శబరిమలలో ఇక నిశ్చింత
- తెలంగాణ భక్తుల కోసం భారీ వసతిగృహం
- ఐదెకరాల స్థలం కేటాయించేందుకు కేరళ సీఎం సంసిద్ధత
సాక్షి, హైదరాబాద్: కఠోర దీక్షను కొనసాగించి, అయ్యప్ప దర్శనానికి వెళ్లే తెలంగాణ భక్తులకు శబరిమలలో ఇక మీదట వసతి, భోజనానికి ఇబ్బందులు దూరం కానున్నాయి. దక్షిణ భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నుంచే అయ్యప్ప భక్తులు ఎక్కువ సంఖ్యలో శబరిమలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో వారికోసం అయ్యప్ప క్షేత్రం వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా అన్ని వసతులతో కూడిన భారీ భవనాన్ని నిర్మించబోతోంది.
ఇందుకోసం ఐదెకరాల స్థలం కేటాయించేందుకు కేరళ ప్రభుత్వం సమ్మతించింది. కేరళ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ఆ రాష్ట్ర సీఎం ఊమెన్‌చాందీని కలసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఐదు ఎకరాల స్థలం కేటాయిస్తే తాము భవనం నిర్మించి తెలంగాణ భక్తులకు వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేసీఆర్ కేరళ సీఎంను కోరారు. దీనికి వెంటనే స్పందించిన ఊమెన్‌చాందీ భూమిని కేటాయించేందుకు సిద్ధమని ప్రకటించారు.
గతంలో భక్తుల ఇబ్బందులను కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు కేరళ సీఎం ఊమెన్‌చాందీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లారు. ఊమెన్‌చాందీతో భేటీ సందర్భంగా కేసీఆర్ ఈ విషయాన్ని కూడా ఉటంకించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. స్థలం కేటాయింపునకు కేరళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో అక్కడ భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తన విన్నపాన్ని మన్నించినందుకు కేరళ ముఖ్యమంత్రికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.