కర్నూలు మెడికల్ కళాశాలలోని ఫోరెన్సిక్ విభాగం భవనం
ఫోరెన్సిక్ విభాగంలో చేరేందుకు వైద్య విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడమే ప్రధాన విధి కావడంతో విద్యార్థులు అనాసక్తి చూపుతున్నారు. కర్నూలు మెడికల్ కళాశాలలో ఫోరెన్సిక్ విభాగంలో రెండు పీజీ సీట్లు ఉన్నాయి. ఇవి కూడా ఏటా భర్తీకి నోచుకోవడం లేదు. ఏ పీజీ సీటు రాని వారు ఇందులో చేరినా మధ్యలోనే మానేస్తున్నారు. ప్రస్తుతం ఇందులో సిబ్బంది కొరత వేధిస్తోంది. పోస్టుమార్టం చేయడం, కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుండటంతో ఉన్నవారిపై భారం పడుతోంది.
కర్నూలు(హాస్పిటల్): వైద్య వృత్తి, పోలీసు విభాగంలో ఉన్నవారు వృత్తిరీత్యా మృతదేహాలను వారు తరచూ చూడాల్సి వస్తుంది. అయితే మృతదేహాలను చూడటం వేరు, వాటికి పోస్టుమార్టం చేయడం వేరు. పోస్టుమార్టం చేయడానికి మనోధైర్యం కావాలి. అయితే చాలామందికి మనోధైర్యం ఉండదు. ఈ కారణంగానే ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో చేరే వైద్య విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. చేరినా మధ్యలోనే మానేసి వెళ్లిపోతున్న సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.
అభ్యసనకు దూరంగా విద్యార్థులు..
ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు ఫోరెన్సిక్ మెడిసిన్ ఒక సబ్జెక్ట్‌గా ఉంటుంది. విద్యార్థులు ఆరు నెలల పాటు ఈ విభాగంలో అభ్యసించాల్సి ఉంటుంది. కానీ చాలా మంది వైద్య విద్యార్థులు ఏదో విధంగా ఈ సబ్జెక్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారనే విమర్శలున్నాయి. ఇక పోస్టుమార్టం చేసే విధానాన్ని ఇక్కడి కళాశాలలో చాలా మంది విద్యార్థులు నేర్చుకోవడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మెడికల్ ఆఫీసర్లుగా వెళ్తే అక్కడకు వచ్చే మృతదేహాలకు వీరు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటోంది. పోస్టుమార్టంపై అవగాహన లేకపోవడంతో జిల్లాలో నంద్యాల, ఆదోని మినహా జిల్లాలో ఎక్కడ మెడికో లీగల్ కేసు మరణం సంభవించినా మృతదేహాలను దాదాపు కర్నూలుకే పోస్టుమార్టం కోసం పంపిస్తున్న ఘటనలు అనేకం.
వైద్యుల కొరత
ఏటా రెండు పీజీ సీట్లు భర్తీ అయితే మూడేళ్లకు ఆరుగురు పీజీ వైద్యులు అందుబాటులో ఉంటారు. అయితే ఫోరెన్సిక్ విభాగంలో ప్రస్తుతం ఒక్క పీజీ వైద్య విద్యార్థే అభ్యసిస్తున్నారు. ఈ విభాగంలో రెండు ప్రొఫెసర్, రెండు అసోసియేట్, నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండాలి. ప్రస్తుతం ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్, ఇద్దరు అసిస్టెంట్ వైద్యులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. వైద్యుల కొరతతో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సాయంత్రం 5 గంటలు దాటితే మృతదేహాలకు పోస్టుమార్టం జరగదు. మరునాడు ఉదయం 10 గంటల తర్వాతే పోస్టుమార్టం నిర్వహించాల్సి వస్తోంది. దీనికితోడు పోస్టుమార్టం చేసిన కేసుల నిమిత్తం నివేదికలు తయారు చేయడం, తరచూ కోర్టులకు వెళ్లి రావడం వల్ల కూడా ఉన్న వారిపై భారం పడుతోంది. వైద్యవృత్తిలో ఎంతో కీలకమైన ఈ విభాగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
పీజీలో చేరే వారేరీ?
కర్నూలు వైద్య కళాశాలలోని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో రెండు పీజీ సీట్లు ఉన్నాయి. ఏటా పీజీ సీట్ల భర్తీ అన్ని విభాగాలతో పాటు ఈ విభాగానికి జరుగుతుంది. ఏ సీటు రాని వారే ఫోరెన్సిక్ విభాగం పీజీ సీటును తీసుకుంటారనే వాదన కూడా ఉంది. ఈ విభాగంలో చేరుతున్న వైద్య విద్యార్థులు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో, ఏ పీజీ సీటు రాని వారు ఇందులో చేరినా మధ్యలో వెళ్లిపోతున్నారు. 2009–10లో డాక్టర్ జోషి కుమార్, 2014–15లో డాక్టర్ సునీల్‌బాబు, 2016–17లో డాక్టర్ ఎం. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కోర్సులో చేరి మధ్యలో మానేశారు. 2011–12, 2012–13, 2013–14, 2015–16, 2018–19 విద్యా సంవత్సరాల్లో ఒక్క విద్యార్థి కూడా ఇందులో చేరలేదంటే విద్యార్థుల అనాసక్తిని అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment