కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది.
ఆ విషయంపై వివాదం..
అమరన్‌లో మేజర్ ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ కనిపించగా.. ఆయన భార్యగా ఇందు పాత్రలో సాయిపల్లవి నటించింది. అయితే ఈ చిత్రంలో మేజర్ ముకుంద్ కులాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ఓ వర్గం ప్రజలు ప్రశ్నించారు. తాజాగా చెన్నైలో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి ఈ విషయంపై స్పందించారు. ఈ సినిమాలో మేజర్ కులాన్ని ఎందుకు చూపించలేదన్న అంశంపై రాజ్‌కుమార్ క్లారిటీ ఇచ్చారు.
మేజర్ కుటుంబం అభ్యర్థన ఇదే..
ముకుంద్ భార్య ఇందు, అతని తల్లిదండ్రులు సినిమా తీయడానికి ముందే కొన్ని అభ్యర్థనలు చేశారని డైరెక్టర్ వివరించారు. మేజర్ ముకుంద్ తమిళియన్ కావడంతో.. ఆ పాత్రలో కచ్చితంగా తమిళ మూలాలు ఉన్న వ్యక్తిని నన్ను నటింపజేయాలని ఆమె కోరిందని తెలిపారు. అది నాకు శివకార్తికేయన్‌లో కనిపించిందని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి తమిళ గుర్తింపు కూడా ఉండాలని ఆమె కోరుకుందని వెల్లడించారు.
అదేవిధంగా ముకుంద్ తల్లిదండ్రులు తమ కుమారుడిని భారతీయుడిగానే చూపించాలని కోరినట్లు రాజ్‌కుమార్ తెలిపారు. అంతేకాకుండా తన సర్టిఫికేట్‌లో కూడా భారతీయుడు, తమిళుడు తప్ప మరేలాంటి గుర్తింపు తమకు వద్దన్నారు. మేజర్ ముకుంద్‌ను ఆర్మీ మ్యాన్‌గా మాత్రమే గుర్తించాలని ఆయన తల్లిదండ్రులు నన్ను అభ్యర్థించారని వెల్లడించారు. అందుకే సినిమాలో ఎక్కడా కూడా ముకుంద్ కులాన్ని ప్రస్తావించలేదన్నారు. అలాగే మేజర్ కుటుంబం తనను ఎప్పుడూ కులం అడగలేదని.. అదే స్ఫూర్తితో అశోకచక్ర అవార్డు గ్రహీతకు బహుమతిగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు డైరెక్టర్ వెల్లడించారు.
అమరన్ గురించి..
కాగా.. అమరన్ చిత్రాన్ని 2014లో జరిగిన ఉగ్రవాద దాడి ఆధారంగా తెరకెక్కించారు. ఈ దాడుల్లో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవిత చరిత్రనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా.. మేజర్ ముకుంద్ వరదరాజన్ 2009లో ఇందును వివాహం చేసుకోగా..2011లో వీరికి కుమార్తె అర్షే ముకుంద్ జన్మించింది. ఈ చిత్రాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ పుస్తకం ఆధారంగా రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment