ఇళ్లలో క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్: ఉప్పల్ చిలుకానగర్‌లోని మైసమ్మ దేవాలయం వద్ద నివసించే క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటిపై లభించింది ఆడ శిశువు తలేనని ఫోరెన్సిక్ నిపుణులు నిర్థారించారు. ఈ నెల ఒకటిన లభించిన ఈ తలకు సంబంధించిన మొండెం ఆచూకీ లేకపోవడంతో ఆడా, మగా అన్నది ఇప్పటి వరకు తేలలేదు. తలకు ప్రాథమిక పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించిన ‘గాంధీ’ ఫోరెన్సిక్ వైద్యులు సైతం ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేకపోయారు. దీంతో పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు చెందిన నిపుణుల సహాయం కోరారు. ఈ తలకు సంబంధించిన పుర్రె నిర్మాణం తదితరాలను అధ్యయనం చేసిన నిపుణులు.. ఆడ శిశువు తలగా ప్రాథమికంగా నిర్ధారిస్తూ శుక్రవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న రాజశేఖర్ పోలీసు విచారణలో నోరు విప్పట్లేదు. అదుపులోకి తీసుకుని విచారించిన తొలిరోజు తానే నరబలి ఇచ్చానంటూ చెప్పినా ఆపై మాట మార్చాడు.
పోలీసులు పదేపదే ప్రశ్నించినందుకు అలా చెప్పానంటూ చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇతడి నుంచి ఆశించిన సమాచారం రాకపోవడంతో దర్యాప్తు అధికారులు సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సిటీకి చెందిన ప్రత్యేక క్లూస్ టీమ్‌ను చిలుకానగర్‌కు రప్పించారు. ప్రధాన అనుమానితుడు రాజశేఖర్ ఇంటితో పాటు చుట్టుపక్కల మరికొన్ని ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు. రాజశేఖర్ ఇంటికి సంబంధించి అతడు నివసించే డాబాతో పాటు పక్కనే ఓ రేకుల షెడ్డు కూడా ఉంది. దీనిపై అనుమానాస్పద స్థితిలో ఉన్న వెదురు చీపురును అధికారులు గుర్తించారు. దీంతో పాటు లభించిన కొన్ని వస్తువుల్ని అనుమానిత వస్తువుల జాబితాలోకి చేర్చారు. ఇలాంటి వాటిని సాధారణంగా క్షుద్రపూజల కోసం వినియోగిస్తారని అనుమానిస్తున్న అధికారులు.. నిర్థారణ కోసం అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. రాజశేఖర్ ఇంటి బెడ్‌రూమ్‌లో కొన్ని అనుమానిత మరకల్నీ ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. ఇవేంటనేవి గుర్తించేందుకు పరీక్షలకు పంపారు. శనివారం ఆ నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఉప్పల్ పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 71 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.
మరోపక్క శవమైన చిన్నారి ఎవరనేది ఇప్పటికీ స్పష్టత రాలేదు. కరీంనగర్ జిల్లా తండాల నుంచి తీసుకువచ్చిన శిశువుగా వార్తలు రావడంతో ప్రత్యేక పోలీసు బృందాలు ఆ జిల్లాలో ఆరా తీశాయి. తండాల్లో విచారించినప్పటికీ ఎలాంటి సమాచారం రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలపై కూపీ లాగుతున్నారు. గతేడాది çనవంబర్ నెలలో పాతబస్తీలోని ఓ ప్రాంతం నుంచి శిశువు అదృశ్యమైనట్లు ఉప్పల్ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆ శిశువుకు తల్లిదండ్రుల నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు తెలిసింది. ఈ నమానాలకు రాజశేఖర్ ఇంటిపై లభించిన తల నుంచి సేకరించిన నమూనాలతో పోలుస్తూ డీఎన్‌ఏ పరీక్షలు చేయనున్నారని సమాచారం. మిస్టరీగా మారి, పోలీసులకు సవాల్ విసురుతున్న ఈ కేసుపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment