హైకోర్టుకు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో బుధవారం ఉదయం బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. హైకోర్టులో నాలుగు బాంబులున్నాయని, అవి ఏ క్షణమైనా పేలవచ్చునంటూ ఓ ఆగంతకుడు బుధవారం ఉదయం 10.30 గంటలకు పోలీసు కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో పోలీసులతోపాటు బాంబు, డాగ్ స్క్వాడ్‌లు రంగంలోకి దిగి హైకోర్టుకు చేరుకున్నాయి. హైకోర్టు పరిసర ప్రాంతాలన్నింటినీ క్షుణ్నంగా తనిఖీలు చేశారు. సుమారు రెండు గంటలపాటు తనిఖీలు నిర్వహించిన అనంతరం.. అది ఉత్తుత్తి ఫోన్‌కాల్‌గా పోలీసులు నిర్ధారించారు. అది వైజాగ్ నుంచి ఓ ల్యాండ్‌లైన్ ఫోన్ ద్వారా వచ్చినట్లు కనుగొన్నారు.