సాక్షి, విశాఖపట్నం: గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన, డేటా సెంటర్‌కు భూమి పూజ చేసి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ నగరాన్ని అభివృద్ధిలో మరో మెట్టు ఎక్కించారు. ఆర్థిక రాజధానిగా భాసిల్లుతున్నా.. ప్రధాన నగరాలతో అన్ని రంగాల్లో పోటీ పడుతున్నా.. ద్వితీయ శ్రేణి నగరంగానే మిగిలిపోయిన విశాఖను.. టైర్–1 సిటీల సరసన నిలబెట్టేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రగతి పరుగును ప్రారంభించారు. ముఖ్యమంత్రి పర్యటనతో మురిసిన ఉత్తరాంధ్ర.. ఇకపై తమ ప్రాంతాన్ని వలసల ప్రాంతమని కాకుండా, విప్లవాత్మక అభివృద్ధి కేంద్రంగా పిలవాలంటూ నినదించింది. సెపె్టంబర్ నుంచి ఇక్కడే పరిపాలన ప్రారంభిస్తానంటూ సీఎం పునరుద్ఘాటించడంతో ఇక్కడి ప్రజల్లో ఉత్సాహం మరింత జోరందుకుంది.
ప్రపంచంలో ఏ నగరం చూసుకున్నా కనెక్టివిటీతోనే అభివృద్ధి చెందింది. విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా భారత నౌకాదళంతో అనుసంధానమై ఉంది. దీంతో విదేశాలకు విమానాలు ఎగిరే అవకాశాలు తక్కువగా ఉండటంతో అభివృద్ధిలో అంతంతమాత్రంగానే మిగిలిపోయింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో ఇకపై ప్రపంచ దేశాలకు కనెక్టివిటీ పెరగనుంది. తద్వారా ఉత్తరాంధ్ర, సరిహద్దు జిల్లాలు అభివృద్ధి పథంలో పరుగులు పెట్టనున్నాయి. ఎయిర్‌పోర్టు రాకతో ఈ ప్రాంత ఎకానమీ మారనుంది. భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి 2026 నాటికి తొలి విమానం ఎగరనుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో.. ఉత్తరాంధ్రకు మంచిరోజులొచ్చాయని ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ ఎయిర్‌పోర్టును రూ.4,592 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.
విశాఖ–భోగాపురం.. ఆరు లైన్ల రాదారి
పేరుకే భోగాపురం విమానాశ్రయం అయినప్పటికీ.. వైజాగ్ ఎయిర్‌పోర్టుగానే వ్యవహరించనున్నారు. ఎందుకంటే విశాఖపట్నం నుంచే ఎక్కువగా రాకపోకలు సాగనున్నాయి. అందుకే మహా నగరాన్ని భోగాపురంతో అనుసంధానించేందుకు ఆరులైన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం కూడా జరగనుంది. మరో నాలుగు నెలల్లో దీనికి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఆరులైన్ల ఎక్స్‌ప్రెస్ హైవేను రెండు భాగాలుగా నిర్మించనున్నారు. హైవే రాకతో బీచ్‌రోడ్డుతో పాటు భీమిలి నుంచి భోగాపురం వరకు ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందనున్నాయి.
ఆసియా డేటా సెంటర్ రాజధానిగా విశాఖ
మధురవాడలోని ఐటీ హిల్–4లో డిజిటల్ విప్లవం మొదలుకానుంది. ఇది కేవలం విశాఖకే పరిమితం కాదు. యావత్ ఆసియా దేశాలకు పెద్దన్నగా మారనుంది. డేటా సెంటర్, టెక్నాలజీ బిజినెస్ సెంటర్లను 190 ఎకరాల్లో రూ.21,844 కోట్లతో అదానీ సంస్థ నిర్మిస్తోంది. ఏడేళ్లలోపు పూర్తికానున్న ఈ ప్రాజెక్టు ద్వారా 20 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 20 వేల మందికి పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు రానున్నాయి. సాంకేతికత రాజ్యమేలుతున్న నేపథ్యంలో.. విశాఖ నగరం డిజిటల్ రంగంలో ఆసియాకు రాజధానిగా భాసిల్లనుందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 2030 నాటికి 1 గిగావాట్ డేటా సెంటర్‌గా ఇది దశలవారీగా అభివృద్ధి చెందనుంది. డేటా స్టోరేజ్ పెంచడంతో పాటు కృత్రిమ మేధ ఆవశ్యకత తెలిపేలా డిజిటలైజేషన్ విస్తరించడం, డేటా వేగం పెరగడం.. ఇలా విభిన్నమైన ప్రయోజనాలు అందించే ఈ ప్రాజెక్టు ద్వారా ఐటీ పరిశ్రమలు విశాఖకు క్యూ కట్టనున్నాయి. ఫలితంగా మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉత్తరాంధ్ర యువతకు రానున్నాయి. సింగపూర్ నుంచి సబ్ మెరైన్ కేబుల్‌ను తీసుకొస్తూ.. డేటాసెంటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ మరింత పెరగనుంది. దీని ద్వారా పరిశ్రమలకే కాకుండా.. ప్రజలకు కూడా ఈ ప్రాజెక్టు వరంలా మారనుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధిని ఓ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయడం తమ అభిమతం కాదనీ.. ఒక ప్రాజెక్ట్ ఏర్పాటైతే.. ఆ ప్రాంతంతో పాటు దాని పరిసరాలు కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్న కాన్సెప్‌్టతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కంకణం కట్టుకున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
త్వరలోనే ప్రథమ శ్రేణి నగరంగా..
దక్షిణ భారత దేశంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ సిటీగా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా.. ఫిన్‌టెక్ హబ్‌గా.. ఇలా విభిన్న రంగాల్లో దూసుకుపోతున్న విశాఖ.. ఇంకా ద్వితీయ శ్రేణి నగరంగానే ముద్రపడిపోయింది. అందుకే వైజాగ్‌ను ప్రథమ శ్రేణి నగరాల సరసన చేర్చేందుకు కృషి చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా ప్రకటించారు. అలాగే సెపె్టంబర్ నుంచి విశాఖ కేంద్రంగానే పరిపాలన సాగిస్తామంటూ ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment