అంజయ్య మైనర్ కాదు.. మేజరే..!
* గ్యాంగ్‌రేప్ నిందితుడిపై ఫోరెన్సిక్ నివేదిక
* జువైనల్ హోం నుంచి కోర్టుకు తరలించే అవకాశం..?
* జాతీయ ఎస్సీ కమిషన్‌కు బాధితురాలు ఫిర్యాదు
* వివరాలు తెలుసుకున్న కమిషన్ సభ్యురాలు కమలమ్మ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ / వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు చెందిన దళిత యువతి గ్యాంగ్‌రేప్ ఘటనలో నిందితుడు ముద్దం అంజయ్య అలియాస్ అంజి మైనర్ కాదని తేలింది. అంజయ్య మేజర్ అని, ఆయన వయస్సు 19 నుంచి 21 సంవత్సరాలుగా నిర్ధారిస్తూ వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ విభాగం తేల్చింది.
ఈ మేరకు నివేదికను జిల్లా పోలీసులకు అందజేసినట్లు తెలిసింది. ఈ కేసును నేరుగా విచారిస్తున్న ఎస్పీ జోయల్ డేవిస్ నిందితుడు అంజయ్య వయస్సు నిర్ధారణపై ప్రత్యేకంగా పోలీసులను పంపించి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. అంజయ్య మైనర్ అంటూ జువైనల్ హోంకు పోలీసులు తరలించిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు, దళిత సం ఘాలు, ప్రజాసంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. పోలీసులు కేసును నీరుగార్చేందుకు నిందితులను మైనర్లుగా చిత్రీకరిస్తున్నారని పలువురు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో నిందితుడి వయస్సు నిర్ధారించాలంటూ ఎస్పీ వైద్యశాఖకు లేఖ రాశారు. దీంతో వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ ప్రొఫెసర్ కృపాల్‌సింగ్ నేతృత్వంలో నాలుగు రోజులుగా నిందితుడి వెంట్రుకలు, ఎముకలు, లింగనిర్ధారణ వంటి పరీక్షలు చేశారు. వీటి ఆధారంగా అంజ య్యకు 19 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుం దని నిర్ధారిస్తూ నివేదిక రూపొం దించారు. ఆ నివేదికను శుక్రవారం హుజూరాబాద్ డీఎస్పీ రవీందర్‌రెడ్డికి అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో గతవారం రోజులుగా నింది తుడి వయస్సుపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది.
బాధితురాలికి న్యాయం అందేలా చూస్తాం:
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చ ల్లూరు గ్రామంలో సామూహిక అత్యాచారానికి గురైన దళిత యువతికి పూర్తి న్యాయం అందేలా చూస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ అన్నారు. సామూహిక అత్యాచారం ఘటనను తీవ్రంగా పరిగణించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ శుక్రవారం బాధిత దళిత యువతి, ఆమె కుటుంబ సభ్యులను హైదరాబాద్‌కు పిలిపించుకున్నారు.
బాధిత యువతి, కుటుంబ సభ్యులు, తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌లు ఎర్రమంజిల్‌కాలనీ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని కమలమ్మ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సమాజంలో స్త్రీలకు రక్షణలేదని, ముఖ్యంగా నిమ్నజాతుల స్త్రీ పరిస్థితి మరీ దయనీయంగా ఉందని కమలమ్మ కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనపై తనకు పూర్తి నివేదిక అందలేదని, తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం నిందితు ల్లో ఒక్కర్ని మేజర్‌గా చూపించారని, మిగిలిన వారిని మైనర్లుగా చూపుతున్నారన్నారు.
నేడు (శనివారం) ఉదయం 11:30 నిమిషాలకు కరీంనగర్ జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను అమీర్‌పేటలోని ఎస్సీ కమిషన్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించినట్టు ఆమె చెప్పారు . బాధితురాలు మాట్లాడుతూ తనకు జరి గిన అన్యాయం మరెవరికీ జరగకుండా నిందితులకు కఠిన శిక్షవిధించాలని డిమాండ్ చేసింది. కమిషన్‌సభ్యురాలు కమలమ్మ తనకు పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పిందని తెలిపారు.