జీడిమెట్ల: పెళ్లిలో పెట్టిపోతలకంటే కీలక పాత్ర పోషించేది పెళ్లి విందు. ఆ విందులో వధువు తరఫున వారు మాంసం పెట్టలేదన్న కోపంతో పెళ్లి రద్దు చేసుకున్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని, కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఈ నెల 30న పెళ్లి చేసేందుకు ఇరువర్గాల వారు ఒప్పుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట రింగ్‌బస్తీకి చెందిన అబ్బాయికి కుత్బుల్లాపూర్‌కు చెందిన అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. 28వ తేదీ తెల్లవారుజామున 3గంటలకు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. బంధువులంతా షాపూర్‌నగర్‌లోని ఓ కల్యాణ మండపానికి చేరుకున్నారు. వధువు కుటుంబీకులు ఏర్పాటు చేసిన విందులో అందరూ భోజనం చేస్తున్నారు.
చివరిబంతిలో పెళ్లి కొడుకు మిత్రులు కూర్చున్నారు. వారికి వెజ్ ఐటమ్స్ వడ్డించారు. దీంతో కొంతమంది లేచి ‘మాంసాహారం లేదా’అని అడిగారు. లేదని వధువు కుటుంబీకులు చెప్పడంతో.. విందులో మాంసం పెట్టకపోవడమేమిటని వరుడి స్నేహితులు వధువు బంధువులతో వాగ్వాదానికి దిగారు.
అలా తిండి దగ్గర మొదలైన గొడవ ఇరువర్గాలు కొట్టుకునేవరకు వెళ్లింది. దీంతో పెళ్లి రద్దు అయినట్లు ప్రకటించారు. కాస్త నెమ్మదించాక విషయం పోలీసుల వరకూ వెళ్లింది. జీడిమెట్ల సీఐ పవన్.. ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో నవంబర్ 30(రేపు)న పెళ్లి జరిపించేందుకు ఇరు వర్గాలు ఒప్పుకున్నారు.
చదవండి: ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment