కిసాన్ మేళాలో నూతన వంగడాలను పరిశీలిస్తున్న అగ్రికల్చర్ విద్యార్థులు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రస్థానంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా, ప్రకృతిపై దాడి చేస్తున్న చీడ పీడలను ఎదుర్కొనే విధంగా తక్కువ పెట్టుబడులతో అత్యధిక దిగుబడులు సాధించే సరికొత్త వంగడాలు సృష్టించడంలో ఇక్కడి శాస్త్రవేత్తలు సఫలీకృతం అవుతున్నారు. తరతరాలుగా అనుసరిస్తున్న సంప్రదాయ సేద్యం నుంచి సాంకేతిక సేద్యం వైపు రైతులను చైతన్య వంతులను చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు.
నెల్లూరు (సెంట్రల్): వరి సాగుకు ప్రసిద్ధిగాంచిన సింహపురి ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం సహకారంతో సరికొత్త సీడ్స్‌తో హైస్పీడ్ దిగుబడులు సాధిస్తోంది. పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు నెల్లూరు జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రదేశాలతో పాటు కార్తెలు, నక్షత్రాల పేరుతో అత్యంత జన్యుపరమైన సన్న రకాల వరి విత్తనాలు సృష్టించి రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడి శాస్త్రవేత్తలు జిల్లా వాతావరణాన్నే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా మంచి దిగుబడులు సాధించే విధంగా కొత్త రకం విత్తనాలను సృష్టించం ప్రత్యేకత.
28 రకాల వంగడాలు సృష్టి
జిల్లాలో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 28 రకాల కొత్త వరి వంగడాలను మార్కెట్‌లోకి తీసుకు వచ్చారు. ప్రధానంగా 1948 నుంచి కొత్త వంగడాల సృష్టిని శాస్త్రవేత్తలు ప్రారంభించారు. బీసీపీ 1, బీసీపీ 2 అనే రెండు రకాల కొత్త వంగడాలను 1948లో సృష్టించారు. బీసీపీ 3, బీసీపీ 4 రకాలను 1950లో, 1951లో బీసీపీ 5, 1965లో బీసీపీ 6, 1965లో బల్క్‌హెచ్ 9ను తయారు చేశారు. ఆ తర్వాత కొత్త మొలగొలకులు 72 అనే రకాన్ని 1977లో మార్కెట్లోకి తీసుకు వచ్చారు. 74 పేరుతో మరో కొత్త మొలగొలుకులు రకాన్ని 1977లో తీసుకు వచ్చారు.
1987లో పినాకిని ఎన్‌ఎల్‌ఆర్ 9672–96, 1988లో తిక్కన ఎన్‌ఎల్‌ఆర్ 27999, 1991లో సింహపురి ఎన్‌ఎల్‌ఆర్ 28600, శ్రీరంగ ఎన్‌ఎల్‌ఆర్ 28523, స్వర్ణముఖి ఎన్‌ఎల్‌ఆర్ 145 రకాలను, 1996లో భరణి ఎన్‌ఎల్‌ఆర్ 30491, శ్రావణి ఎన్‌ఎల్‌ఆర్ 33359, స్వాతి ఎన్‌ఎల్‌ఆర్ 33057, పెన్నా ఎన్‌ఎల్‌ఆర్ 33365 రకాలను, 1999లో సోమశిల ఎన్‌ఎల్‌ఆర్ 33358, వేదగిరి ఎన్‌ఎల్‌ఆర్ 33641, అపూర్వ ఎన్‌ఎల్‌ఆర్ 33654 రకాలను, 2002లో పర్తివ ఎన్‌ఎల్‌ఆర్ 33892, 2006లో నెల్లూరు మసూరి ఎన్‌ఎల్‌ఆర్ 34449 2009లో, స్వేత ఎన్‌ఎల్‌ఆర్ 40024 2012లో, నెల్లూరు ధాన్యరాశి ఎన్‌ఎల్‌ఆర్ 3354, నెల్లూరు సిరి ఎన్‌ఎల్‌ఆర్ 4001, నెల్లూరు సుగంధ ఎన్‌ఎల్‌ఆర్ 40054లను 2020లో సృష్టించారు. ఈ విధంగా 28 రకాల వరి కొత్త వంగడాలను జిల్లా శాస్త్రవేత్తలు జిల్లా వాసులకు అందించారు.
రైతులను చైతన్య పరుస్తూ..
జిల్లాలోని రైతులను ఎప్పకప్పుడు శాస్త్రవేత్తలు చైతన్య పరుస్తూ కొత్త వంగడాలపై అవగాహన కల్పిస్తూ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరిస్తూ వస్తున్నారు. గ్రామాల్లో పర్యటించడం కాకుండా, పరిశోధనా స్థానంలో రైతులకు అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి రైతుల అభిప్రాయాలను, సూచనలను తీసుకుని ఆ దిశగా శాస్త్రవేత్తలు కొత్త వంగడాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కొత్త వంగడాలు ఖరీఫ్‌లో, రబీలో ఏ విధంగా వేసుకుంటే పంట సాగు బాగుంటుంది, ఎంత మోతాదులో రసాయనాలు వాడాలి అనే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
అన్ని విధాలుగా చేస్తున్నాం
జిల్లాలోని రైతులకు అనుగుణంగా, వారికి అవసరమయ్యే విధంగా వంగడాల సృష్టిపై ప్రత్యేక దృష్టి పెట్టుతున్నాం. ఒక వంగడం పూర్తి స్థాయిలో బయటకు రావాలంటే చాలా సమయం పడుతోంది. అప్పటి వరకు అని విధాలుగా శాస్త్రవేత్తలు పరిశీలన చేసి మార్కెట్లోకి తీసుకువస్తారు.
– వినీత, ప్రధాన శాస్త్రవేత్త
అవగాహన కల్పిస్తున్నారు
శాస్త్రవేత్తలు రైతులకు ఎప్పకప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు తీసుకుంటే మంచి ఫలితాలను సాధించవచ్చు. కొత్త వంగడాలను సృష్టించినప్పుడు రైతులు వెనకడుగు వేస్తారు. కానీ వాటిపై పూర్తి అవగాహన కల్పిస్తే మాత్రం రైతులకు లాభదాయకంగా ఉంటుంది.
– జి.చంద్రశేఖర్‌రెడ్డి, చాగణం రైతు,సైదాపురం మండలం
సలహాలతో ఎంతో మేలు
శాస్త్రవేత్తలు, సలహాలు, సూచనలతో రైతులకు ఎంతో మేలు ఉంటుంది. మాకు తెలిసిన పరిజ్ఞానం కన్నా, శాస్త్రవేత్తల సాంకేతి పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది కాబటి, వారి ప్రకారం నడుచుకుంటే రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది.
– ఎస్ సుధాకర్‌రెడ్డి, ఖాన్‌సాహెబ్‌పేట రైతు, మర్రిపాడు మండలం
Comments
Please login to add a commentAdd a comment