అసెంబ్లీ పేల్చివేతకు కుట్ర | Explosive recovered from UP Assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ పేల్చివేతకు కుట్ర

Published Sat, Jul 15 2017 1:11 AM | Last Updated on Wed, Apr 3 2019 3:55 PM

అసెంబ్లీ పేల్చివేతకు కుట్ర - Sakshi

అసెంబ్లీ పేల్చివేతకు కుట్ర

ఉత్తరప్రదేశ్‌ విధానసభలో విస్ఫోటక పీఈటీఎన్‌ను గుర్తించిన సిబ్బంది
► సభలో విపక్షనేత సీటు సమీపంలో పౌడర్‌
►ఫోరెన్సిక్‌ నివేదికతో కుట్ర బట్టబయలు
► ఎన్‌ఐఏ దర్యాప్తుకు యూపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం


లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ పేల్చివేతకు భారీ కుట్ర జరిగింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ్యుల భద్రతకు సవాల్‌ విసురుతూ సభలో ప్రమాదకర పేలుడు పదార్థం లభించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ ప్లాస్టిక్‌ పేలుడు పదార్థమైన పీఈటీఎన్‌ (పెంటా ఎరిథ్రిటాల్‌ టెట్రానైట్రేట్‌)ను విధ్వంసానికి ముందే గుర్తించటంతో భారీ ప్రమాదం తప్పింది.

జూలై 12న అసెంబ్లీని శుభ్రం చేస్తున్న ఉద్యోగులకు ప్రతిపక్ష సభ్యులు కూర్చునే సీటు కింద పేపర్లో చుట్టిన పీఈటీఎన్‌ దొరికింది. అత్యంత భద్రత ఉండే అసెంబ్లీలో.. అదీ అసెంబ్లీ హాల్లో 150 గ్రాముల పేలుడు పదార్థం దొరకటం కలకలం రేపుతోంది. దీనిపై ఎన్‌ఐఏ విచారణ జరపాలని యూపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. దీంతోపాటు అసెంబ్లీలో పనిచేస్తున్న సిబ్బందిని విచారించేందుకు కూడా స్పీకర్‌ హృదయ్‌ నారాయణ్‌ దీక్షిత్‌ ఆదేశాలు జారీచేశారు.

మామూలు పౌడర్‌ అనుకుంటే..!
యూపీలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. జూలై 11న బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. తర్వాత యథావిధిగా 12వ తేదీన సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సమయంలో అసెంబ్లీ హాలును శుభ్రం చేస్తున్న సిబ్బందికి.. విపక్ష నేత రాంగోవింద్‌ చౌధురీ కూర్చునే సీటు సమీపంలో ఓ కాగితపు పొట్లం కనబడింది. దీన్ని విప్పిచూస్తే పౌడర్‌ కనిపించింది. జాగిలాలు వచ్చి పరిశీలించినా ఈ పౌడర్‌ ఏంటో గుర్తించలేకపోయాయి.

ఈ పౌడర్‌ను స్థానిక పోలీసు స్టేషన్‌ ఎస్సై ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించటంతో అసలు కుట్ర వెలుగులోకి వచ్చింది. అత్యంత విధ్వంసకరమైన ప్లాస్టిక్‌ ఎక్స్‌ప్లోజివ్‌ పీఈటీఎన్‌ అని తేలింది. ఈ విషయాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్వయంగా సభలో ప్రకటించటంతో ఎమ్మెల్యేలంతా నిశ్చేష్టులయ్యారు. కేవలం 150 గ్రాముల పీఈటీఎన్‌ మాత్రమే లభించిందని.. అయితే 500 గ్రాముల ఈ పౌడర్‌తో మొత్తం విధానసభ భవనాన్నే పేల్చేయవచ్చని సీఎం వెల్లడించారు. అయితే ఐఈడీ లేదా డిటోనేటర్‌తో మాత్రమే దీన్ని వినియోగించవచ్చని ఒక్క పౌడర్‌తో ఎలాంటి సమస్యా ఉండదని భద్రతాధికారులు స్పష్టం చేశారు.

భద్రతపై అనుమానాలు
‘ఇదో తీవ్రమైన ఉగ్రవాద కుట్రగా భావిస్తున్నాం. సభ భద్రత మా బాధ్యత. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ఈ ఘటనపై ఎన్‌ఐఏ విచారణకు సభ ఏకాభిప్రాయ తీర్మానం చేసింది. విధాన్‌ భవన్‌ (అసెంబ్లీ) ఉద్యోగులందరినీ పోలీసులు విచారించేందుకు అనుమతినిచ్చాం’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పష్టం చేశారు. సభ జరుగుతున్న సమయంలో భద్రతా వలయాన్ని దాటుకుని ఇంత విధ్వంసకర పేలుడు పదార్థం సభ లోపలకు రావటం ప్రమాదకరమని దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు.

సభలోపలకు ఎమ్మెల్యేలు, మార్షల్స్‌ తప్ప వేరెవరినీ అనుమతించేది లేదన్నారు. ఎమ్మెల్యేలు, సిబ్బంది మొబైల్‌ ఫోన్స్‌ను సభలోకి తీసుకురావొద్దని యోగి కోరారు. అటు అసెంబ్లీ గేట్ల వద్ద క్విక్‌ రెస్పాన్స్‌ టీం (క్యూఆర్‌టీ), సాయుధ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎమ్మెల్యేల భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలకు తమ మద్దతుంటుందని విపక్ష నేత రాంగోవింద్‌ చౌధురీ తెలిపారు.

పేల్చేస్తానన్న యువకుడి అరెస్టు
ఆగస్టు 15న అసెంబ్లీని పేల్చేస్తానంటూ బెదిరించిన ఫర్హాన్‌ అహ్మద్‌ (20) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.∙అహ్మద్‌ తప్పుడు డాక్యుమెంట్లతో సిమ్‌ కొని ఫోన్‌చేసి బెదిరించాడని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరుగుతోంది. క్రిస్టల్స్‌ రూపంలో ఉండే ఈ పీఈటీఎన్‌ను భద్రతా పరికరాలు పసిగట్టలేవు. అందుకే దీన్ని ఉగ్రవాదులు ఎక్కువగా వాడతారని ఫోరెన్సిక్‌ నిపుణులు చెప్పారు. నైట్రో గ్లిజరిన్‌ కుటుంబానికి చెందిన పీఈటీఎన్‌ బ్లాక్‌ మార్కెట్‌లో విరివిగానే లభిస్తుందని కూడా వారు తెలిపారు. గనుల్లో ఉపయోగించే ఈ మిశ్రమాన్ని చాలా దేశాలు నిషేధించాయి. 2011 ఢిల్లీ హైకోర్టులో పేలుడు (17 మంది మృతి చెందారు) ఘటన సందర్భంగా తొలిసారిగా పీఈటీఎన్‌ వినియోగం భారత్‌లో బయటపడింది.

పీఈటీఎన్‌ అంటే?
పెంటాఎరిథ్రిటాల్‌ టెట్రానైట్రేట్‌ (పీఈటీఎన్‌) అత్యంత శక్తిమంతమైన ప్లాసిక్‌ పేలుడు పదార్థం. నైట్రోగ్లిజరిన్‌ తరహా రసాయనిక మిశ్రమం. పౌడర్‌ రూపంలో, స్పటిక రూపంలో లేదా సన్నని ప్లాస్టిక్‌ షీట్‌ రూపంలో ఉంటుంది. వేడిని పుట్టించడం ద్వారా (బ్లాస్టింగ్‌ క్యాప్‌ ద్వారా సన్నటి అల్యూమినియం లేదా రాగి గొట్టానికి వైర్లతో కనెక్ట్‌ చేసి బ్యాటరీ ద్వారా వేడి చేస్తారు)నైనా, షాక్‌వేవ్‌ ద్వారానైనా దీన్ని పేల్చవచ్చు.

మోతాదు తక్కువ.. తీవ్రత ఎక్కువ!
పీఈటీఎన్‌ పేలుడు తీవ్రత భారీగా ఉంటుంది. అందుకే అధిక జననష్టాన్ని కోరుకునే ఉగ్రవాదులు పేలుళ్లకు దీన్ని ఎంచుకుంటారు. రవాణా, నిలువ చేయడం తేలిక, సురక్షితం కూడా. పేల్చినపుడు మాత్రం భీకరమైన శక్తి వెలువడుతుంది. తక్కువ మోతాదుతోనే భారీనష్టం కలిగించవచ్చు. 1894లో జర్మనీ పేలుడు పదార్థాల ఉత్పత్తి సంస్థ ‘స్ప్రెంగ్‌స్టోఫ్‌’ మొదటిసారిగా దీన్ని ఉత్పత్తి చేసి పేటెంట్‌ పొందింది. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత వాణిజ్యస్థాయిలో విస్తృత వినియోగంలోకి వచ్చింది.

పీఈటీఎన్‌ సాధారణ ఎక్స్‌రే స్కానర్లకు, మెటల్‌ డిటెక్టర్లకు దొరకదు. పైగా ప్లాస్టిక్‌ షీట్‌ రూపంలో ఉన్నపుడు దీన్ని ఏ ఆకృతిలోకైనా మార్చవచ్చు. అనుమానం రాకుండా ఏదైనా వస్తువులో దాచేయొచ్చు. శరీరానికి అతికించేయొచ్చు. ఎలక్ట్రికల్‌ వస్తువుల్లో దాస్తే పట్టుకోవడం కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకొనే వాణిజ్య తయారీ సంస్థలు పీఈటీఎన్‌ను గుర్తించేందుకు వీలుగా దాంట్లో కొన్ని పదార్థాలను కలుపుతున్నాయి. అయితే.. కాస్తంత రసాయన శాస్త్ర పరిజ్ఞానంతో మార్కెట్లో సులువుగా దొరికే పదార్థాలతోనే పీఈటీఎన్‌ను తయారు చేస్తున్నారు.

విమానాల్లో రెండు యత్నాలు
2001లో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని కూల్చడానికి బ్రిటన్‌కు చెందిన రిచర్డ్‌ రీడ్‌ విఫలయత్నం చేశాడు. బూట్లలో పెంటాఎరిథ్రిటాల్‌ టెట్రానైట్రేట్‌ను దాచి విమానం ఎక్కాడు. పేలకపోవడంతో చేత్తో అంటించే ప్రయత్నం చేశాడు. తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది సకాలంలో అతన్ని బంధించారు. 2009 క్రిస్మస్‌ రోజు డెట్రాయిట్‌కు వెళుతున్న నార్త్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని పీఈటీఎన్‌తో పేల్చడానికి ఉమర్‌ ఫరూక్‌ అబ్దుల్‌ ముతల్లాబ్‌ విఫలయత్నం చేశాడు. లోదుస్తుల్లో దాచిన పీఈటీఎన్‌ను పేల్చడానికి ఉమర్‌ సిరంజితో పలు రసాయనాలను అందులోకి జొప్పించాడు. అయితే బాంబు పేలకుండా అతని తొడ కాలిపోయింది.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement