శవాలతో సావాసం మాకొద్దు..!
ఫోరెన్సిక్ మెడిసిన్‌పై అభ్యర్థుల్లో తగ్గుతున్న ఆసక్తి
సగం పీజీ సీట్లు కూడా భర్తీకాని వైనం
ప్రభుత్వాస్పత్రుల్లో శవ పరీక్షకు వైద్యుల కరువు
పంచనామా చేసిన వైద్యులే మళ్లీ పాఠాలూ చెప్పాలి
ప్రైవేటులో అవకాశాలు లేకనే రావడం లేదంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఫోరెన్సిక్ మెడిసిన్‌కు సినిమాల్లో తప్ప వాస్తవంలో ఏమాత్రం ప్రాధాన్యత ఉండడంలేదు. పీజీ చెయ్యక పోయినా ఫర్వాలేదుగానీ, నాన్‌క్లినికల్ గ్రూప్‌లో భాగంగా ఉన్న ఈ కోర్సులో సీటు తీసుకోకూడదనే ఆలోచనలో అభ్యర్థులున్నారు. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కనీసం సగం పీజీ వైద్య సీట్లు కూడా భర్తీ కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండీ ఫోరెన్సిక్ మెడిసన్ సీట్లు 12 ఉండగా ఈ ఏడాది కేవలం 3 మాత్రమే భర్తీ కావడం గమనార్హం. ఫోరెన్సిక్ మెడిసిన్‌లో పీజీ చేసినా మార్చురీలో పనిచేయడం మినహా ఎక్కడా ప్రాధాన్యత లేదని ప్రస్తుతం ఫోరెన్సిక్ పూర్తిచేసిన వైద్య అభ్యర్థులు వాపోతున్నారు. పైగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ గత కొన్నేళ్లుగా రెగ్యులర్ పోస్టులకు నియామకాలు లేవు.
ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫోరెన్సిక్ మెడిసిన్ అభ్యర్థులకు ఎలాంటి అవకాశాలూ లేకపోవడం దీనిపై ఆసక్తి లేకపోవడానికి మరో కారణం. ప్రమాద కేసులు, ఆత్మహత్య కేసులు, మెడికో లీగల్ కేసులకు ప్రభుత్వాస్పత్రుల్లోనే శవ పంచనామా జరగాలి. కానీ అక్కడ ఫోరెన్సిక్ వైద్యుల కొరత వేధిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. మొత్తం 11 బోధనాస్పత్రులు, 8 జిల్లా ఆస్పత్రులు ఉంటే అందులో శవ పరీక్షలు నిర్వహించే దిక్కులేక అవస్థలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
ప్రమాద కేసులో మృతిచెందితే నిరీక్షణే
ఏటికేటికీ రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మృతులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఆ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బట్టి పోలీస్ స్టేషన్ పరిధిని బట్టి ఆయా జిల్లా ఆస్పత్రి లేదా బోధనాస్పత్రికి తీసుకెళతారు. కానీ బోధనాస్పత్రుల్లో 8 మంది ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులుండాల్సి ఉంటే కనీసం ఇద్దరు కూడా లేని పరిస్థితి. ఒక్కో బోధనాస్పత్రికి సగటున రోజుకు ప్రమాద లేదా ఆత్మహత్య మృతుల కేసులు 10 నుంచి 15 వరకూ వస్తుంటాయి. అంటే రోజూ రాష్ట్రవ్యాప్తంగా 150 నుంచి 200 వరకూ మృతులకు పంచనామా చేయాల్సి ఉంటుంది. కానీ ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులు లేక చివరకు అటెండర్లు, వార్డు బాయ్‌లే శవ పంచనామా చేసి తూతూమంత్రంగా రిపోర్టు రాసే పరిస్థితి వచ్చింది.
ఉదాహరణకు కడప రిమ్స్‌లో ఆరుగురు ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులు ఉండాలి. కానీ ఇద్దరే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శవాలు ఎక్కువగా వస్తే పంచనామా జాప్యమవుతోంది. పోనీ శవాలకు సరిపడా ఫ్రీజర్లు(శీతల పెట్టెలు) ఉన్నాయా అంటే అదీ లేదు. దీంతో చాలా ఆస్పత్రుల్లో ఉన్న వైద్యులకు ఎంతోకొంత లంచమిచ్చి త్వరగా పంచనామా చేయించుకుంటున్నారు. కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ వంటి పెద్దాస్పత్రుల్లో విపరీతంగా ప్రమాద మృతుల కేసులు పంచనామాకు వస్తుంటాయి. అలాంటి చోటే వైద్యులు లేరు. ఉన్న వైద్యులు పంచనామా చేయడంతోపాటు ఎంబీబీఎస్ విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పాల్సిన పరిస్థితి.
ప్రైవేటులో అవకాశాలు లేకనే..
ప్రభుత్వాస్పత్రుల్లోనే శవపంచనామా చేయాల్సి ఉంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో అభ్యర్థులకు అవకాశాలు లేవు. దీంతో కొంతమంది అనాసక్తి చూపిస్తున్న మాట వాస్తవమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యుల కొరత లేదు. త్వరలోనే పదోన్నతులు చేపడుతున్నాం. ఆ తర్వాత ఫోరెన్సిక్‌లో ఎండీ చేసిన వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా తీసుకుంటాం.
– డా.కె.బాబ్జీ, వైద్యవిద్యా సంచాలకులు (అకడెమిక్)