Delhi High Court Chief Justice
-
‘సుప్రీం’ జడ్జిగా జస్టిస్ మన్మోహన్ ప్రమాణం
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్(61) గురువారం సుప్రీంకోర్టు జడ్జీగా ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు కాంప్లెక్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ మన్మోహన్ చేరికతో సీజేఐతో కలిపి సుప్రీంకు మంజూరైన 34 మంది జడ్జీలకు గాను ప్రస్తుతం 33 మంది ఉన్నట్లయింది. జస్టిస్ మన్మోహన్‌ను అత్యున్నత న్యాయస్థానానికి నవంబర్ 28న కొలీజియం సిఫారసు చేయడం, డిసెంబర్ 3న ఆయన్ను రాష్ట్రపతి ముర్ము నియమించడం తెల్సిందే. ఆల్ ఇండియా హైకోర్టు జడ్జీల్లో సీనియారిటీ పరంగా జస్టిస్ మన్మోహన్ రెండో స్థానంలోనూ, ఢిల్లీ హైకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగాను ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పుచ్చుకున్న ఈయన 1987లో న్యాయవాదిగా పేరు నమోదుచేసుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లు కాగా, హైకోర్టు జడ్జీల విరమణ వయస్సు 62 ఏళ్లు. -
సుప్రీంకోర్టు జడ్జిగా మన్మోహన్
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఇటీవల సమావేశమై జస్టిస్ మన్మోహన్ పేరును సిఫారసు చేసిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఏ.ఎస్.ఓకా సుప్రీంకోర్టు కొలీజియంలోని ఇతర సభ్యులు. సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 34 కాగా.. ప్రస్తుతం 32 మందే ఉన్నారు. మాజీ సీజేఐ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీల పదవీ విరమణతో ఈ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. జస్టిస్ మన్మోహన్ డిసెంబరు 17, 2009లో ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరు 29న ఢిల్లీ సీజేగా పదోన్నతి పొందారు. -
మన ఇష్టాల్ని పిల్లలపై రుద్దొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: పిల్లల్లోని ఆసక్తి, అభిరుచులను గమనించి వారిని ఆయా రంగాల్లో ప్రోత్సహించాలే తప్ప, తల్లిదండ్రులు తమ ఇష్టాలను వారిపై రుద్దడం సరికాదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి. రోహిణి పేర్కొన్నారు. చిన్నారుల ఇష్టాలను గమనించి ఆయా రంగాల్లో భవిష్యత్తును ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. చదువు పేరిటి కేవలం డిగ్రీలను అందించడం కాకుండా, వారికి జీవిత విషయాలను చెబుతూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని అభిప్రాయపడ్డారు.ఢిల్లీలోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సంక్రాంతి వేడుకల కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రముఖ రచయిత, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు, శ్వాస ఫౌండేషన్ అధ్యక్షుడు డా. వీరపనేని. విష్ణున్రావులను ఏఈఎస్ హ్యుమన్ ఎక్స్‌లెన్స్ అవార్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ రోహిణి మాట్లాడారు. మానవతా విలువలు మర్చిపోవడం, మనుషుల్లో సున్నితత్వం తగ్గిపోతుండడంతోనే సమాజంలో నేరాలు పెరుగుతున్నాయన్నారు. పిల్లల పెరుగుదలలో లోటుపాట్లే భవిష్యత్తులో నేర ప్రవృత్తికి కారణమవుతున్నాయన్నారు. చిన్ననాటి నుంచే వారిలో మంచి భావాలను పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. అదే సమయంలో వారి ఇష్టాలను గౌరవిస్తూ, ఆయా రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తే ఉత్తమ ఫలితాలు సాధిస్తారన్నారు. చిన్ననాడు తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇచ్చిన సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానన్నారు. ఢిల్లీలో తెలుగు సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారంటూ ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాహకులను ఆమె అభినందించారు. ప్రతిభను గుర్తించాలి: గొల్లపూడి అనంతరం ప్రముఖ రచయిత, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాల్లో నేటికీ సంక్రాంతి వైభవం గురించి తెలియని వారు అనేకమంది ఉన్నారన్నారు. ఢిల్లీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించడంపై ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు సంసృతీ సంప్రదాయాలు, సంక్రాంతి పండుగ విశిష్టతను స్వానుభావాలతో గొల్లపూడి వివరించారు. మన దేశంలో విద్యావ్యవస్థ చదువుతోపాటు సామర్థ్యాన్ని పెంచేదిగా ఉంటే మరిన్ని అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుందని, తల్లిదండ్రులు దాన్ని గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. తాను నటుడిగా, రచయితగా మారిన తొలినాళ్లలో ఎంతో మంది ఎన్నో విధాలుగా వ్యాఖ్యలు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఇతరుల పిల్లలతో పోల్చుకుని తమ పిల్లల భవిష్యత్తును బలిపెట్టవద్దని తల్లిదండ్రులకు సూచించారు. మరో సన్మాన గ్రహీత డా. విష్ణున్‌రావు మాట్లాడుతూ..వాతావరణ కాలుష్యంతో ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు, వాటిని ఎదుర్కొనేందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఏఈఎస్ విద్యార్థుల సంప్రదాయ నృత్యాలు, సాంసృతిక కార్యక్రమాలు ఆహూతులను ఉర్రూతలూగించాయి.ఈ కార్యక్రమంలో ఏఈఎస్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
హైకోర్టు సీజేగా జస్టిస్ రోహిణి
ఢిల్లీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా చరిత్ర హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రోహిణికి పదోన్నతి లభించింది. ఆమె ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తద్వారా ఆమె ఢిల్లీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్రకెక్కారు. జస్టిస్ రోహిణి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. వచ్చేవారం ఆమె ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. జస్టిస్ రోహిణి ప్రస్తుతం హైకోర్టులో నంబర్ టూగా కొనసాగుతున్నారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆమె పేరును సుప్రీంకోర్టు కొలీజియం గత నెలలో కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. తరువాత జస్టిస్ రోహిణి నియామకానికి సంబంధించిన ఫైల్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపింది. దీంతో రాష్ట్రపతి ఆమెను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ రోహిణి 1955, ఏప్రిల్ 14న విశాఖపట్నంలో జన్మించారు. ఆంధ్రా వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1980లో న్యాయవాదిగా నమోదై, సీనియర్ న్యాయవాది కోకా రాఘవరావు వద్ద జూనియర్‌గా న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కోకా రాఘవరావు ఎడిటర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లా జర్నల్స్‌కు జస్టిస్ రోహిణి 1985లో రిపోర్టర్‌గా వ్యవహరించారు. తరువాత అదే జర్నల్స్‌కు ఆమె ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రిట్స్, సివిల్, క్రిమినల్, సర్వీసు కేసుల్లో నిపుణత సాధించారు. 1995లో ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టి, 2001లో అదనపు న్యాయమూర్తిగా, 2002లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ధైర్యానికి మారుపేరుగా నిలిచే జస్టిస్ రోహిణి న్యాయమూర్తిగా పలు సంచలన తీర్పులు వెలువరించారు.