గర్ల్‌ఫ్రెండ్స్ కోసం గతి తప్పారు
కరీంనగర్ క్రైం : వాళ్లంతా ఇరవయ్యేళ్లలోపువారే. చిల్లరగా తిరిగే ఆ ముగ్గురు ఒక్కటయ్యారు. గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి జల్సాలకు దిగారు. ఇందుకు అవసరమైన డబ్బులకోసం చోరీల బాట పడ్డారు. బైక్‌లు దొంగలిస్తూ, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ సొమ్ము చేసుకునేవారు. చివరకు వీరి ఆట కట్టుబడి పోలీసులకు చిక్కారు. వీరినుంచి పోలీ సులు రూ.20 లక్షల విలువైన 50 తులాల బంగారం, 11 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ జోయల్ డేవిస్ సోమవారం హెడ్‌క్వార్టర్స్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన నేదునూరి శ్రావణ్‌కుమార్, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల హమాలివాడకు చెందిన తొంగరి రాము, పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటకు చెందిన బొకరి సునీల్‌రాజ్ మిత్రులు. శ్రావణ్, రాము పెద్దపల్లిలో, సునీల్‌రాజ్ కరీంనగర్‌లోని గణేశ్‌నగర్‌లో నివాసముం టున్నారు. వీరికి గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. చిన్నచిన్న పనులతో వచ్చే డబ్బులతో గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి జల్సాలు చేయడం ఇబ్బంది అవడంతో చోరీలు మొదలెట్టారు. ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్‌గా వారి మెడల్లోని చైన్‌లు లాక్కుని పారిపోయేవారు.
వీరు పెద్దపల్లిలో ఉంటూ బస్సుల్లో కరీంనగర్ వచ్చి రాత్రివేళ నంబర్‌లేని బైక్‌లను గుర్తించి చోరీ చేసేవారు. మరునాడు వేకువజామున ముగ్గురూ కలిసి రెక్కీ నిర్వహించి ప్లాన్ అమలు చేసేవారు. ఒక్కోసారి ఒక్కరే... మరో చోట ఇద్దరు.. ఇంకోచోట ముగ్గురు ఇలా మూడు ముఠాలు చోరీ చేస్తున్నట్లుగా సృష్టించేవారు. అనంతరం వారు బైక్‌ను ఎక్కడన్నా వదిలేసి వెళ్లిపోయేవారు. కొన్ని నెలలుగా జిల్లాకేంద్రంతోపాటు సుల్తానాబాద్, మంచిర్యాల ప్రాంతా ల్లో చోరీలకు పాల్పడ్డారు. వచ్చిన డబ్బులు జల్సాలకు ఖర్చుచేసేవారు. అవసరమైతే బైక్‌లు అమ్మేవారు.
వీరిపై 30 కేసులు
వీరిపై 30 కేసులు నమోదయ్యాయి. వీరిని పట్టుకునేం దుకు కరీంనగర్ టౌన్‌లోనే 15 బృందాలు ఏర్పాటు చేశా రు. 4న నగరంలోని విద్యానగర్‌లో చైన్‌స్నాచింగ్ చేసి పారిపోతున్న వీరిని టూటౌన్ పోలీసులు వెంటపడి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒకరు పారిపోగా సోమవా రం గణేశ్‌నగర్‌లో పట్టుకున్నారు. వీరిని విచారించగా కరీంనగర్‌లో టూటౌన్ పరిధిలో 11 నేరాలు, 9 చైన్‌స్నాచింగ్‌లు, 6 బైక్‌లు, త్రీటౌన్ పరిధిలో 6 చైన్ స్నాచింగ్ లు, వన్‌టౌన్ పరిధిలో 1 చైన్‌స్నాచింగ్, సుల్తానాబాద్ పీఎస్ పరిధిలో 2 చైన్‌స్నాచింగ్‌లు, 1 బైక్, మంచిర్యాల పీఎస్ పరిధిలో 1 చైన్‌స్నాచింగ్, 1 బైక్ చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు.
మరో మూడు వాహనాలను వీరు గుర్తిం చలేకపోయారు. వీరి నుంచి రూ.15 లక్షల విలువైన 50 తులాల బంగారం, రూ.5 లక్షల విలువైన 11 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న డీఎస్పీ రామారావు, టూటౌన్ సీఐ హరిప్రసాద్, ఎస్సై దామోదర్‌రెడ్డి, కానిస్టేబుల్ షౌకత్ ఆలీ, వెంకటరమణ, రమేశ్‌ను, హోంగార్డ్ మల్లేశంను ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు.
జిల్లాలో 85 శాతం రికవరీ
జిల్లాలో ఇప్పటివరకు 86 చైన్‌స్నాచింగ్ కేసులు నమోదు కాగా వీటిలో 85 శాతం వరకూ రికవరీ చేశామని ఎస్పీ జోయల్ డేవిస్ తెలిపారు. మిగతా కేసులను కూడా త్వరలోనే ఛేదిస్తామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు.