పల్లవిపై విషప్రయోగం..?
- పోస్టుమార్టం వివరాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు రెండ్రోజుల్లో తేలనున్న నిజం
హుజూరాబాద్ :పట్టణంలోని విద్యానగర్‌లో శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన నామని పల్లవిపై విషప్రయోగం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఫ్యాన్ రెక్కకు ఉరి వేసుకుని మృతిచెందిందని ఆమె భర్త రాజు పోలీసులకు తెలిపిన విషయం తెలిసిందే. పల్లవి ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెను హత్యచేసి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు చిత్రీకరించారని మృతురాలి తండ్రి నర్సింహులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పల్లవి శరీరంపై గాయాలు ఉండటం, ఈ సంఘటనపై అనుమానాలు తలెత్తడంతో మృతురాలి బంధువులు రాజు ఇంటిపై దాడిచేశారు. ఆదివారం పల్లవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సాయంత్రం 6గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మృతదేహాన్ని పరిశీలన చేసి ఆ తర్వాత వైద్యబృందం పోస్టుమార్టం చేశారు. పల్లవి నోరు, ముక్కు నుంచి తెల్లని నురుగలు రావడం, ఆమె శరీరంలోని కొన్ని భాగాలు నల్లగా మారడంతో వైద్యులు మరింత దృష్టి సారించినట్లు తెలిసింది.
తలపై వెంట్రుకలు తొలగించి అణువణువు పరీక్షించినట్లు సమాచారం. అయితే నురగలు కక్కడంతో పల్లవిపై విషప్రయోగం జరిగిందని ఆమె తరపు వ్యక్తులు ఆరోపిస్తున్నారు. వైద్యులు పోస్టుమార్టం వివరాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిసింది. మరో రెండు రోజులు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
దాడి చేసిన వారిపై కేసు నమోదు...
పల్లవిని చంపారని ఆరోపిస్తూ రాజు ఇంటిపై దాడిచేసి, వస్తువులను ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో పలువురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. నామని రాజు బావ పేరాల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కందికట్ల మదుసుధన్, బచ్చు శివశంకర్, దీకొండ కృష్ణ, దీకొండ రాజేందర్, శ్రీనివాస్, తిరుపతి, నర్సమ్మ మరికొందరు మహిళలపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.