SP Joel Davis
-
పోలీసులకు వీక్లీఆఫ్
నేటి నుంచే అమలు * సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో పరిశీలన * సిబ్బందిపై తగ్గనున్న ఒత్తిడి, పనిభారం కరీంనగర్ క్రైం : నిత్యం విధి నిర్వహణతో ఒత్తిడికి గురవుతున్న పోలీసులకు శుభవార్త. బుధవారం నుంచి పోలీసు సిబ్బందికి వీక్లీఆఫ్‌లు వర్తింపచేస్తూ ఎస్పీ జోయల్‌డేవిస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి పారదర్శకంగా అమలు చేసేందుకు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో సుమారు నాలుగు వేల మంది సిబ్బంది, ఎస్సైలు, సీఐలు ఉండగా, వీరందరికీ వీక్లీఆఫ్ కల్పించారు. మొదట ఒక నెలపాటు ప్రయోగత్మాకంగా సాఫ్ట్వేర్ పనితీరును అంచనా వేసి, అందులో అవసరమైన మార్పులు చేర్పులు చేసిన తర్వాత పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని ఎస్పీ పేర్కొన్నారు. నిత్యం విధులతో సతమతం పోలీసు సిబ్బంది ఏడాది పొడుగునా విధులు నిర్వహిస్తూ మానసికంగా, శారీరకంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పలువురు అనారోగ్యానికి గురవుతున్నారు. మరికొందరు కుటుంబాలకు దూరమై సంబంధ బాంధవ్యాలను కోల్పోతున్నారు. ఈ విషయూలపై ఎప్పటినుంచో పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు మాదిరిగానే పోలీసు సిబ్బందికి సైతం వారానికోరోజు సెలవు ఉండాలనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పోలీసు సిబ్బందికి వీక్లీఆఫ్ కల్పించాలని నిర్ణరుుంచింది. తొలిదశలో గ్రేటర్ హైదరాబాద్‌లో అమలు చేయగా, తాజాగా మన జిల్లాలో వీక్లీఆఫ్ అమలుకు నిర్ణయం తీసుకోవడం విశేషం. దీంతో నిత్యం విధి నిర్వహణలో సతమతమవుతున్న పోలీసు సిబ్బందికి కొంత ఉపశమనం లభించనుంది. పారదర్శకత కోసం ప్రత్యేక సాప్ట్వేర్ వీక్లీఆఫ్ కేటారుుంపులో పారదర్శకత పాటించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. కరీంనగర్ పోలీస్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత వీక్లీఆఫ్ విజార్డ్ కనిపిస్తుంది. దానిలో క్లిక్ చేస్తే వీక్లిఆఫ్ లాగిన్ అని ఉంటుంది. ఈ లాగిన్‌లో ఎస్‌హెచ్‌వో, సర్కిల్ లేదా సబ్ డివిజన్ ఎంటర్ చేయూలి. తర్వాత ఎస్‌హెచ్‌వో, సీఐ, డీఎస్పీలకు ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి, తేదీలను ఎంపిక చేసుకుని సబ్మిట్ చేస్తే పీసీ, హెచ్‌సీ, ఎస్సై, సీఐలకు సంబంధించిన వీక్లిఆఫ్లు కనిపిస్తాయి. ఒక పీఎస్‌లో రెండు కంటే ఎక్కువగా సెలవులు మంజూరు కావు. ఒక ఉద్యోగి వారంలో ఒకసారి వీక్లీఆఫ్ తీసుకుని మళ్లీ తీసుకోవాలన్నా సాఫ్ట్వేర్ అమోదించదు. ప్రతి ఒక్కరు ఒకసారి మాత్రమే వీక్లీఆఫ్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల పారదర్శకత ఉంటుందని ఎస్పీ తెలిపారు. టౌన్, రూరల్ పోలీస్స్టేషన్లకు వేర్వేరుగా వీక్లీఆఫ్లున్నాయి. అంటే ప్రతి ఏడుగురిలో ఒక్కరు వీక్లీఆఫ్ వినియోగించుకోవచ్చు. వీటి ని ఎప్పటికప్పుడు ఎస్పీ ప్రత్యేకంగా పరిశీలిస్తారు. నిబంధనలు ఇవి... ⇒ జిల్లావ్యాప్తంగా పెద్ద ఉత్సవాలు, ప్రత్యేక పరిస్థితులు, వీఐపీల పర్యటనలు ఉన్నప్పుడు తప్ప మిగతా రోజుల్లో వీక్లీఆఫ్ తీసుకోవచ్చు. సబ్ డివిజన్ పరిధిలో కూడా పెద్ద కార్యక్రమాలు, ఉత్సవాలు ఉన్నప్పుడు ఆ సబ్ డివిజన్ వీక్లీఆఫ్ సైట్‌ను ఆఫ్ చేస్తారు. ⇒ పట్టణ ప్రాంతాల్లో షిఫ్ట్ డ్యూటీలు చేసే వారికి వీక్లీఆఫ్‌లు వర్తించవు. అదే పోలీస్‌స్టేషన్‌లో ఐడీ, బ్లూకోట్, రైటర్లుగా పని చేస్తున్న వారు వారంతపు సెలవులు వినియోగించుకోవచ్చు. ⇒ వీక్లీఆఫ్ రోజు ఉదయం రూల్‌కాల్ నుంచి మరుసటి రోజు రూల్‌కాల్ వరకు సెలవుగా పరిగణిస్తారు. సాధారణ సెలవులు, వీక్లీఆఫ్‌లు కలిపి తీసుకోకూడదు. ⇒ అదే పోలీస్‌స్టేషన్ ఎవరైనా సిబ్బంది సెలవుల్లో ఉన్నట్లయితే సెలవులు ముగిసిన తర్వాత వీక్లీఆఫ్ వినియోగించవచ్చు. ⇒ ఎస్‌హెచ్‌వో ప్రతి శనివారం వచ్చే వారంలో వీక్లిఆఫ్లకు సంబంధించిన వివరాలు నిర్ణయించాలి. అదే రోజు రాత్రి 12 గంటల లోపల వెబ్సైట్లో నమోదు చేయాలి. ఒకవేళ అలా నమోదు చేయకపోతే వచ్చే వారం వీక్లీఆఫ్‌లు వర్తించవు. ⇒ ఎస్‌హెచ్‌వో, ఎస్సై, సీఐ, తర్వాత విధులు నిర్వహించే అధికారిని సంప్రదించి సబ్ డివిజన్ పోలీసు అధికారి నిర్ణయించాలి. ⇒ వీక్లీఆఫ్లో వెళ్లు అధికారి తన తర్వాత విధులు నిర్వహించాల్సిన అధికారికి సమాచారం అందించాలి. ఆ విషయం జనరల్ డైరీలో నమోదు చేయాలి. -
అంజయ్య మైనర్ కాదు.. మేజరే..!
* గ్యాంగ్‌రేప్ నిందితుడిపై ఫోరెన్సిక్ నివేదిక * జువైనల్ హోం నుంచి కోర్టుకు తరలించే అవకాశం..? * జాతీయ ఎస్సీ కమిషన్‌కు బాధితురాలు ఫిర్యాదు * వివరాలు తెలుసుకున్న కమిషన్ సభ్యురాలు కమలమ్మ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ / వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు చెందిన దళిత యువతి గ్యాంగ్‌రేప్ ఘటనలో నిందితుడు ముద్దం అంజయ్య అలియాస్ అంజి మైనర్ కాదని తేలింది. అంజయ్య మేజర్ అని, ఆయన వయస్సు 19 నుంచి 21 సంవత్సరాలుగా నిర్ధారిస్తూ వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ విభాగం తేల్చింది. ఈ మేరకు నివేదికను జిల్లా పోలీసులకు అందజేసినట్లు తెలిసింది. ఈ కేసును నేరుగా విచారిస్తున్న ఎస్పీ జోయల్ డేవిస్ నిందితుడు అంజయ్య వయస్సు నిర్ధారణపై ప్రత్యేకంగా పోలీసులను పంపించి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. అంజయ్య మైనర్ అంటూ జువైనల్ హోంకు పోలీసులు తరలించిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు, దళిత సం ఘాలు, ప్రజాసంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. పోలీసులు కేసును నీరుగార్చేందుకు నిందితులను మైనర్లుగా చిత్రీకరిస్తున్నారని పలువురు ఆరోపించారు. ఈ నేపథ్యంలో నిందితుడి వయస్సు నిర్ధారించాలంటూ ఎస్పీ వైద్యశాఖకు లేఖ రాశారు. దీంతో వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ ప్రొఫెసర్ కృపాల్‌సింగ్ నేతృత్వంలో నాలుగు రోజులుగా నిందితుడి వెంట్రుకలు, ఎముకలు, లింగనిర్ధారణ వంటి పరీక్షలు చేశారు. వీటి ఆధారంగా అంజ య్యకు 19 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుం దని నిర్ధారిస్తూ నివేదిక రూపొం దించారు. ఆ నివేదికను శుక్రవారం హుజూరాబాద్ డీఎస్పీ రవీందర్‌రెడ్డికి అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో గతవారం రోజులుగా నింది తుడి వయస్సుపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. బాధితురాలికి న్యాయం అందేలా చూస్తాం: జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చ ల్లూరు గ్రామంలో సామూహిక అత్యాచారానికి గురైన దళిత యువతికి పూర్తి న్యాయం అందేలా చూస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ అన్నారు. సామూహిక అత్యాచారం ఘటనను తీవ్రంగా పరిగణించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ శుక్రవారం బాధిత దళిత యువతి, ఆమె కుటుంబ సభ్యులను హైదరాబాద్‌కు పిలిపించుకున్నారు. బాధిత యువతి, కుటుంబ సభ్యులు, తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌లు ఎర్రమంజిల్కాలనీ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని కమలమ్మ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సమాజంలో స్త్రీలకు రక్షణలేదని, ముఖ్యంగా నిమ్నజాతుల స్త్రీ పరిస్థితి మరీ దయనీయంగా ఉందని కమలమ్మ కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనపై తనకు పూర్తి నివేదిక అందలేదని, తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం నిందితు ల్లో ఒక్కర్ని మేజర్‌గా చూపించారని, మిగిలిన వారిని మైనర్లుగా చూపుతున్నారన్నారు. నేడు (శనివారం) ఉదయం 11:30 నిమిషాలకు కరీంనగర్ జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను అమీర్‌పేటలోని ఎస్సీ కమిషన్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించినట్టు ఆమె చెప్పారు . బాధితురాలు మాట్లాడుతూ తనకు జరి గిన అన్యాయం మరెవరికీ జరగకుండా నిందితులకు కఠిన శిక్షవిధించాలని డిమాండ్ చేసింది. కమిషన్సభ్యురాలు కమలమ్మ తనకు పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పిందని తెలిపారు. -
'నిర్లక్ష్యంగా ఉంటే వారిపైనా చర్యలు తప్పవు'
కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువతి అత్యాచార ఘటనలో పోలీసుల నిర్లక్షం ఉంటే వారిపైనా కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ స్ఫష్టం చేశారు. బాధితురాలు సోమవారం ఎస్పీని కలిసిన నేపధ్యంలో న్యాయం చేస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం వారి పదో తరగతి సర్టిఫికెట్లను పరిశీలించి వయసు నిర్థారణ చేశామని, నిందితుల్లో ఒకరికి17 సంవత్సరాల 9నెలలు, మరొకరికి 17ఏళ్ల 7నెలలుగా తేలిందన్నారు. వయసు నిర్థారణకై పదో తరగతి మెమోతోపాటు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. విచారణకు స్పెషల్ టీంను ఏర్పాటు చేశామని, త్వరలోనే ఛార్జిషీటు దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్షం ఉందని తేలితే వారికి కూడా చర్యలు తప్పవని ఎస్పీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
గర్ల్‌ఫ్రెండ్స్ కోసం గతి తప్పారు
కరీంనగర్ క్రైం : వాళ్లంతా ఇరవయ్యేళ్లలోపువారే. చిల్లరగా తిరిగే ఆ ముగ్గురు ఒక్కటయ్యారు. గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి జల్సాలకు దిగారు. ఇందుకు అవసరమైన డబ్బులకోసం చోరీల బాట పడ్డారు. బైక్‌లు దొంగలిస్తూ, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ సొమ్ము చేసుకునేవారు. చివరకు వీరి ఆట కట్టుబడి పోలీసులకు చిక్కారు. వీరినుంచి పోలీ సులు రూ.20 లక్షల విలువైన 50 తులాల బంగారం, 11 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ జోయల్ డేవిస్ సోమవారం హెడ్‌క్వార్టర్స్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన నేదునూరి శ్రావణ్‌కుమార్, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల హమాలివాడకు చెందిన తొంగరి రాము, పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటకు చెందిన బొకరి సునీల్‌రాజ్ మిత్రులు. శ్రావణ్, రాము పెద్దపల్లిలో, సునీల్‌రాజ్ కరీంనగర్‌లోని గణేశ్‌నగర్‌లో నివాసముం టున్నారు. వీరికి గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. చిన్నచిన్న పనులతో వచ్చే డబ్బులతో గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి జల్సాలు చేయడం ఇబ్బంది అవడంతో చోరీలు మొదలెట్టారు. ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్‌గా వారి మెడల్లోని చైన్లు లాక్కుని పారిపోయేవారు. వీరు పెద్దపల్లిలో ఉంటూ బస్సుల్లో కరీంనగర్ వచ్చి రాత్రివేళ నంబర్‌లేని బైక్‌లను గుర్తించి చోరీ చేసేవారు. మరునాడు వేకువజామున ముగ్గురూ కలిసి రెక్కీ నిర్వహించి ప్లాన్ అమలు చేసేవారు. ఒక్కోసారి ఒక్కరే... మరో చోట ఇద్దరు.. ఇంకోచోట ముగ్గురు ఇలా మూడు ముఠాలు చోరీ చేస్తున్నట్లుగా సృష్టించేవారు. అనంతరం వారు బైక్‌ను ఎక్కడన్నా వదిలేసి వెళ్లిపోయేవారు. కొన్ని నెలలుగా జిల్లాకేంద్రంతోపాటు సుల్తానాబాద్, మంచిర్యాల ప్రాంతా ల్లో చోరీలకు పాల్పడ్డారు. వచ్చిన డబ్బులు జల్సాలకు ఖర్చుచేసేవారు. అవసరమైతే బైక్‌లు అమ్మేవారు. వీరిపై 30 కేసులు వీరిపై 30 కేసులు నమోదయ్యాయి. వీరిని పట్టుకునేం దుకు కరీంనగర్ టౌన్లోనే 15 బృందాలు ఏర్పాటు చేశా రు. 4న నగరంలోని విద్యానగర్‌లో చైన్‌స్నాచింగ్ చేసి పారిపోతున్న వీరిని టూటౌన్ పోలీసులు వెంటపడి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒకరు పారిపోగా సోమవా రం గణేశ్‌నగర్‌లో పట్టుకున్నారు. వీరిని విచారించగా కరీంనగర్లో టూటౌన్ పరిధిలో 11 నేరాలు, 9 చైన్‌స్నాచింగ్‌లు, 6 బైక్‌లు, త్రీటౌన్ పరిధిలో 6 చైన్ స్నాచింగ్ లు, వన్‌టౌన్ పరిధిలో 1 చైన్‌స్నాచింగ్, సుల్తానాబాద్ పీఎస్ పరిధిలో 2 చైన్‌స్నాచింగ్‌లు, 1 బైక్, మంచిర్యాల పీఎస్ పరిధిలో 1 చైన్‌స్నాచింగ్, 1 బైక్ చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. మరో మూడు వాహనాలను వీరు గుర్తిం చలేకపోయారు. వీరి నుంచి రూ.15 లక్షల విలువైన 50 తులాల బంగారం, రూ.5 లక్షల విలువైన 11 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న డీఎస్పీ రామారావు, టూటౌన్ సీఐ హరిప్రసాద్, ఎస్సై దామోదర్‌రెడ్డి, కానిస్టేబుల్ షౌకత్ ఆలీ, వెంకటరమణ, రమేశ్‌ను, హోంగార్డ్ మల్లేశంను ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. జిల్లాలో 85 శాతం రికవరీ జిల్లాలో ఇప్పటివరకు 86 చైన్‌స్నాచింగ్ కేసులు నమోదు కాగా వీటిలో 85 శాతం వరకూ రికవరీ చేశామని ఎస్పీ జోయల్ డేవిస్ తెలిపారు. మిగతా కేసులను కూడా త్వరలోనే ఛేదిస్తామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. -
మహిళా దళ కమాండర్ లొంగుబాటు
కరీంనగర్ క్రైం: మావోయిస్టు గడ్చిరోలి దళ కమాండర్ బుర్ర భాగ్య అలియాస్ అరుణ శుక్రవారం కరీంనగర్ జిల్లా ఎస్పీ జోయల్ డెవిస్ ఎదుట లొంగిపోయారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండల సుభాష్‌నగర్‌కు చెందిన బుర్ర భాగ్య 17 ఏళ్ల క్రితం ఇంటర్ చదువుతూ 1998లో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరారు. జిల్లాలోని వివిధ దళాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో పని చేసి ప్రస్తుతం గడ్చిరోలి దళకమాండర్‌గా కొనసాగుతున్నారు. కొంత కాలం గా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆమె శుక్రవారం ఎస్పీ ఎదుట లొంగిపోయారు. వెంటనే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు.