సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ చిలుకా నగర్‌లోని చిన్నారి నరబలి కేసు విచారణ తుదిదశకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి డీఎన్‌ఏ నివేదిక పోలీసులకు అందింది. క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటిపై లభించిన తల, అతడి ఇంట్లో లభించిన రక్తపు మరకలు ఆడ శిశువువిగా ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. మూఢ నమ్మకాల నెపంతో చిన్నారిని బలి ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రతాప సింగారం వద్ద మూసీనదిలో మొండెంను పడేసినట్లు దర్యాప్తులో నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది.
బలి ఇచ్చిన చిన్నారిని బోయగూడలోని ఫుట్‌పాత్ వద్ద నిద్రిస్తున్న వారి దగ్గర నుంచి చిన్నారిని ఎత్తుకొచ్చినట్లు సమాచారం. ఈ కేసులో క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్, అతని భార్య శ్రీలత, బంధువులు లచ్చక్క, బుచ‍్చమ్మ, నలుగురు మాంత్రికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా రాజశేఖర్ తన భార్య శ్రీలత ఆరోగ్యం కోసం నరబలి చేసినట్లు పోలీసులు ముందు ఒప్పుకున్న విషయం తెలిసిందే. నిందితులను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. నరబలి తర్వాత పాప తలపై చంద్రుని వెలుగు, సూర్య కిరణాలు పడాలని చెప్పడంతో డాబాపై తల పెట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నరబలి కేసులో మరొ కొత్త ట్విస్ట్..
నరబలి కేసులో బోయగూడకు చెందిన రాజశేఖర్ సోదరుడు గణేశ్ కీలకంగా వ్యవహారించాడు. గణేశ్ చార్మినార్‌లోని ఒక బాబా కన్నుసన్నల్లో పూజలు చేయించాడు. బోయగూడలోని ఓ ఫుట్ పాత్ నుంచి నరబలి కోసం చిన్నారిని ఎత్తుకొచ్చాడు. నరబలి తర్వాత రక్తం మరకలు ఉన్న దుస్తులను సోదరులు ఇద్దరు బండ్లగూడ మూసి సమీపంలో చెట్ల పొదలో పడేశారు. పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరకకుండా ముందు జాగ్రత్త పడ్డారు. వీరిద్దరికి కన్నతల్లి అన్ని విధాలా సహకరించింది. తనకు ఏమి తెలియనట్లు రాజశేఖర్ తల్లి పోలీసుల దగ్గర నమించే ప్రయత్నం చేసింది. కేసు దర్యాప్తులో మృతి చెందిన చిన్నారిని తల్లి గుర్తించడమే కాకుండా గణేశ్ అపహరించినట్లు పోలీసులకు సమాచారం అందించింది. పోలీసుల దృష్టి మరల్చేందుకు అర్ధరాత్రి సమయంలో గణేశ్ నరహరి ఇంటిలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment