ్చే ఆధునిక వంగడాల వైపు రైతులు మళ్లడంతో దేశీయ రకాలు కనుమరుగయ్యాయి. ప్రకృతి వ్యవసాయం పుణ్యమా అని కొందరు అభ్యుదయ రైతుల కృషితో పురాతన వరి రకాలు ఊపిరి పోసుకుంటున్నాయి. వినియోగదారులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతూ.. రైతులను రారాజుగా మారుస్తున్నాయి. సుఖవంతమైన జీవితం, తగ్గిన వ్యాయామం నేపథ్యంలో శరీరం రోగాలకు ఆలవాలంగా మారింది.
ఈ పరిస్థితుల్లో పెట్టుబడితో పనిలేని ప్రకృతి వ్యవసాయం (జీరో ఫార్మింగ్) పేరిట తిరిగి దేశీయ వరి రకాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇవన్నీ పోషకాలను అందిస్తూ యాంటీ యాక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ కారకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ రకాలను తింటే జీర్ణవ్యవస్థకు ఇబ్బంది ఉండదని ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ రకాలు మేలు
జీరో ఫార్మింగ్‌తో దేశీయ వరి రకాలను రైతులు పండిస్తున్నారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ రకాల్లో పిండి పదార్థం తక్కువగా, పీచుపదార్థం అధికంగా ఉండటంతో జీర్ణం బాగుంటుంది. ఈ రకాల్లో గ్‌లైసమిక్ యాసిడ్ ఇండెక్స్ ఎక్కువ. యాంథోసైనిన్ అమినో ఆమ్లాల కారణంగా బియ్యంపై రంగుల పొరలు ఏర్పడతాయి. నల్ల బియ్యం రకంలో వరి కంకులు కూడా నల్లగా ఉంటాయి. ఈ రకం బియ్యం తినడం వల్ల ఐరన్, జింక్, కాల్షియం, కాపర్ అందుతాయి. పోషకాలు ఎక్కువ. మ«ధుమేహ రోగులకు ఈ రకం మేలు చేస్తుంది. యాంటీ యాక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ కారకాలుగా కూడా ఈ బియ్యం ఉపయోగపడతాయి. రక్తపుష్టికి రక్తశాలి రకం, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నివారణకు నారాయణ కామిని రకాల బియ్యం వినియోగిస్తే మేలు. జిల్లాలో 300 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ రకాలు సాగవుతున్నాయి.
– నూకరాజు, జిల్లా అధికారి, ప్రకృతి వ్యవసాయ విభాగం
ఎకరాకు రూ.90 వేల ఆదాయం
జీరో ఫార్మింగ్‌తో దేశీయ వరి రకాలను పండించడం వల్ల ఎకరాకు రూ.90 వేల వరకు ఆదాయం వస్తోంది. ఎకరాకు అన్నిరకాల ఖర్చులు కలిసి రూ.18 వేలు అవుతుంది. ఎకరాకు 18 బస్తాల దిగుబడి వస్తుంది. బస్తా ధర రూ.6 వేల వరకు ఉంది. మొత్తం వచ్చే ఆదాయం రూ.1.08లక్షలు కాగా ఖర్చులు పోను రూ.90 వేలు మిగులుతుంది. ఆన్‌లైన్ మార్కెట్‌ను అందిపుచ్చుకుంటే మరింతగా ఆదాయం పొందవచ్చు. 120 రోజుల్లో కోతకు వచ్చే దేశీయ రకాలు పండించడానికి ఘన జీవామృతం, జీవామృతం, వేపపిండి, ఆముదం పిండి, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, పంచగవ్య వాడతాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి, పొగాకు, శీతాఫలం ఆకులు, కానుగ, జిల్లేడు, వేప, ఆవు పేడ, ఆవు నెయ్యి, అరటి పండ్లు, ఆవు పెరుగు, కల్లు వంటివి ఈ పంట కోసం వినియోగిస్తాం. ఏడాదిగా సాగు చేస్తున్నాం. ఆదాయం బాగుంది. మండలంలో కొన్నిచోట్ల ఈ దేశీయ వరి రకాలను కొందరు సాగు చేస్తున్నారు. ఈ రకాల బియ్యం కిలో మార్కెట్ డిమాండ్ ఆధారంగా రూ.120 నుంచి రూ.200 ధర పలుకుతున్నాయి.
– మరిడి నాగకృష్ణ, రైతు, వెంకట్రామన్నగూడెం
Comments
Please login to add a commentAdd a comment