హర్ష ప్రణీత్‌రెడ్డి (ఫైల్), కర్నూలు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద గుమిగూడిన మెడికల్ కళాశాల విద్యార్థులు
కర్నూలు(హాస్పిటల్): ‘నాన్నా..ఇక్కడ నేను చదవలేను..రోజురోజుకూ ర్యాగింగ్ వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ తండ్రితో చెప్పిన కొద్దిరోజులకే ఓ వైద్యవిద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. కడప జిల్లాకు చెందిన హర్ష ప్రణీత్‌రెడ్డి(19) కర్నూలు మెడికల్ కళాశాల(కేఎంసీ)లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం అర్ధరాత్రి హాస్టల్‌లోని తన గదిలో అచేతనంగా పడి ఉండడాన్ని గమనించిన సహచర విద్యార్థులు అతనికి వెంటనే ప్రథమ చికిత్స చేసి .. ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన కర్నూలు మెడికల్ కళాశాలలో కలకలం రేపుతోంది. అయితే అంతకు కొద్ది రోజుల ముందు .. హర్ష ప్రణీత్‌రెడ్డి తండ్రి రామాంజులురెడ్డితో ఫోన్‌లో జరిపిన సంభాషణ తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
కడప నగరంలోని అరవిందనగర్‌లో నివాసం ఉంటున్న రామాంజులురెడ్డికి ఇద్దరు కుమారులు. ఆయన అక్కడి కోర్టులో టైపిస్ట్‌గా పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు జైపూర్ ఐఐటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కుమారుడు హర్షప్రణీత్‌రెడ్డి మొదటి నుంచీ చదువులో ప్రతిభ కనబరుస్తూ టెన్త్‌లో 10/10 పాయింట్లు, ఇంటర్‌లో 985 మార్కులు, ఎంసెట్‌లో 315వ ర్యాంకు సాధించాడు. కర్నూలు మెడికల్ కళాశాలలో సీటు సాధించి హాస్టల్‌లో ఉండి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి 11.20 గంటలకు రూమ్‌మేట్స్ చదువుకోవడానికి మేడపైకి వెళ్లారు. అనంతరం హర్ష గది లోపల గడియ పెట్టుకున్నాడు. 12.30 గంటలకు సహ విద్యార్థులు మేడపై నుంచి కిందకు దిగారు. ఎంతసేపు తలుపు కొట్టినా హర్ష తీయలేదు.
పక్క గదుల్లో ఉన్న వారిని పిలిచారు. వారు తలుపు కొట్టినా స్పందన లేదు. దీంతో తలుపు బద్దలు కొట్టి.. లోపలి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు. హర్ష గదిలోని ఫ్యాన్‌కు టవళ్లతో ఉరేసుకుని కింద పడడంతో ఇనుప మంచం సైతం వంగిపోయింది. సహచర విద్యార్థులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చివరి ప్రయత్నంగా ప్రభుత్వ ఆస్పత్రి క్యాజువాలిటీకి తీసుకెళ్లారు. అక్కడ శ్వాస అందించేందుకు అంబూ బ్యాగ్‌తో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. టుటౌన్ సీఐ మురళీకృష్ణరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
‘తండ్రి : నాన్నా.. ఆరోగ్యం బాగా చూసుకో. రోజూ యోగా చేయి. ఆరోగ్యం బాగుంటుంది. ఏకాగ్రత పెరిగి చదివిన చదువు బాగా గుర్తుంటుంది.
కుమారుడు : నాన్నా.. ఇక్కడ(కేఎంసీ హాస్టల్) నీవు చెప్పే యోగా విన్యాసాల కంటే ర్యాగింగ్ విన్యాసాలే కష్టంగా ఉన్నాయి. ర్యాగింగ్‌లో పడే పాట్ల కంటే నాకు యోగా ఓ లెక్క కాదు.
ఇక్కడ నేను చదవలేను నాన్నా.
తండ్రి : కొత్తలో అలాగే ఉంటుంది.. ఏం కాదులే. చదువుపైనే దృష్టి పెట్టు.
కుమారుడు : ఇక్కడి ర్యాగింగ్‌తో ఏకాగ్రతగా చదవలేకపోతున్నా నాన్నా.
తండ్రి : ధైర్యంగా ఉండు. అప్పుడప్పుడూ నేను, మీ అమ్మా వచ్చి కలుస్తుంటాములే.
కుమారుడు : అలాగే నాన్నా.’
ర్యాగింగ్ వల్లే చనిపోయాడు
నా కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్. అన్ని సర్టిఫికెట్లు తెచ్చి చూపిస్తా. రాత్రి 1.20 గంటలకు నాకు మెసేజ్ వచ్చింది. మీ కుమారుడు బాత్‌రూమ్‌లో కిండపడ్డాడని, సీరియస్‌గా ఉందని. ఉదయం ఇక్కడికి వచ్చి చూస్తే శవమై కనిపించాడు. దీన్ని నేను హత్యగానే భావిస్తున్నా. చనిపోయిన విషయాన్ని ముందుగా చెప్పకుండా దాచిపెట్టారు. పూర్తి సమాచారం ఎవరూ ఇవ్వడం లేదు. నా కుమారుడికి చదువు ఒత్తిడి ఎక్కడా లేదు. ఆడుతూ పాడుతూ చదివే అలవాటు వాడిది. ఇలా విగతజీవిగా చూస్తాననుకోలేదు. – రామాంజులురెడ్డి, హర్ష తండ్రి
కళాశాలలో ర్యాగింగ్ లేదు
హర్ష ప్రణీత్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. ఈ నెల 10 నుంచి వార్షిక పరీక్షలు ఉన్నాయి. అతను యావరేజ్ స్టూడెంట్. చదువుపై ఒత్తిడితో ఉండే వారిని ప్రత్యేకంగా పిలిచి ధైర్యం చెప్పేవాళ్లం. అలాగే హర్షకూ చెప్పాం. బహుశా పరీక్షల భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండే అవకాశముంది. అయినా ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేయిస్తాం. నిజంగా ర్యాగింగ్ జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. కుమారుడి మరణవార్తను వెంటనే చెబితే వారు ఆందోళనకు గురవుతారనే ఉద్దేశంతోనే సహ విద్యార్థులు సీరియస్‌గా ఉందని మాత్రమే చెప్పారు. అంతేగానీ మరణ విషయాన్ని దాచిపెట్టాలన్న ఉద్దేశం లేదు. – డాక్టర్ జీఎస్ రామప్రసాద్, కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్
దర్యాప్తు చేస్తున్నాం..
వైద్య విద్యార్థి ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. చదువు ఒత్తిడే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. మొబైల్‌లో తరచూ ఛాటింగ్ చేస్తూ.. మెసేజ్‌లను డిలీట్ చేసేవాడని సమాచారముంది. దీంతో అతని కాల్‌డేటాను పరిశీలిస్తున్నాం. – టూటౌన్ సీఐ మురళీధర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment