సాక్షి, హైదరాబాద్: జనగణనలో భాగంగా కుల గణన చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇందిరాపార్క్ దగ్గర బీసీ మహా సభలో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు న్యాయం జరగలేదు. మండల్ కమిషన్ రిపోర్ట్‌ను బీరువాలో పెట్టారు. మండల్ కమిషన్‌ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలి?. కాంగ్రెస్ పాలనలో ఎప్పుడూ బీసీలకు అన్యాయమే జరిగింది. అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అని కవిత సవాల్ విసిరారు.
‘‘దొంగ లెక్కలు, కాకి లెక్కలు కాకుండా వాస్తవ లెక్కలు తీయాలి. కులం ఆధారంగా రాజ్యంగ నిర్మాతలు కొన్ని రక్షణలు కల్పించారు. బీసీల కోసం పని చేసిన వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టింది. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ అన్నారు. 2011 కులగణన చేసిన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక బయటపెట్టలేదు’’ అని కవిత చెప్పారు.
‘‘కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయి. కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు న్యాయం చేశాయి. కేసీఆర్, ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు మాత్రమే బీసీలకు న్యాయం చేశారు’’ అని కవిత అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment