నిజాలు దేవుడికెరుక: మహా సాగరంలో మృత్యుఘోష | Ship sinks into Pacific Ocean over Pasadena Beach | Sakshi
Sakshi News home page

నిజాలు దేవుడికెరుక: మహా సాగరంలో మృత్యుఘోష

Published Sun, Feb 9 2014 3:51 AM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM

నిజాలు దేవుడికెరుక:  మహా సాగరంలో మృత్యుఘోష - Sakshi

నిజాలు దేవుడికెరుక: మహా సాగరంలో మృత్యుఘోష

బ్రిటిష్ కొలంబియా 1933. పషేనా బీచ్‌లోని లైట్‌హౌస్ వెలుతురులో కూర్చుని ఉన్నారు ఇద్దరు స్నేహితులు. రోజంతా చేపల వేటతో అలసిపోయిన వారికి... ఆ వెన్నెల్లో, చల్లగాలిలో కూర్చుని కబుర్లాడుకోవడం హాయినిస్తోంది.  ‘‘ఇవాళ మన అదృష్టం పండిందిరా. ఈమధ్య కాలంలో ఇన్ని చేపలు ఎప్పుడూ పడలేదు’’ అన్నాడో వ్యక్తి ఆనందంగా.  ‘‘మన సంగతి సరేరా... వాడెవడు ఇప్పటివరకూ వేటాడి ఇప్పుడొస్తున్నాడు?’’ అన్నాడు రెండో వ్యక్తి సముద్రంవైపు చూస్తూ. అతడు చూపించినవైపు చూశాడు మొదటి వ్యక్తి.


 ఓ పడవ అలలపై తేలుతూ మెల్లగా వచ్చి ఒడ్డున ఆగింది. ఇద్దరూ లేచి అటు నడిచారు. అయితే పడవలో మనుషులెవరూ లేకపోవడంతో ముఖముఖాలు చూసుకున్నారు.  ‘‘ఎవరూ లేరేంట్రా?’’  ‘‘ఏమో... కొంపదీసి ఎవరైనా సముద్రంలో పడిపోయి ఉంటారంటావా? లేకపోతే పడవలో పడుకున్నాడా?’’ అంటూ పడవ అడుగు భాగంవైపు చూశాడు రెండో వ్యక్తి.  అంతే... అతడి గుండె గుభేల్‌మంది. వామ్మో అంటూ రెండడుగులు వెనక్కి వేశాడు. ‘‘ఏమైంది’’ అంటూ పడవలోకి చూసిన స్నేహితుడి కళ్లు భయంతో వెడల్పయ్యాయి. ఇద్దరూ వెంటనే పోలీస్ స్టేషన్‌కి పరుగెత్తారు.
    
 ‘‘మైగాడ్... ఇది వ్యాలెన్సియాకి సంబంధించిన లైఫ్‌బోట్ కదూ...?’’... దాని మీద ఉన్న లోగోని చూస్తూనే అన్నాడు ఇన్‌స్పెక్టర్. ఆ మాట వింటూనే అందరూ షాకైపోయారు. ‘‘నిజమా?’’ అన్నారు ముక్తకంఠంతో.  అవునన్నట్టుగా తలాడించి పడవలోకి చూశాడు ఇన్‌స్పెక్టర్. నాలుగు అస్థిపంజరాలు వెన్నెల్లో తెల్లగా మెరుస్తున్నాయి.  ‘‘వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించమంటారా?’’... అడిగాడు సబార్డినేట్.
 ‘‘ఏం చేసుకోవడానికి... ఏం తెలుసుకోవడానికి? ఎప్పుడో ఇరవై ఏడేళ్ల క్రితం తప్పిపోయిన పడవ ఇది. ఇన్నాళ్ల తర్వాత ఇక్కడికెలా వచ్చింది? అయినా ఇన్నేళ్ల పాటు దాని పెయింట్‌గానీ, లోగో కానీ పోలేదు. ఇదెలా సాధ్యం? ఈ అస్థిపంజరాలు అప్పుడు చనిపోయినవారివేనా లేక...’’  వరుసగా ఆలోచనలు చొరబడుతూనే ఉన్నాయి ఇన్‌స్పెక్టర్ బుర్రలోకి. వాటన్నిటినీ ముడివేసే ప్రయత్నంలో అతడు ఇరవై ఏడేళ్లు వెనక్కి వెళ్లాడు.
    
 జనవరి 20, 1906... శాన్ ఫ్రాన్సిస్కో ఓడరేవు.  సాయంత్రం కావస్తోంది. వెనిజులా వెళ్లాల్సిన ఎస్.ఎస్. వ్యాలెన్సియా సిద్ధంగా ఉంది. 108 మంది ప్రయాణీకులు, 65 మంది సిబ్బందితో కిటకిటలాడుతోంది. ప్రయాణీకులంతా సామాన్లు చక్కబెట్టుకోవడంలో మునిగిపోయారు. పిల్లలంతా డెక్ మీదికి చేరి సముద్రం వైపు చూస్తూ కేరింతలు కొడుతున్నారు. లంగరు పడింది. ఓడ కదిలింది. అలలపై ఊగుతూ, అలవోకగా ప్రయాణం ప్రారంభించింది వ్యాలెన్సియా.  కాసేపటికి కారుచీకట్లు కమ్ముకున్నాయి. సముద్రం మీద నుంచి చల్లనిగాలి రివ్వున దూసుకొస్తుంటే... తలుపులు, కిటికీలు మూసేసి, బ్లాంకెట్లలో శరీరాల్ని దూర్చేశారంతా. సమయం పది గంటలు అయ్యేసరికి అందరూ నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి కావస్తోంది. ఓడంతా నిశ్శబ్దం. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. అంతలో... ఒక్కసారిగా పెద్ద కుదుపు. ఉలిక్కిపడి కళ్లు తెరిచారంతా. గబగబా గదుల్లోంచి బయటకు వచ్చారు. ఏమయ్యిందంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఎవరి దగ్గరా సమాధానం లేదు. మనసు ఏదో కీడు శంకించింది. ఒకరిద్దరు కెప్టెన్ దగ్గరకు వెళ్లారు.
 
 ‘‘కెప్టెన్... ఏంటా కుదుపు? ఏమయ్యింది?’’ కంగారుగా అడిగారు.
 ‘‘వియ్ ఆర్ ఇన్ డేంజర్. ఓడ మునిగిపోబోతోంది’’
 కెప్టెన్ మాట వింటూనే ‘‘నో’’ అంటూ అరిచారు వాళ్లు. ఆ అరుపు విని అందరూ అక్కడకు చేరుకున్నారు.
 ‘‘ఎదురుగా మరో ఓడ వస్తోంది. దాన్ని తప్పించే ప్రయత్నంలో మన ఓడ రాళ్లను ఢీకొట్టింది.’’
 అందరి కళ్లలో భయం. ముఖాల్లో అందోళన. ‘‘ఆలస్యం చేయవద్దు. లైఫ్ బోట్లు తీయండి. లేదంటే అందరం మునిగిపోతాం’’... అరిచినట్టే అన్నాడు కెప్టెన్. వెంటనే సిబ్బంది అలెర్ట్ అయ్యి లైఫ్ బోట్లు తీయసాగారు. అయితే దురదృష్టం ఆ ఓడలో పాగా వేసుకుని కూచుంది. పడవలను నీటిలోకి దించుతుండగా ఒకటి విరిగిపోయింది. రెండు జారి నీటిలో బోల్తాపడి క్షణాల్లో మునిగిపోయాయి. అందరూ వణికిపోయారు. సిబ్బంది మాత్రం మనోనిబ్బరంతో పని చేస్తున్నారు. ఓ రెండు బోట్లను జాగ్రత్తగా దించి, వాటిలోకి  పట్టినంతమందిని ఎక్కించారు. ఓడను విడిచి అవి దూరంగా జరిగాయి. కాసింత దూరం వెళ్లాయో లేదో... పెద్ద అల ఒకటి వచ్చి ఆ పడవలను తాకింది. అంతే... రెండూ తిరగబడిపోయాయి. వాటిలోని ప్రయాణికులంతా మునిగిపోయారు.
 
 దాన్ని చూసి మిగతావారంతా బిక్కచచ్చిపోయారు. విధి తమమీద పగబట్టినట్టుగా అనిపిస్తోంది. సముద్రపు అలలు రక్కసి కోరలై తమను కాటేసేందుకు కాచుకుని కూర్చున్నట్టుగా ఉంది. మృత్యువు చెవి దగ్గర చేరి రమ్మని పిలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. కొందరు కాపాడమంటూ దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు. ఈదుకుని వెళ్లి అయినా ప్రాణాలు కాపాడుకుందామనే ఆశతో కొందరు నీటిలో దూకేస్తున్నారు. కానీ అది అత్యాశ అని వాళ్లకి దూకాకగానీ తెలియలేదు. నీళ్లు మంచు అంత చల్లగా ఉన్నాయి. ఆ చల్లదనం నరాల్ని కాల్చేస్తోంటే ఒళ్లంతా బాధతో భగ్గుమంటోంది. వారి శరీరాలు ఎంతోసేపు ఆ బాధను తాళలేకపోయాయి. బతుకుతామన్న నమ్మకంతో పాటు బతకాలన్న ఆశ కూడా చచ్చిపోయింది. కొద్ది నిమిషాల్లో వాళ్ల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
 
 ఇక మిగిలింది నాలుగు లైఫ్ బోట్లు. వాటిలో మరికొందరిని ఎక్కించి వదిలారు సిబ్బంది. అవి రెండూ మెల్లగా దరి దారి పట్టాయి. మిగతా వారిని ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగానే ఓ పెద్ద శబ్దం. అదేంటా అని అందరూ చూస్తూండగానే... ఫెళఫెళమంటూ ఓడ ముక్కలైపోయింది. క్షణం పాటు పిల్లల కేకలు, పెద్దల ఆర్తనాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. మరుక్షణంలో ఆ శబ్దాలు సముద్రఘోషలో కలిసిపోయాయి. వారి శరీరాలు సాగరజలంలో సమాధి అయ్యాయి.
 
 పాతికేళ్లపాటు పసిఫిక్ సముద్రంలో మహారాణిలా హుందాగా తిరిగిన వ్యాలెన్సియా కథ అలా ముగిసింది. మహాసముద్రాన్ని శ్మశానవాటికగా మార్చి మరీ అది తన పేరు చరిత్రలో శాశ్వతంగా లిఖించుకుంది.
    
 అయితే ఆ రోజు ఆ నాలుగు లైఫ్ బోట్లలో రెండు మాత్రమే ఒడ్డుకు చేరాయి. ముప్ఫై ఏడుమందిని మాత్రమే సజీవంగా ప్రపంచం ముందు నిలిపాయి. మిగతా రెండు బోట్లూ అదృశ్యమయ్యాయి. వాటిలో ఒకటి కొన్ని వారాల తరువాత ఓ గుహలో దొరికింది. అందులో కొన్ని అస్థిపంజరాలు ఉన్నాయి. పడవ గుహలో ఇరుక్కుపోయి ఉంటుందని, ఊపిరాడక అందరూ చనిపోయి ఉంటారని అంచనా వేశారు. అయితే రెండో పడవ జాడ మాత్రం తెలియలేదు. అది ఇన్నేళ్ల తరువాత... ఇలా కనిపిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు!
 
 అప్పట్లో వ్యాలెన్సియా ఘటన యావత్ ప్రపంచాన్నీ వణికించింది. ఎందరి మనసులనో కదిలించింది. అందరూ దాన్ని ఘోర దుర్ఘటన అన్నారు. కానీ ప్రమాదం నుంచి తప్పించుకున్న కొందరు మాత్రం... దాన్ని ఓ హారర్ స్టోరీ అన్నారు. అలా అనడానికి కారణం ఉంది. ఓడ ప్రమాదానికి గురయ్యే ముందు మరో షిప్ ఎదురుగా వచ్చిందని, దాన్ని తప్పించే ప్రమాదంలో రాయిని ఢీకొందని చెప్పాడు కెప్టెన్. కానీ అసలలాంటిదేమీ జరగలేదు. ఆ రూట్లో మరో ఓడగానీ, పడవగానీ రాలేదు. మరి ఆ ఓడ ఎక్కడిది?  దానికితోడు ఓడను ముక్కలు చేసేంత పెద్ద రాళ్లు అక్కడ లేవు. మరి అంత దారుణంగా ఎలా ముక్కలు చెక్కలయ్యింది. ఇంజిన్లో లోపాలు లేవు. అసలు ప్రమాదం జరగడానికి మరే కారణమూ కన్పించలేదు. దాంతో బోలెడన్ని అనుమానాలు రేకెత్తాయి.
 
 బ్రిటిష్ కొలంబియాలోని పషేనా బీచ్‌కి దగ్గర్లోనే వ్యాలెన్సియా ప్రమాదానికి గురయ్యింది. అప్పట్నుంచీ అక్కడ విచిత్రమైన అరుపులు వినిపిస్తుంటాయని, ప్రమాదంలో మరణించిన వారు దెయ్యాలై అక్కడ సంచరిస్తున్నారని ఆ చుట్టుపక్కల వారు కొందరు అంటుంటారు. ‘గ్రేవ్‌యార్‌‌డ ఆఫ్ ద పసిఫిక్’గా చరిత్రలో నిలిచిపోయిన ఓడ: ఎస్.ఎస్. వ్యాలెన్సియా
 
 అక్కడేవో దుష్టశక్తులు ఉన్నాయని, అవే ఈ ప్రమాదానికి కారణమని, లైఫ్‌బోట్లను కూడా అవి కదలనివ్వలేదని, చివర్లో బయలుదేరిన నాలుగు పడవల్లో రెండింటిని అవే దారి మళ్లించాయని ప్రమాదం నుంచి తప్పించుకున్న కొందరు ప్రయాణికులు చెప్పడం విశేషం. అదంతా భ్రమ అని అధికారులు చెబుతున్నా వాళ్లు ఒప్పుకోలేదు. లేని ఓడ ఉన్నట్టు ఎలా కనిపించింది అని ఎదురు ప్రశ్నించారు. అది కచ్చితంగా దెయ్యాల పనే అన్నారు. ప్రమాదానికి అసలైన కారణాలు తెలియనందున అధికారులు కూడా మాట్లాడలేకపోయారు. దాంతో వ్యాలెన్సియా సంఘటన ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇంతకీ ఆ ఘోరకలికి కారణం ప్రమాదమా? మానవ తప్పిదమా? దుష్టశక్తుల నీడా? ఏమో... నిజాలు దేవుడికెరుక!
 - సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement