భోగాపురం : గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధిస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై బాధిత గ్రామాల్లో ప్రజలు మంగళవారం పండుగ చేసుకున్నారు. ఇంకా అదే సంతోషంలో రైతులున్న తరుణంలో కోర్టు ఉత్తర్వులతో మాకేంటి అన్నట్టు డి పట్టా భూముల సర్వేకు సర్వేయర్లు బుధవారం బయలుదేరారు. ముందుగా దల్లిపేట గ్రామంలో సర్వేకు వెళ్ళగా వాళ్ళు సహకరించకపోవడంతో వారంతా గూడెపువలస గ్రామం చేరుకుని సర్వే నంబర్ 35లో ఉన్న ప్రభుత్వ భూమిని సర్వే చేసేందుకు సిద్ధమయ్యారు.
35/4 సర్వే నంబర్‌లో భూమి కలిగిన బోనెల అసిరమ్మ కుమార్తె బోనెల గౌరి సర్వే జరుగుతున్న సంగతి తెలుసుకుని స్థలంవద్దకు చేరుకుంది. తమకు చెప్పకుండా తమ భూముల్లో సర్వే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది. అంతేగాకుండా తమకూ ఆ సర్వేనంబర్‌లో భూమి ఉందని తెలిపింది. అయితే పెద్దవాళ్లుంటే తీసుకురావాలనీ, ఇందులో వారి భూమిలేదనీ ఎయిర్‌పోర్టు సర్వే కోసం ప్రభుత్వం నియమించిన సర్వేయరు సుబ్బారావు అనడంతో వెంటనే ఆమె పరుగున ఇంటికి వెళ్ళి తమ వద్దనున్న రికార్డులను తీసుకువచ్చి చూపించింది. రికార్డులు పరిశీలించిన ఆయన మారుమాటాడలేదు.
అలాగే 35/9 సర్వే నంబరులో భూమి ఉన్న బోనెల రమణకూడా తన రికార్డులను పట్టుకుని అక్కడకు చేరుకున్నాడు. తమకు చెప్పకుండా తమ భూముల్లో సర్వే ఏవిధంగా చేస్తున్నారని మరొక సర్వేయరు అయిన శ్రీనివాసరావు, వీఆర్‌ఓ రామచంద్రరావులను నిలదీశాడు. విషయం తెలుసుకున్న సాక్షి అక్కడకు చేరుకుని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాక సర్వే ఎలా చేస్తారని వీఆర్‌ఓ రామచంద్రరావును ప్రశ్నించగా ఎయిర్‌పోర్టు ప్లానులో లేని సర్వే నం. 69కు చెందిన రైతు బుద్దాన అప్పన్న సర్వే కోరగా తామంతా వచ్చామని తెలిపారు.
మరో వీఆర్‌ఓ సుబ్బారావు మాట్లాడుతూ దల్లిపేట మాజీ సర్పంచ్ దల్లి శ్రీనివాసు ఎయిర్‌పోర్టు ప్లానులో ఉన్న ప్రభుత్వ భూముల సర్వేకు డిప్యూటీ కలెక్టరు శ్రీలతను కోరగా ఆమె ఆదేశాల మేరకు తొలుత దల్లిపేట వెళ్ళామని, అక్కడ ఎవరూ లేకపోవడంతో తిరిగి గూడెపువలస వచ్చామని ఎక్కడా సర్వే చేయలేదని సమాధానమిచ్చారు. ఏదో మామూలుగా వచ్చాం, తప్పయిపోయింది అని తిరుగుముఖం పట్టారు.
మళ్ళీ కలకలం...!
Published Thu, Jan 28 2016 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM
Advertisement
Advertisement