పాలకా.. ఇదిగో.. సమస్యల మాలిక | Here's cracked up to the problems of governing | Sakshi
Sakshi News home page

పాలకా.. ఇదిగో.. సమస్యల మాలిక

Published Sat, Dec 27 2014 3:45 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

Here's cracked up to the problems of governing

కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గం ఈ ఏడాది రెండోసారి సమావేశం కానుంది. శనివారం ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు జెడ్పీ చైర్మన్ ఎం. రాజశేఖరగౌడ్ నిర్ణయించారు. సమావేశంలో విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, రహదారులు, భవనాల శాఖ, చిన్ననీటిపారుదల శాఖలపై ప్రగతి నివేదిక, సమస్యలపై చర్చించనున్నారు. సమావేశానికి హాజరుకావాలని జెడ్పీటీసీ సభ్యులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం పంపినట్లు జెడ్పీ సీఈవో బీఆర్ ఈశ్వర్ తెలిపారు. సమావేశాన్ని పురస్కరించుకుని ఆయా శాఖల్లో నెలకొన్న సమస్యలను అవలోకిస్తే..
 
 కాకిలెక్కలతో ఊదరగొడుతున్న విద్యాశాఖ
 జిల్లాలో 2,924 పాఠశాలలకు గాను 780 పాఠశాలకు మాత్రమే వంట గదులు ఉన్నాయి. ప్రస్తుతం 142 పాఠశాలల్లో నిర్మాణం జరుగుతోంది. 546 పాఠశాలల్లో తాగునీటి సదుపాయం, 385 పాఠశాలల్లో మరుగుదొడ్లు, 2,300 పాఠశాలల్లో బెంచీలు, 1,715 పాఠశాలలకు క్రీడా మైదానాలు, 366 పాఠశాలలకు విద్యుత్ సౌకర్యం, 494 పాఠశాలలకు కాంపౌండ్ వాల్‌లు లేవు. విద్యాసంవత్సరం ముగుస్తున్నా 14 మండలాలతో పాటు ఇతర మండలాల్లోని అనేక పాఠశాలలకు విద్యార్థుల యూనిఫాంను పంపిణీ చేయలేకపోయారు. ఆగస్టు నాటికి జిల్లాలో 101 మంది విద్యార్థులు మాత్రమే బడి బయట ఉన్నట్లు ఎస్‌ఎస్‌ఏ అధికారులు కాకి లెక్కలు చూపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అనేక పాఠశాలల్లో అవసరం లేకపోయినా అదనపు తరగతి గదులు నిర్మించారు. 5,74,180 మంది విద్యార్థులకు గాను 94,545 మంది(84 శాతం) మందికి మాత్రమే ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేశారు. పాఠశాలల్లో కొత్త సిలబస్ అగమ్యగోచరంగా తయారైంది. అటు ఉపాధ్యాయులకే ఈ సిలబస్‌పై సరైన శిక్షణ లేకపోవడంతో వారు విద్యార్థులకు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. దీంతో పాటు ఇటీవల నిర్వహించిన సమ్మెటివ్ పరీక్షలు గందరగోళంగా మారాయి.
 
 జిల్లాలో కరువు చాయలు
 జిల్లాలో సగటు వర్షపాతం కంటే చాలా తక్కువగా వర్షం కురిసింది. దీంతో అన్ని మండలాల్లో కరువు నెలకొంది. జిల్లా అధికారులు 34 మండలాల్లో తీవ్ర కరువు చాయలు ఉన్నట్లు నివేదిక పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 12 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. రుణమాఫీపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడంతో అటు రైతులు పాతబకాయిలు చెల్లించలేదు.
 
  దీన్ని ఆసరాగా తీసుకుని బ్యాంకులు సైతం కొత్త రుణాలు మంజూరు చేయలేదు. ఆచితూచి ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ అంతంగానే ఉంది.  జిల్లాలో 5,24,000 మందికి రుణమాఫీ చేయాలని అధికారులు పంపగా 2,88,000 మంది రైతులకు మాత్రమేమాఫీ వర్తించింది. అది కూడా అరకొరగా మాఫీ చేశారు. మిగిలిన వారికి రిమార్కుల పేరుతో మాఫీ చేయలేదు. వేరుశనగ, ఆముదం, పత్తి పంటలకు గిట్టుబాటు ధర లేదు.
 
 వైద్యులు రారు...రోగాలూ తగ్గవు..
 జిల్లాలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 12 సామాజిక ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులతో పాటు కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సగం మంది వైద్యులు విధులకు డుమ్మా కొడుతున్నారు. అక్కడ వైద్యులు లేరని జిల్లా ఆసుపత్రులు, పెద్దాసుపత్రికి రోగులు తరలి వస్తున్నారు.
 
  రోగం వచ్చిన తర్వాత వైద్యం చేసే మాట అటుంచి అసలు వ్యాధి నివారణ చర్యలు తీసుకోవడంలోనూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ కారణంగా డెంగీ, మలేరియా వంటి వ్యాధులు జిల్లాలో అధికంగా నమోదవుతున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్ చెత్తాచెదారంతో కంపు కొడుతున్నాయి. వైద్యులు, పారామెడికల్ సిబ్బందిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఈ దుస్థితి దాపురించింది. పెద్దాసుపత్రిలోనూ వైద్యుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. వేళలు పాటించకపోవడంతో జూనియర్లతో రోగులు చికిత్స చేసుకుని వెళ్లాల్సి వస్తోంది.
 
 చిన్నబోయిన ఆయకట్టు
 చిన్ననీటిపారుదల శాఖ పరిధిలోని నంద్యాల డివిజన్‌లో 109 చెరువులు 45,620 ఎకరాల ఆయకట్టు ఉంది. కర్నూలు డివిజన్‌లో 48 చెరువుల కింద 18,249 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువుల్లో పూడికతీత అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల వినియోగంలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఎకరం ఆయకట్టు కూడా పెరగలేదు. నాలుగేళ్లుగా ఈ శాఖ పరిధిలో ఉన్న చెరువుల కింద పది శాతం కూడా సాగు కాకపోవడమే ఇందుకు నిదర్శనం. గత ప్రభుత్వ హయాంలో ఈ చెరువుల మరమ్మతులు, కరకట్టల బలోపేతం కోసం దాదాపుగా రూ.200 కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement