కెవ్వు కేక
ఓరీ వెధవాయ్...
చుక్క నెయ్యి లేకుండా తింటున్నావ్...
నాయనమ్మ గావు కేక!
ఆవకాయ, పప్పు, వేడివేడి అన్నం,
ఓ రెండు చెంచాలు నెయ్యి... కేక!
వాట్ ఈజ్ దిస్ లైఫ్.. కమాన్.. లెట్స్ ఎంజాయ్..
ఫ్రెండ్స్ కెవ్వు కేక!
కేక్స్, పేస్ట్రీ, ఐస్‌క్రీమ్, పీజా, బర్గర్, చిప్స్, ఫ్రైస్...
కొవ్వు కేక!
కొలెస్ట్రాల్, ఒబేసిటీ, హార్ట్ ప్రాబ్లం, పక్షవాతం, ఫ్యాటీ లివర్..
చా... కేక!
డాక్టర్లు, క్లినిక్‌లు, హాస్పిటళ్లు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, బిల్లులు.. పొలి కేక!
ఇక లాభం లేదు. ఈ డౌట్స్ అన్నిటికీ
ఒక ఆన్సర్ కావాలి.
ఏ కొవ్వు మంచిదో..
ఏ కొవ్వు చెడ్డదో..
ఏ కొవ్వు అవసరమో..
ఏ కొవ్వు వద్దో..
చెప్పే హెచ్చరిక..
ఈ తొలి కేక.
సుస్మిత పదహారేళ్ల పిల్ల. వాళ్ల ఉమ్మడి కుటుంబంలో ఆమె ఒక్కతే ఆడపిల్ల. నానమ్మ, తాతయ్య, మేనత్తల దగ్గర్నుంచి పెద్దనాన్న, పెద్దమ్మ, బాబాయ్ పిన్ని దాకా.. అందరికీ గారాల పట్టి. తిండి దగ్గర్నుంచే ఆ గారాబాన్ని మొదలుపెడ్తారు. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అన్నీ ఫ్రై కూరలు, కమ్మటి నెయ్యి, మీగడ పెరుగు, రోజొక రకం స్వీట్ సుస్మిత మెనూలో చేరుస్తారు. ఆ అమ్మాయి మాత్రం వీటన్నిటినీ పక్కను తోసి నూనె లేని పుల్క, నీళ్లకూరతో భోజనం అయిందనిపించేస్తుంది. కారణం.. మోడల్ కావాలనే ఆమె ఆశయం! కానీ సుస్మిత నానమ్మ, తల్లికి మాత్రం ఆ పిల్ల ధోరణి భయం పుట్టిస్తోంది. ‘ఎవరైనా ఉద్యోగం చేసేది బతకడానికే కానీ నువ్వేంటే కడుపు చంపుకొనే ఉద్యోగం కావాలనుకుంటున్నావ్’ అంటూ నానమ్మ అసహనాన్ని వెళ్లగక్కినా వినిపించుకోదు ఆ మనవరాలు. తినడానికి ఏమి ఇచ్చినా ‘అమ్మో ఇది బోలెడంత ఫ్యాట్’ అంటూ మూతి విరిచేస్తుంది. ఆ చేష్టలకు సుస్మిత తల్లి కోపం నషాళానికి అంటుతుంది. సుస్మితకు తోడు వాళ్ల పెద్దనాన్న.. పాలు, పెరుగు, నూనె వస్తువులంటే అమ్మో.. ఫ్యాట్.. కొలెస్ట్రాల్‌ని పెంచేస్తుంది అంటూ ఆమడదూరం పరిగెడుతాడు.
మిత్స్ (అపోహలు)
ఇలా సుస్మిత, వాళ్ల పెద్దనాన్నే కాదు.. వయసు, పరిజ్ఞానం వంటి భేదాల్లేకుండా చాలామందే ఈ ఫ్యాట్స్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలియక పోషకాల ప్రాధాన్యం లేని పదార్థాలతో పొట్టనింపుకుంటున్నారు. ఫ్యాట్స్ మిత్స్‌లో పడిపోయి అదే నిజమనే మిథ్యలో ఉంటున్నారు. కొవ్వులు పెరుగుతాయనే అపోహతో నెయ్యి, నూనెలను పూర్తిగా తగ్గించేసుకుంటున్నారు. మరికొంతమందైతే కొన్ని నూనె కంపెనీలు తమది కొలెస్ట్రాల్ ఫ్రీ ఆయిల్ అన్న ప్రచారాన్ని నమ్మి ఆ కంపెనీ నూనెలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ తప్పే! అసలు మన దేశంలో వాడే నూనెల్లో దేంట్లోనూ కొలెస్ట్రాల్ ఉండదు. కొలెస్ట్రాల్ అన్నది మొక్కల (వెజిటెబుల్ కింగ్‌డమ్)నుంచి రాదు. మన నూనెలన్నీ సీడ్స్ నుంచే తయ్యారయ్యేవే. అన్ని నూనెలూ కొలెస్ట్రాల్‌ఫ్రీయే! కాబట్టి సదరు కంపెనీల ప్రచారాన్ని నమ్మి సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరంలేదు.
కొవ్వులు.. నిజాలు
ఫ్యాట్స్ అన్నీ హానికరం కాదు. మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ వైటల్ ఆర్గాన్స్‌ను సంరక్షించే రక్తనాళాలు, మెదడు, చర్మకణాలకు ఫ్యాట్స్ చాలా అవసరం. మనం తీసుకునే ఆహారానికి రుచినీ కల్పిస్తాయి. శరీరానికి శక్తినిస్తాయి. ఫ్యాట్స్ స్లిమ్‌గా ఉండడానికీ తోడ్పడుతాయి. ఉదాహరణకు అన్నంలో నెయ్యి వేసుకొని తింటే.. అది ఆహారం పైన ఓ పొరలా మారి ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. దీనివల్ల త్వరగా ఆకలి కాదు. తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఒళ్లూ పెరగదు. పైగా నెయ్యితో ఆహారాన్ని తినడం వల్ల సెటైటీ (ఆహారం తిన్న సంతృప్తి భావన) త్వరగా కలుగుతుంది. దీనివల్లా తినే పరిమాణం తగ్గుతుంది. ఆశ్చర్యంగా అనిపించినా ఇది వాస్తవం.
ఏమేమి.. ఎంత అవసరం...
మనిషికి మోనో - అన్ సాచ్యురేటెడ్, పాలీ - అన్‌సాచ్యురేటెడ్, సాచ్యురేటెడ్‌యాసిడ్స్, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అనే నాలుగు రకాల ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. వీటిలో మోనో -అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (మ్యూఫా) , పాలీ - అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (ప్యూఫా) ఆరోగ్యకరమైనవి. వీటిని మార్చిమార్చి వాడటం వల్ల గుండెకు కొవ్వులు చేరకుండా గార్డుడ్యూటీ చేస్తుంటాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్.. లో డెన్సిటీ లైపో ప్రొటీన్) పెరగకుండా చేస్తాయి. తగు మోతాదులో సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్... అంటే నెయ్యి వంటివి కూడా అవసరమే. అలాగే ఓమేగా -3 ఫ్యాటీ యాసిడ్సూ శరీరానికి కావాలి. ఎందుకంటే వాటిని మన శరీరం తయారు చేసుకోలేదు. పైగా ఎ, డి, ఇ అనే విటమిన్లను మన శరీరం గ్రహించడానికి ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఎంతగానో తోడ్పడతాయి. పై విటమిన్లు కేవలం కొవ్వుల్లోనే కరుగుతాయి. కంటికి ఎ విటమిన్, పూర్తి వ్యాధి నిరోధక శక్తికి డి విటమిన్, సంతాన సాఫల్యానికి ఇ విటమిన్ ఎంత దోహదం చేస్తాయో చెప్పనవసరం లేదు. అలాంటి విటమిన్లను శరీరంలోకి ఇంకేలా చేసేవి ఈ కొవ్వులే! అయితే ఈ ఫ్యాట్స్ అన్నీ హై ఎనర్జీనిస్తాయి. సాచ్యురేటెడ్ అయినా, అన్‌సాచ్యురేటెడ్ అయినా ఒక గ్రామ్ ఫ్యాట్ 9 క్యాలరీల శక్తినిస్తుంది. కాబట్టి ఏ ఫ్యాట్స్ అయినా అవి శరీరంలో నిల్వ ఉండనంత వరకు... అంటే మనం ఉండాల్సినదాని కన్నా ఎక్కువ బరువు ఉండనంత వరకు మాత్రమే తీసుకోవాలి.
- సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
పరిమితి అవసరం
ఎలాగూ కొవ్వు పదార్థాలు అవసరం కదా అని అదేపనిగానూ, ఆహారంలో రుచిపెంచడం కోసమూ కొవ్వుల్ని ఎక్కువ మోతాదుల్లో తీసుకోకూడదు. అలాగని పూర్తిగా నివారించకూడదు. పరిమితిలో తీసుకోవడం వల్ల కొవ్వులతోనూ ఆరోగ్యం చేకూరుతుంది. ఆ పరిమితి ఏమిటంటే... ప్రతి వ్యక్తి నెలకు అరలీటర్ (500 ఎమ్‌ఎల్) నుంచి ముప్పావు లీటర్ (750 ఎమ్‌ఎల్) వరకునూనె వాడాలి. అంతకు మించితే ఆరోగ్యానికి చేటే. మధుమేహం, గుండెజబ్బులు, రక్తపోటు వంటి వ్యాధులు ఉన్నవారైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కొలతను మించనివ్వకూడదు. ఇంత కచ్చితంగా ఎలా పాటించాలి అంటే.. ఒక టీస్పూన్‌లో 5 ఎమ్‌ఎల్ నూనె పడుతుంది. ప్రతి వ్యక్తి రోజూ 3 టీ స్పూన్ల నూనె వాడితే అది నెలకు 450 ఎమ్‌ఎల్ అవుతుంది. మరో 50 ఎమ్‌ఎల్‌ను అదనం. ఆ లెక్కన ప్రతి వ్యక్తికి రోజూ మూడు నుంచి నాలుగు చెంచాల నూనె చాలు. ఇంతకు మించి వాడకూడదనే నియమం పెట్టుకోవాలి.
కృత్రిమ కొవ్వు
దీనికి ఉదాహరణ.. మార్జరిన్. ఆహారపదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇలాంటి కృత్రిమ కొవ్వు పదార్థాలను ట్రాన్స్‌ఫ్యాట్స్ అని కూడా అంటారు. ఇది చాలా ప్రమాదకరమని పరిశోధకులు చెబుతున్నారు.
గుండెకు ఎందుకు మంచిది? ఎందుకు చెడ్డది?
ఎల్‌డీఎల్ కొవ్వు పదార్థాలు రక్తనాళాల్లో గారలాగా (ప్లాక్) ఏర్పడి, రక్తప్రవాహంలో అడ్డంకులు ఏర్పరుస్తాయి. గుండెకూ, మెదడుకు అందాల్సిన రక్తప్రవాహానికి అడ్డుపడితే గుండెపోటుకు, పక్షవాతానికి దారితీస్తాయి. హెచ్‌డీఎల్ ఆ గారను తొలగిస్తూ ఉంటుంది. కాబట్టి రక్తంలో హెచ్‌డీఎల్ పాళ్లు 40కి పైగా ఉంటేనే ఆరోగ్యం. ఎల్‌డీఎల్ పాళ్లు 100 లోపు ఉంటే మంచిది.
ఏయే నూనెల్లో ఏ ఫ్యాట్స్ ఎక్కువ?
నూనెలు ఫ్యాట్స్
వేరుశనగ, ఆలివ్ మోనో - అన్‌సాచ్యురేటెడ్
సఫోలా, సన్‌ఫ్లవర్, అవొకాడో పాలీ - అన్‌సాచ్యురేటెడ్
నెయ్యి, డాల్డా సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్
చేప, సోయాబీన్, ఆవనూనె ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్
ఏయే పదార్థాల్లో ఎంతెంత ఫ్యాట్స్
పదార్థం(గ్రాముల్లో) ఫ్యాట్స్
100 గ్రా. పాలు (స్కిమ్డ్) 1 గ్రాము
100 గ్రా. పన్నీర్ 6.5 గ్రాములు
100 గ్రా. సోయాబీన్ 19.5 గ్రాములు
ఉడికించిన కోడిగుడ్డు 7 గ్రాములు
ప్రై చేసిన గుడ్డు 14 గ్రాములు
100 గ్రా. చీజ్ 25.1 గ్రాములు
100 గ్రా. ఐస్‌క్రీమ్ (వెనీల) 11 గ్రాములు
100 గ్రా. బాదాం 58.9 గ్రాములు
100 గ్రా. జీడిపప్పు 46.9 గ్రాములు
100 గ్రా. వేరుశనగలు 40.1 గ్రాములు
100 గ్రా. మిక్స్‌డ్ నట్స్ (వేయించిన) 54 గ్రాములు
100 గ్రా డార్క్ చాక్లెట్స్ 31 గ్రాములు
100 గ్రా. పిజా 10 గ్రాములు
85 గ్రా. చేప (వెన్నలో వేయించినది) 12 గ్రాములు
ఎలా, ఎందుకు తీసుకోవాలి..?
మోనో అన్‌సాచ్యురేటెడ్, పాలీ అన్‌సాచ్యురేటెడ్, ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌తోపాటు అతి తక్కువ మోతాదులో సాచ్యురేటెడ్ ఆయిల్స్ అందేలా నూనెల కాంబినేషన్స్ మారుస్తూ తీసుకుంటే మంచిది. ఈ నూనెల వల్ల వచ్చే కొవ్వులు బయటి వేడిమి, చల్లదనం నుంచి కాపాడుతాయి. మూత్రపిండాలు, కాలేయం, గుండె వంటివాటికి ప్యాడింగ్‌గా ఉంటాయి. కాని అదే నూనెలను అంటే ఒక్కరు రోజుకు 25 గ్రాముల కంటే ఎక్కువగా వాడితే.. ఆ కొవ్వు శరీరంలో పేరుకుపోతే.. స్థూలకాయం, గుండెజబ్బులు, డయాబెటిస్, ఆర్థరైటిస్, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. శాకాహారులైతే వాళ్లు ఉపయోగించే నూనెలతోపాటు తప్పనిసరిగా సోయాబిన్‌నూనె లేదా ఆవనూనె వాడాలి. మాంసాహారులైతే వారానికి కనీసం మూడు సార్లు చేపలను తీసుకోవడం మంచిది.
వ్యక్తి వ్యక్తికీ మారే కొవ్వు పాళ్లు
ఒక వ్యక్తి ఎంత కొవ్వు తీసుకోవాలన్న అంశం వారి వ్యక్తిగత బీఎమ్‌ఐ (బాడీ మాస్ ఇండెక్స్) మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఆహారంతో తీసుకోవలసిన కొవ్వు పాళ్లు వ్యక్తి నుంచి వ్యక్తికి మారతాయి. కాబట్టి న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి ఆహారం తీసుకుంటేనే మేలైన ఆరోగ్యం.
- మధురిమా సిన్హా, చీఫ్ న్యూట్రిషనిస్ట్, కేర్ హాస్పిటల్స్