సాక్షి, న్యూఢిల్లీ: పిల్లల్లోని ఆసక్తి, అభిరుచులను గమనించి వారిని ఆయా రంగాల్లో ప్రోత్సహించాలే తప్ప, తల్లిదండ్రులు తమ ఇష్టాలను వారిపై రుద్దడం సరికాదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి. రోహిణి పేర్కొన్నారు. చిన్నారుల ఇష్టాలను గమనించి ఆయా రంగాల్లో భవిష్యత్తును ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. చదువు పేరిటి కేవలం డిగ్రీలను అందించడం కాకుండా, వారికి జీవిత విషయాలను చెబుతూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని అభిప్రాయపడ్డారు.ఢిల్లీలోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సంక్రాంతి వేడుకల కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రముఖ రచయిత, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు, శ్వాస ఫౌండేషన్ అధ్యక్షుడు డా. వీరపనేని. విష్ణున్‌రావులను ఏఈఎస్ హ్యుమన్ ఎక్స్‌లెన్స్ అవార్డులతో సత్కరించారు.
ఈ సందర్భంగా జస్టిస్ రోహిణి మాట్లాడారు. మానవతా విలువలు మర్చిపోవడం, మనుషుల్లో సున్నితత్వం తగ్గిపోతుండడంతోనే సమాజంలో నేరాలు పెరుగుతున్నాయన్నారు. పిల్లల పెరుగుదలలో లోటుపాట్లే భవిష్యత్తులో నేర ప్రవృత్తికి కారణమవుతున్నాయన్నారు. చిన్ననాటి నుంచే వారిలో మంచి భావాలను పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. అదే సమయంలో వారి ఇష్టాలను గౌరవిస్తూ, ఆయా రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తే ఉత్తమ ఫలితాలు సాధిస్తారన్నారు. చిన్ననాడు తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇచ్చిన సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానన్నారు. ఢిల్లీలో తెలుగు సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారంటూ ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాహకులను ఆమె అభినందించారు.
ప్రతిభను గుర్తించాలి: గొల్లపూడి
అనంతరం ప్రముఖ రచయిత, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాల్లో నేటికీ సంక్రాంతి వైభవం గురించి తెలియని వారు అనేకమంది ఉన్నారన్నారు. ఢిల్లీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించడంపై ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు సంసృతీ సంప్రదాయాలు, సంక్రాంతి పండుగ విశిష్టతను స్వానుభావాలతో గొల్లపూడి వివరించారు. మన దేశంలో విద్యావ్యవస్థ చదువుతోపాటు సామర్థ్యాన్ని పెంచేదిగా ఉంటే మరిన్ని అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుందని, తల్లిదండ్రులు దాన్ని గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు.
తాను నటుడిగా, రచయితగా మారిన తొలినాళ్లలో ఎంతో మంది ఎన్నో విధాలుగా వ్యాఖ్యలు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఇతరుల పిల్లలతో పోల్చుకుని తమ పిల్లల భవిష్యత్తును బలిపెట్టవద్దని తల్లిదండ్రులకు సూచించారు. మరో సన్మాన గ్రహీత డా. విష్ణున్‌రావు మాట్లాడుతూ..వాతావరణ కాలుష్యంతో ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు, వాటిని ఎదుర్కొనేందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఏఈఎస్ విద్యార్థుల సంప్రదాయ నృత్యాలు, సాంసృతిక కార్యక్రమాలు ఆహూతులను ఉర్రూతలూగించాయి.ఈ కార్యక్రమంలో ఏఈఎస్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మన ఇష్టాల్ని పిల్లలపై రుద్దొద్దు
Published Sun, Jan 11 2015 10:43 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM
Advertisement
Advertisement