పోలీసులకు వీక్లీఆఫ్ | today from starts for Police weekly off's | Sakshi
Sakshi News home page

పోలీసులకు వీక్లీఆఫ్

Published Wed, Jun 22 2016 1:02 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

పోలీసులకు వీక్లీఆఫ్ - Sakshi

పోలీసులకు వీక్లీఆఫ్

నేటి నుంచే అమలు
* సాఫ్ట్‌వేర్ ద్వారా ఆన్‌లైన్‌లో పరిశీలన
* సిబ్బందిపై తగ్గనున్న ఒత్తిడి, పనిభారం

కరీంనగర్ క్రైం : నిత్యం విధి నిర్వహణతో ఒత్తిడికి గురవుతున్న పోలీసులకు శుభవార్త. బుధవారం నుంచి పోలీసు సిబ్బందికి వీక్లీఆఫ్‌లు వర్తింపచేస్తూ ఎస్పీ జోయల్‌డేవిస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి పారదర్శకంగా అమలు చేసేందుకు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

జిల్లాలో సుమారు నాలుగు వేల మంది సిబ్బంది, ఎస్సైలు, సీఐలు ఉండగా, వీరందరికీ వీక్లీఆఫ్ కల్పించారు. మొదట ఒక నెలపాటు ప్రయోగత్మాకంగా సాఫ్ట్‌వేర్ పనితీరును అంచనా వేసి, అందులో అవసరమైన మార్పులు చేర్పులు చేసిన తర్వాత పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని ఎస్పీ పేర్కొన్నారు.
 
నిత్యం విధులతో సతమతం
పోలీసు సిబ్బంది ఏడాది పొడుగునా విధులు నిర్వహిస్తూ మానసికంగా, శారీరకంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పలువురు అనారోగ్యానికి గురవుతున్నారు. మరికొందరు కుటుంబాలకు దూరమై సంబంధ బాంధవ్యాలను కోల్పోతున్నారు. ఈ విషయూలపై ఎప్పటినుంచో పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది.

ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు మాదిరిగానే పోలీసు సిబ్బందికి సైతం వారానికోరోజు సెలవు ఉండాలనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పోలీసు సిబ్బందికి వీక్లీఆఫ్ కల్పించాలని నిర్ణరుుంచింది. తొలిదశలో గ్రేటర్ హైదరాబాద్‌లో అమలు చేయగా, తాజాగా మన జిల్లాలో వీక్లీఆఫ్ అమలుకు నిర్ణయం తీసుకోవడం విశేషం. దీంతో నిత్యం విధి నిర్వహణలో సతమతమవుతున్న పోలీసు సిబ్బందికి కొంత ఉపశమనం లభించనుంది.
 
పారదర్శకత కోసం ప్రత్యేక సాప్ట్‌వేర్
వీక్లీఆఫ్ కేటారుుంపులో పారదర్శకత పాటించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. కరీంనగర్ పోలీస్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత వీక్లీఆఫ్ విజార్డ్ కనిపిస్తుంది. దానిలో క్లిక్ చేస్తే వీక్లిఆఫ్ లాగిన్ అని ఉంటుంది. ఈ లాగిన్‌లో ఎస్‌హెచ్‌వో, సర్కిల్ లేదా సబ్ డివిజన్ ఎంటర్ చేయూలి. తర్వాత ఎస్‌హెచ్‌వో, సీఐ, డీఎస్పీలకు ఇచ్చిన  పాస్‌వర్డ్ ఎంటర్ చేసి, తేదీలను ఎంపిక చేసుకుని సబ్‌మిట్ చేస్తే పీసీ, హెచ్‌సీ, ఎస్సై, సీఐలకు సంబంధించిన వీక్లిఆఫ్‌లు కనిపిస్తాయి.

ఒక పీఎస్‌లో రెండు కంటే ఎక్కువగా సెలవులు మంజూరు కావు. ఒక ఉద్యోగి వారంలో ఒకసారి వీక్లీఆఫ్ తీసుకుని మళ్లీ తీసుకోవాలన్నా సాఫ్ట్‌వేర్ అమోదించదు. ప్రతి ఒక్కరు ఒకసారి మాత్రమే వీక్లీఆఫ్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల పారదర్శకత ఉంటుందని ఎస్పీ తెలిపారు. టౌన్, రూరల్ పోలీస్‌స్టేషన్లకు వేర్వేరుగా వీక్లీఆఫ్‌లున్నాయి. అంటే ప్రతి ఏడుగురిలో ఒక్కరు వీక్లీఆఫ్ వినియోగించుకోవచ్చు. వీటి ని ఎప్పటికప్పుడు ఎస్పీ ప్రత్యేకంగా పరిశీలిస్తారు.
 
నిబంధనలు ఇవి...
జిల్లావ్యాప్తంగా పెద్ద ఉత్సవాలు, ప్రత్యేక పరిస్థితులు, వీఐపీల పర్యటనలు ఉన్నప్పుడు తప్ప మిగతా రోజుల్లో వీక్లీఆఫ్ తీసుకోవచ్చు. సబ్ డివిజన్ పరిధిలో కూడా పెద్ద కార్యక్రమాలు, ఉత్సవాలు ఉన్నప్పుడు ఆ సబ్ డివిజన్ వీక్లీఆఫ్ సైట్‌ను ఆఫ్ చేస్తారు.
పట్టణ ప్రాంతాల్లో షిఫ్ట్ డ్యూటీలు చేసే వారికి వీక్లీఆఫ్‌లు వర్తించవు. అదే పోలీస్‌స్టేషన్‌లో ఐడీ, బ్లూకోట్, రైటర్లుగా పని చేస్తున్న వారు వారంతపు సెలవులు వినియోగించుకోవచ్చు.
వీక్లీఆఫ్ రోజు ఉదయం రూల్‌కాల్ నుంచి మరుసటి రోజు రూల్‌కాల్ వరకు సెలవుగా పరిగణిస్తారు. సాధారణ సెలవులు, వీక్లీఆఫ్‌లు కలిపి తీసుకోకూడదు.
అదే పోలీస్‌స్టేషన్ ఎవరైనా సిబ్బంది సెలవుల్లో ఉన్నట్లయితే సెలవులు ముగిసిన తర్వాత వీక్లీఆఫ్ వినియోగించవచ్చు.
ఎస్‌హెచ్‌వో ప్రతి శనివారం వచ్చే వారంలో వీక్లిఆఫ్‌లకు సంబంధించిన వివరాలు నిర్ణయించాలి. అదే రోజు రాత్రి 12 గంటల లోపల వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. ఒకవేళ అలా నమోదు చేయకపోతే వచ్చే వారం వీక్లీఆఫ్‌లు వర్తించవు.
ఎస్‌హెచ్‌వో, ఎస్సై, సీఐ, తర్వాత విధులు నిర్వహించే అధికారిని సంప్రదించి సబ్ డివిజన్ పోలీసు అధికారి నిర్ణయించాలి.
వీక్లీఆఫ్‌లో వెళ్లు అధికారి తన తర్వాత విధులు నిర్వహించాల్సిన అధికారికి సమాచారం అందించాలి. ఆ విషయం జనరల్ డైరీలో నమోదు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement