పోలీసుల తనిఖీలు, ఇన్ సెట్లో రాజశేఖర్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ చిలుకానగర్‌లోని చిన్నారి నరబలి కేసులో ఆశ్చర్యకర నిజాలు వెలుగుచూస్తున్నాయి. భార్య ఆరోగ్యం కోసం రాజశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ ఆరేళ్ల పాపను నరబలి ఇవ్వడం నగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. రెండు వారాల కిందట జరిగిన చిన్నారి నరబలి కేసును పోలీసులు ఛేదించారు. రెండేళ్ల కిందటే నరబలికి బీజం పడింది. రెండేళ్ల కిందట మేడారం జాతరకు రాజశేఖర్, లత దంపతులు వెళ్లగా అక్కడ వారు ఓ కోయదొరను కలిశారు. ఆరోగ్యం బాగుపడాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవాలంటే నరబలి ఇవ్వడమే మార్గమని ఆ కోయదొర, మాంత్రికుడు ఈ దంపతులకు చెప్పాడు. ఇక అప్పటినుంచీ నరబలి గురించి ఎంతో ఆలోచిస్తున్న రాజశేఖర్, శ్రీలతలు బలి ఇచ్చేందుకు పిల్లలు ఎక్కడ దొరుకుతారని తీవ్రంగా యత్నించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో గత జనవరి 31న రాజశేఖర్ సోదరుడు గణేశ్ బోయగూడలోని ఓ ఫుట్ పాత్ నుంచి నరబలి కోసం చిన్నారిని ఎత్తుకొచ్చాడు. చార్మినార్‌లోని ఒక బాబా కన్నుసన్నల్లో పూజలు చేయించాడు. నరబలి తర్వాత రక్తం మరకలు ఉన్న దుస్తులను సోదరులు ఇద్దరు బండ్లగూడ మూసి సమీపంలో చెట్ల పొదలో పడేశారు. ప్రతాప సింగారం వద్ద మూసీనదిలో మొండెంను నిందితులు పడేశారు. పాప తలపై చంద్రుని వెలుగు, సూర్య కిరణాలు పడాలని చెప్పడంతో డాబాపై తల పెట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండేళ్ల నుంచి నరబలి ఇవ్వడానికి నిందితులు యత్నిస్తున్నట్లు తెలియడంతో పోలీసులే షాకయ్యారు. సెక్షన్ 124 , 302, 366, 201, 120 B కింద కేస్ నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
నరబలి జరిగినట్లు గుర్తించాం: మహేష్ భగవత్
నరబలి కేసుపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ పలు విషయాలు వెల్లడించారు. ఇటీవల జరిగిన నరబలి కేసును చేధించాం. చిన్నారి నరబలి కేసులో మొత్తం 122 ఫోన్లు, 54 సెల్ టవర్ ల డేటాను అనలైజ్ చేశాం. మొత్తం 40 మంది సాక్షులను, 45 మంది అనుమానితులను విచారించాం. 100 సీసీ కెమెరాల డేటాను పరిశీలించాం. ప్రధాన నిందితుడు రాజశేఖర్‌తో పాటు భార్య శ్రీలత, ఓ మాంత్రికుడు సహా పాపను తీసుకు వచ్చిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశాం. మొత్తం ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాం. భిన్నకోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత నరబలి జరిగినట్లు గుర్తించాం. క్యాబ్ డ్రైవర్, ఇంటి యజమాని రాజశేఖర్ కోయదొర, మాంత్రికుడి సలహా మేరకు పాపను నరబలి ఇచ్చినట్టు విచారణలో వెల్లడైంది. ఘటనా స్థలంలో లభ్యం అయిన నమూనాలతో ఫొరెన్సిక్ నివేదిక సమర్పిచింది. డీఎన్‌ఏ రిపోర్ట్ ద్వారా బలిచ్చింది ఆడ శిశువునే అని నిర్ధారణకు వచ్చినట్లు సీపీ మహేష్ భగవత్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment