
సాక్షి,హైదరాబాద్ : నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి సేవ చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదు. అభిమానంతో మీరు నన్ను గుండెల్లో పెట్టుకుంటే మీ కుటుంబ సభ్యుడిలా మిమ్మల్ని ఆదుకుంటా’నంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన పద్మశాలి మహాసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవిని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీనే ఇందుకు నిదర్శనం. తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకునేందుకు తన సొంత ఇంటినే వేదిక చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ.
అలాంటి వ్యక్తి మరణిస్తే గత ప్రభుత్వం నివాళులు అర్పించని సంఘటనను పద్మశాలి సమాజం మరిచిపోలేదు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న మరో వ్యక్తి టైగర్ ఆలే నరేంద్ర. ఆలే నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిని చేస్తే.. ధృతరాష్ట్ర కౌగిలితో కెసీఆర్ ఆయన్ను ఖతం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా.
ఏ అవకాశం వచ్చినా పద్మశాలి సోదరులకు న్యాయం చేయడమే మా ప్రభుత్వ విధానం. కేంద్రంతో మాట్లాడి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయడమేకాదు.. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ఈ వేదికగా ప్రకటిస్తున్నాం. ఆ బాధ్యతను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకి అప్పగిస్తున్నా.
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రూ.600 కోట్ల విలువైన 1 కోటి 30 లక్షల చీరల ఆర్డర్‌ను నేతన్నలకు ఇచ్చి చేనేతను ఆదుకుంటున్నాం. మీరు అడిగింది ఇవ్వడమే నా కర్తవ్యం. నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి సేవ చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదు. అభిమానంతో నన్ను గుండెల్లో పెట్టుకుంటే మీ కుటుంబ సభ్యుడిలా మిమ్మల్ని ఆదుకుంటా.

రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించి బలహీనవర్గాల లెక్క తేల్చాం.. ఇది ఇష్టం లేని వారు లెక్కలు తప్పని మాట్లాడుతున్నారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే ప్రధాని మోదీ మెడపై కత్తిలా వేలాడుతుందని బీఆర్ఎస్, బీజేపీ లెక్కలు తప్పు అని మాట్లాడుతున్నాయి. బలహీన వర్గాల హక్కులను కాలరాసి వారి గొంతులను నులిమేసే కుట్ర జరుగుతోంది.కేసీఆర్ లెక్కలో ఉన్నత కులాలు 21 శాతం అయితే… నేను చేసిన లెక్కలో ఉన్నతకులాలు 15.28 శాతం మాత్రమే.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేయాలనే కుట్ర జరుగుతోంది
ఈ కుట్రలను బీసీ సమాజం తిప్పికొట్టాలి.ఇతర రాష్ట్రాల ఎన్నికలలోనూ ఇక్కడి పద్మశాలీల పాత్ర కీలకంగా వ్యవహరిస్తున్నారు. కోటి రూపాయలతో షోలాపూర్‌లో పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మించేందుకు సహకరిస్తాం. ఆర్ధిక, రాజకీయంగా, ఉపాధి, ఉద్యోగ పరంగా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ కోసం క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మీ సోదరుడిగా అండగా ఉంటానని ఈ వేదికగా హామీ ఇస్తున్నా’అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment