
‘అమృత’ సినిమా గుర్తుంది కదా.. మాధవన్ హీరోగా.. సీత, పార్థిబన్‌ల కూతురు టైటిల్ రోల్ పోషించిన మణిరత్నం సినిమా! శ్రీలంకలో అస్తిత్వ పోరాటం చేస్తున్న ఓ తమిళ యోధురాలు రామేశ్వరం (తమిళనాడు) కాందీశీకుల శిబిరంలో బిడ్డను కని.. పాపను ఇక్కడే వదిలేసి వెంటనే శ్రీలంక వెళ్లిపోతుంది అక్కడి తమిళుల విముక్తి పోరును ముందుకు నడిపించడానికి. ఆ శిబిరంలో ఈ పసికూనను వృత్తిరీత్యా ఇంజనీర్, ప్రవృత్తిరీత్యా రచయిత అయిన శ్రీనివాస్ దత్తత తీసుకుంటాడు. ఆ చంటిదాన్ని దత్తత తీసుకోవడం కోసమే ఇందిర అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ బిడ్డకు ‘అమృత’ అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా చూసుకుంటూంటుంది ఆ జంట. ఇన్నేళ్లకు ఈ సినిమాను ఎందుకు గుర్తుచేయాల్సి వచ్చిందంటే.. ఇంచుమించు ‘అమృత’ లాంటి కథే బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి జీవితంలోనూ ఉంది. మిథున్ దత్తత తీసుకున్న అమ్మాయి పేరు దిశాని. చాన్నాళ్ల కిందటి సంగతి ఇది.
బహుశా అప్పటికి అమృత సినిమా విడుదలై ఉండకపోవచ్చు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిందీ సంఘటన. ఆడపిల్ల భారమనే అభిప్రాయంతో ఉన్న ఓ జంట తమకు పుట్టిన కూతురును రోడ్డు పక్కనున్న చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయారు.సన్నగా .. గొంతులో ఊపిరి పెట్టుకున్న ఆ పిల్ల పాలకోసం గుక్కపట్టి ఏడుస్తుంటే ఆ రోడ్డు పక్కన వెళ్తున్న వాళ్లు చూసి.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల ద్వారా ఒక స్వచ్ఛంద సంస్థకూ విషయం తెలిసింది. ఆ పసిగుడ్డును తీసుకెళ్లి తమ హోమ్‌లో పెట్టుకున్నారు. ఇది వార్తగా మారి తెల్లవారి పత్రికల్లో, టీవీ చానళ్లలో వచ్చింది. అది మిథున్‌చక్రవర్తి కంటా పడింది. అతని మనసును కలిచివేసింది. అప్పటికే ముగ్గురు పిల్లలున్న మిథున్ నాలుగో బిడ్డగా ఆ పాపను సాకాలనుకున్నారు. భార్య యోగితాకు చెప్పాడు. ‘‘పదండి పాపను తెచ్చుకుందాం’’ అంది. వెంటనే ఆ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న హోమ్‌కు వెళ్లి .. ఆ పాపను దత్తత తీసుకుంటామని చెప్పారు ఈ తల్లిదండ్రులు. సంబంధించిన నియమ నిబంధలన్నిటికీ రాతపూర్వకమైన పూచీకత్తు ఇస్తూ ఆ బిడ్డను ఇంటికి తెచ్చుకున్నారు. ‘దిశాని’ అని పేరు పెట్టుకున్నారు. ముద్దుగా పెంచుకున్నారు.
ఇప్పుడు...
దిశానీకి తండ్రిలాగే సినిమాల్లో నటించడం ఇష్టం. దాన్నే కెరీర్‌గా ఎంచుకుంటానని తల్లి, తండ్రికి చెప్పింది. వాళ్లూ ‘‘ఓకే’’ అని.. అమ్మాయిని న్యూయార్క్‌లోని ఫిల్మ్ అకాడమీలో చేర్పించారు. నటనలో తర్ఫీదు కోసం. శిక్షణ తీసుకుంటున్న దిశాని చక్రవర్తి తెరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదీ మిథున్ చక్రవర్తి ‘అమృత’ కథ.సైలెంట్‌గా ఇలాంటి మంచి పనులెన్నో చేస్తూంటాడు మిథున్. ఓ ట్రస్ట్ పెట్టి దాని తరపున పేదవాళ్ల కొరకు ఆసుపత్రి, స్కూల్‌నూ నడిపిస్తున్నాడు. కుడిచేత్తో చేసే సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనే మాటను బాగా నమ్ముతాడట మిథున్ చక్రవర్తి.
Comments
Please login to add a commentAdd a comment